ఎన్నాళ్లకెన్నాళ్లకు..! 27 ఏళ్ల తరువాత వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఇంగ్లండ్..!

Thu,July 11, 2019 09:54 PM

లండన్: ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ఫైనల్‌లోకి ఇంగ్లండ్ ప్రవేశించింది. 27 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే వరల్డ్ కప్ ఫైనల్‌లోకి ఆ దేశం అడుగుపెట్టింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ సెమీ ఫైనల్‌లో చాంపియన్‌లా మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో అలవోకగా బ్రిటిష్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది.


బర్మింగ్ హామ్‌లో ఇవాళ జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2019 టోర్నీ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో స్టీవెన్ స్మిత్ (119 బంతుల్లో 85 పరుగులు, 6 ఫోర్లు), అలెక్స్ కేరే (70 బంతుల్లో 46 పరుగులు, 4 ఫోర్లు)లు రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అలాగే జోఫ్రా ఆర్చర్‌కు 2, మార్క్ వుడ్‌కు 1 వికెట్ దక్కాయి.

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో జేసన్ రాయ్ (65 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే జో రూట్ (46 బంతుల్లో 49 పరుగులు నాటౌట్, 8 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (39 బంతుల్లో 45 పరుగులు నాటౌట్, 8 ఫోర్లు)లు కూడా చివర్లో మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 32.1 ఓవర్లలోనే 2వ వికెట్లను కోల్పోయి 226 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఇక ఈ నెల 14వ తేదీ ఆదివారం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది..!

6947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles