పాపం జేసన్ రాయ్.. అంపైర్ తప్పిదానికి బలి..!

Thu,July 11, 2019 09:01 PM

jason roy given out because of umpires mistake

లండన్: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియాపై ధాటిగా ఆడుతున్నారు. 224 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ప్రస్తుతం 20.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 149 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఇంకా 75 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాచ్‌లో అంపైర్ తప్పిదానికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్ బలయ్యాడు.

ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 20 ఓవర్‌లో వేసిన 4వ బంతి రాయ్ లెగ్‌సైడ్ దిశగా గ్లోవ్స్‌కు సమీపం నుంచి వెళ్లింది. దీంతో అంపైర్ కుమార ధర్మసేన రాయ్‌ను అనమానాస్పద రీతిలో ఔట్ అని ప్రకటించాడు. అయితే తాను ఔట్ కాలేదని, బంతి గ్లోవ్స్‌కు తాకలేదని రాయ్ అంపైర్లతో వాదించాడు. అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడు కనుక.. రాయ్ మైదానం వీడక తప్పలేదు. కాగా ఆ బంతిని అల్ట్రా ఎడ్జ్‌లో చూడగా.. ఫ్లాట్ లైన్ కనిపించింది. దీంతో రాయ్ నాటౌట్ అని తేలింది. అయినా రాయ్ అప్పటికే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో జరిగిన మరో అంపైర్ తప్పిదానికి రాయ్ బలయ్యాడు. అప్పటికే రాయ్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలో అతను అనూహ్యంగా ఔటవడం అటు ఇంగ్లండ్ అభిమానులను కూడా నిరాశకు గురి చేసింది.

6053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles