చెలరేగిన రాజపక్స.. శ్రీలంక ఘనవిజయం

Tue,October 8, 2019 10:16 AM

లాహోర్‌: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో శ్రీలంక యువ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్స చెలరేగడంతో లంక అలవోక విజయం సాధించింది. లాహోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కేరీర్‌లో రెండో టీ-20 మ్యాచ్‌ ఆడుతున్న రాజపక్స కేవలం 48 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 77 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో పేసర్‌ మహమ్మద్‌ అమీర్‌ 4 ఓవర్లలో ఒక్క వికెట్‌ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగిన మహమ్మద్‌ హస్‌నైన్‌ కూడా వికెట్‌ తీయకుండా 39 పరుగులు ఇచ్చాడు. కాగా, షాదాబ్‌, ఇమాద్‌ వాసిమ్‌, వాహబ్‌ రియాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 19 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. ప్రదీప్‌ 4-25 తో అదరగొట్టగా, లెగ్‌ స్పిన్నర్‌ హసరంగా 3-38తో రాణించాడు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో లంక ఇప్పటికే 2-0తో సిరీస్‌ సొంతం చేసుకోగా, చివరి మ్యాచ్‌ బుధవారం లాహోర్‌లో జరుగనుంది.

ఏ మాత్రం అనుభవం లేని లంక జట్టు టీ-20ల్లో ఘనమైన రికార్డున్న పాక్‌ను ముప్పు తిప్పలు పెడుతోంది. భద్రతా కారణాల రీత్యా లంక ప్రధాన ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు రాని విషయం తెలిసిందే.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles