పదేండ్లుగా ప్రతిపక్షంలో మగ్గాం. లక్కీగా ఇన్నాళ్లకు అధికారం వచ్చింది. అధికారం పోతుందనే అవేశంలో ఎన్నో అంటుంటాం. మాట్లాడుకుందాం… ఢిల్లీకి రండి అంటే వెళ్లా. అక్కడ వారేమో సీఎంను కలువమన్నారు. సోనియా, రాహుల్‌ను అయితే కలుస్తా… సీఎంను కలిసే ప్రసక్తే లేదన్న. కానీ రాత్రంతా ఆలోచించా… రేపటి నాడు తిరిగి ఎమ్మెల్సీ కావాలన్నా, నామినేటెడ్ పోస్టు ఇవ్వాలన్నా సీఎంతో పెట్టుకుంటే కష్టమే… మనసు మార్చుకొని సీఎం ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వెళ్లక తప్పలేదు. ఏదైతే ఉందో… అధికార పార్టీని ఎవరైనా వదులుకుంటారా? చెప్పండి?. మరి ఈ మాట ముందే చెప్పాలి కదా!
పవర్ ‘పీఠం’
శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు మనకు ఉన్నప్పటికీ అమాత్యుల భార్యలు కొందరు ఈ మధ్య అసోంలో శక్తిపీఠం కామాఖ్యదేవి అమ్మవారి అనుగ్రహం కోసం వెళ్లినట్టు సమాచారం. అక్కడ తాంత్రిక పూజలతో పాటు జంతుబలులు కూడా జరుగుతాయి. ‘మా ఆయనకు మంత్రి పదవి కంటే ఇంకేదైనా పెద్ద పదవి ఉంటే చూడు తల్లి’ అని వారు ప్రత్యేక పూజలు కూడా చేసినట్టు వినికిడి. బహుశా ఈ విషయం సీఎంకు తెలిసిందేమో… చేతబడి చేస్తుంటే చూస్తూ కూర్చుంటామా? అని ఆయన అందుకే అన్నారేమో!
పాపం నినాదం లేదు!
గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు ‘బంగారు తెలంగాణ’ కోసం అని చెప్పుకోవడానికి మంచి నినాదం ఉండేది. పాపం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేవారికి నినాదమే లేకుండా పోయింది. ప్రజా పాలన కోసమని కొందరు, ప్రభుత్వ పాలన నచ్చిందని కొందరు, వ్యవసాయ విధానాలు నచ్చాయంటూ తలో మాట చెప్తున్నారు. వీరికి మంచి నినాదం ఏదైనా ఉంటే బాగుండేదని గాంధీభవన్‌లో ఓ పెద్దాయన తెగ ఆలోచిస్తున్నారు. ‘పవర్ కోసం’ నినాదం బాగుంది కానీ… మరి పచ్చిగా ఉంటుందేమోనని జంకుతున్నారు.
రివర్స్ గేర్
కర్ణాటకలో ముగ్గురు మంత్రులు తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్యను సీఎం సీట్లో నుంచి దింపేసి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూర్చోబెడుతామని అధిష్ఠానం హామీ ఇచ్చిందని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు విరుగుడుగా సిద్ధరామయ్య వర్గీయులు ముగ్గురికి డిప్యూటీ సీఎం పోస్టులు అడుగుతున్నారు. దీంతో సీఎం పోస్టు నాకేమీ అవసరం లేదు, నన్ను ఒక్కడినే డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తే చాలు… అదే పది వేలని డీకే దారికొచ్చినట్టు సమాచారం.
– వెల్జాల