స్మిత్‌కు ఎదురుందా..విరాట్ అందుకోగలడా..?

Tue,September 10, 2019 03:19 PM

Smith Maintains Lead over Kohli in ICC Test Rankings

దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్‌తో యాషెస్ నాలుగో టెస్టు మ్యాచ్ అనంతరం ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ రన్‌మెషీన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అందనంత దూరంలో స్మిత్ నిలిచాడు. నాలుగో టెస్టులో ఆతిథ్య బౌలర్లను నిస్సాహాయులను చేస్తూ స్మిత్(211, 82) అసాధారణ పోరాటం చేసి అదరగొట్టాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన స్మిత్‌తో పాటు స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ బంతితో విజృంభించడంతో నాలుగో టెస్టుతో పాటు యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నిలబెట్టుకుంది. ర్యాంకింగ్స్‌లోనూ వీరిద్దరి జోరు కొనసాగింది. యాషెస్ సిరీస్‌లో కఠిన పరిస్థితుల్లో ప్రత్యర్థులు, అభిమానులు ఎగతాళి చేస్తున్నప్పటికీ సంయమనంతో ఆడాడు. మైదానంలో తన కర్తవ్యాన్ని ప్రశాంతంగా నిర్వర్తించిన కంగారు మాజీ సారథి ప్రదర్శనపై దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. కోహ్లీకి కన్నా ఇంకా 34 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. ఆఖరి టెస్టులో స్మిత్ రాణిస్తే మరిన్ని రేటింగ్ పాయింట్లను తనఖాతాలో వేసుకోనున్నాడు. ఇంగ్లాండ్‌ను కట్టడి చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన కమిన్స్ 914 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్‌ను మరోసారి అందుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ రబాడ కన్నా కమిన్స్ 63 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. త్వరలో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. స్వదేశంలో గొప్ప రికార్డు కలిగిన విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటే స్మిత్‌ను దాటే ఛాన్స్ ఉంది.

బ్యాట్స్‌మెన్ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, భారత్ నుంచి టెస్టు స్పెషలిస్ట్ పుజారా, హెన్రీ నికోల్స్(కివీస్), జో రూట్(ఇంగ్లాండ్), ఆజింక్య రహానె(భారత్) వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత యువ కెరటం జస్ప్రిత్ బుమ్రా(835) మూడు, జేసన్ హోల్డర్(814) నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు.

1120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles