Afghanistan Cricketers : ప్రపంచ క్రికెట్లో అఫ్గనిస్థాన్ (Afghanistan) జట్టు సంచలనాలకు కేరాఫ్. పొట్టి ప్రపంచ కప్‌లో ఏకంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన రషీద్ ఖాన్ బృందం తమ దేశంలో క్రికెట్‌కు ఆదరణ తగ్గలేదని చాటింది. అయితే.. ఆ దేశంలోనే పుట్టిన అమ్మాయిలు మాత్రం అన్ని ఆటలకు దూరమయ్యారు. వరల్డ్ కప్‌లో పురుషుల జట్టు సంచలన విజయాలు చూశాక.. వాళ్లలో క్రికెట్ ఆడాలనే కోరిక మళ్లీ చిగురించింది. తమకు నచ్చిన క్రికెట్ ఆడాలని ఆశపడుతున్నారు.
గతంలో అఫ్గనిస్థాన్ జట్టుకు ఆడిన 17 మంది అమ్మాయిల బృందం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు ఓ లేఖ రాసింది. ఆస్ట్రేలియాలో తమకోసం శరణార్థుల జట్టును ఏర్పాటు చేయాలని ఐసీసీని ప్రాధేయపడింది. ‘అఫ్గనిస్థాన్ పురుషుల జట్టు మాదిరిగానే మేమూ పెద్ద టోర్నీల్లో ఆడాలని కలగంటున్నాం. క్రికెట్ ఆడాలనుకుంటున్న అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి అఫ్గన్ మహిళల శక్తిని ప్రపంచానికి చాటుతాం.
అందుకోసం మీరు మాకు కోచ్‌ల నియామకంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలవాలి. మా కలను నిజం చేసుకొనే అవకాశం కల్పించండి. మేమంతా ఒకే జట్టుగా ఆడాలని అనుకుంటున్నామ’ని ఆ లేఖలో అఫ్గన్ అమ్మాయిలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రపంచ క్రికెట్లో మహిళలను ప్రోత్సహిస్తూ ఐసీసీ టోర్నీల ప్రైజ్‌మనీ పెంచిన ఐసీసీ.. అఫ్గన్ అమ్మాయిల వినతిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
అఫ్గనిస్థాన్‌లో రెండేండ్ల క్రితం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చిన తాలిబాన్లు.. అక్కడి ఆడవాళ్లపై, అమ్మాయిలపై అన్నింటా ఆంక్షలు విధించారు. అమ్మాయిలకు చదువుకునే హక్కు లేదు. ఇక ఆటలు ఆడేందుకు చాన్స్ ఉంటే ఒట్టు. దాంతో, చాలామంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. అలా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో తలదాచుకున్నవాళ్లలో క్రికెటర్లు, ఫుట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు.