క్రిస్‌గేల్ మెరుపు సెంచరీ.. ఐనా ఓడారు!

Wed,September 11, 2019 10:47 AM

Chris Gayles Ton in Vain as Patriots Complete Highest Ever CPL Chase

సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) రసవత్తరంగా సాగుతోంది. స్వదేశంలో జరుగుతున్న టీ20 లీగ్‌లో కరీబియన్ స్టార్లతో పాటు విదేశీ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. లీగ్‌లో భాగంగా మంగళవారం జమైకా తలావాస్, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్ పాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వీరబాదుడు బాదుతుంటే.. బౌలర్లు బెంబేలెత్తిపోయారు. హిట్టర్లందరూ వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అభిమానులను అలరించారు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్(116: 62 బంతుల్లో 7ఫోర్లు, 10సిక్సర్లు) మెరుపు శతకంతో విజృంభించడంతో జమైకా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. గేల్‌తో పాటు చడ్విక్ వాల్టన్(73: 36 బంతుల్లో 3ఫోర్లు, 8సిక్సర్లు) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జమైకా ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్లందరూ క్యాచ్ ఔట్‌గానే వెనుదిరిగారు. ఆ నాలుగు క్యాచ్‌లను కార్లోస్ బ్రాత్‌వైట్ అందుకోవడం విశేషం. ఫాబియన్ అలెన్, అల్‌జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.

242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ ఈ టార్గెట్‌ను ఛేదించడం కష్టమేనని అంతా భావించారు. కానీ, సెయింట్ కిట్స్ టీమ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంకో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దేవన్ థామస్(71), ఎవిన్ లూయిస్(53), లారీ ఎవాన్స్(41), ఫాబియన్ అలెన్(37నాటౌట్) సమష్టిగా రాణించడంతో 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి సెయింట్ కిట్స్ గెలుపొందింది. జమైకా బౌలర్లలో ఒషానే థామస్ నాలుగు, ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌ను వీక్షించిన ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. హార్డ్‌హిట్టర్ గేల్ సెంచరీ వృథా అయింది.


2192
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles