ప్రణాళిక - ప్రగతి సోపానం


Mon,January 13, 2020 02:17 AM

10th CLASS
మార్చి అంటే ప్రతి విద్యార్థికి గుబులే. ఎందుకంటే ఏడాది కష్టపడి చదివిన చదువుకు ఫలితాన్ని ఇచ్చేది.. ఉన్నత చదువులకు సాగనంపేది మార్చినే కాబట్టి. ఈ పరీక్షల సీజన్‌ మార్చి ప్రాంరంభానికి రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివి అవగాహన చేసుకున్న అంశాలనే మళ్లీ మళ్లీ పునశ్చరణ చేయాలి. కొందరు విద్యార్థులకు పరీక్షలంటే భయం.. టెన్షన్‌.. రాత్రింబవళ్లు తెగ చదివేయాలన్న ఆతృత.. కానీ నిద్రపోక అతిగా మేలుకోవడం, సరైన ప్రణాళిక, టైం మేనేజ్‌మెంట్‌, సరైన ఆహార నియమాలు పాటించకపోతే పరీక్షలప్పుడు ఇబ్బందులు తప్పవు. చదివి అవగాహన చేసుకున్న అంశాలను బాగా రాసి మంచి ఫలితం తెచ్చుకోవడానికి సలహాలు, సూచనలు..

students

కాలం విలువైనది

-బద్ధకాన్ని, వాయిదా తత్వాన్ని వీడి చదువుపైనే దృష్టి సారించండి. కాలం ఎంతో విలువైనది.. పరీక్షా సమయాల్లో ప్రతి క్షణం కీలకమైనది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి కఠినమైన సబ్జెక్టులను చదువుకుంటే అవగతమవుతాయి. బాగా చదువుకోవడానికి వేకువజాము సమయం అత్యంత అనుకూలమైంది. చదువుకునే గది వాతావారణం ప్రశాంతంగా ఉండాలి. టీవీ, మొబైల్‌, ఆడియో ప్లేయర్లు సమీపంలో ఉంచుకోకండి. చదివేటప్పుడు దృష్టి మరలితే విలువైన సమయం వృథా అవుతుంది. చదువుకు ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వాదనలకు, ఘర్షణలకు దిగవద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

టైం మేనేజ్‌మెంట్‌ పాటించండి

-ఉదయం 4 నుంచి 6 గంటల వరకు కఠినమైన సబ్జెక్టు చదవడం
-ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సులభమైన సబ్జెక్టు
-ఉదయం 7 నుంచి 7.45 వరకు కాలకృత్యాలు, టిఫిన్‌
-ఉదయం 8.30 నుంచి 12.30 వరకు స్టడీ అవర్స్‌
-మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు భోజనం, కొద్దిసేపు విశ్రాంతి
-మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకు స్టడీ అవర్స్‌
-సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు రిఫ్రెష్‌మెంట్‌, రాత్రి భోజనం
-సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు కఠినమైన సబ్జెక్టు
-రాత్రి 8.30 నుంచి 11.00 వరకు సులభమైన సబ్జెక్టు
-రాత్రి 11.00 కు నిద్ర పోవడం
-గంటకోసారి 10 నిమిషాలు రిలాక్స్‌ అవుతూ చదివతే రోజులో కనీసం 14 గంటలు ప్రణాళికా బద్ధంగా కృషి చేసినట్లవుతుంది. అలసటగా అనిపిస్తే నిమిషంపాటు ఇంటిపైకప్పు వైపు చూస్తూ స్కై వాకింగ్‌ చేస్తే మెదడు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేస్తే అనుకున్న లక్ష్యం సునాయాసంగా చేరుకోవచ్చు. శారీరక అలసట కూడా ఉండదు. పగటి పూటే ఎక్కువగా చదువుకోవాలి. రాత్రి ఎక్కువగా మేలుకుంటే మెలటోనిన్‌ హార్మోన్‌ సమతుల్యత దెబ్బతిని నీరసంతో పాటు మెదడు సక్రమంగా పనిచేయదు.

నూతన అంశాలు ఇక వద్దు

-వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివిన అంశాలనే ఎన్నిసాైర్లెనా పునశ్చరణ చేయాలే తప్ప నూతన అంశాలను పరీక్షలముందు చదవకపోవడమే చాలా మంచిది. నూతన అంశాలతో తికమకపడే అవకాశం ఉంటుంది. పదో తరగతిలో ఎక్కువమంది విద్యార్థులు మాతృభాష తెలుగులోనే తక్కువ మార్కులు తెచ్చుకోవడం, ఫెయిల్‌ కావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం కేవలం భయమే. నూతన ప్రదేశంలో పరిచయంలేని ఉపాధ్యాయులు, విధ్యార్థుల మధ్య పరీక్ష రాయాలి. దీంతో బెరుకు వల్ల మొదటి పేపర్‌ సక్రమంగా రాయలేక ఇబ్బంది పడుతున్నారు. క్రమంగా దీనిని అధిగమిస్తున్నారు. ఈ ఆంశాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనించాలి.
-రెండు ఇష్టమైన విషయాల మధ్య ఒక క్లిష్టమైన విషయాన్ని చదివితే కష్టమనిపించదు.
-రాత్రి చదివేముందు స్నానం చేసి గదిలో పరిమళాన్ని ఇచ్చే ఆగరుబత్తి వెలిగించి గదిలోని లైట్లు ఆర్పి టేబుల్‌ ల్యాంప్‌ పెట్టుకుని చదవండి.

చేతి రాత కీలకం

-సరళమైన ఆకట్టుకునే చేతిరాతతో ఎగ్జామినర్లను ఆకట్టుకోవచ్చు. చేతిరాత కనీసం చదివేందుకు వీలుగా ఉండాలి. ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సరైన హెడ్డింగ్స్‌, సబ్‌ హెడ్డింగ్స్‌ పెట్టి పాయింట్‌వైస్‌గా రాయాలి. ప్రధానాంశాలను అండర్‌లైన్‌ చేయాలి. కాగితంపై ఒత్తి పట్టి రాయవద్దు. పరీక్ష రోజే కొత్త పెన్ను వాడవద్దు. రెండురోజుల ముందుగానే ఆ పెన్నుతో రాస్తూ అలవాటు చేసుకోవాలి.

సమతుల ఆహారం అవశ్యం

-ఈ సమయంలో సమతుల ఆహారం చాలా అవశ్యం. ముఖ్యంగా పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు), మాంసకృత్తులు (పప్పు), తాజా కూరగాయలు, తాజా పండ్లు, పాలు, పాల సంబంధ పదార్థాలు తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
-అరటిపండుతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
-ఉదయపు ఆహారంలో పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు), మాంసకృత్తులు (పప్పు) తప్పక తీసుకోవాలి. రాత్రి పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు) చాలు.
-స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. లేకపోతే అతి నిద్ర ఆవహించి చదువుకు భంగం కలుగుతుంది.
-మసాలా, నూనె పదార్థాలు తీసుకోవద్దు.
-బాదం పప్పు, పాలు, తాజా పండ్లు తీసుకోవాలి.
-మాంసాహారులకు చేప మంచిది. చేపలలోని ఫాటీ ఆమ్లాలు నాడీ మండలాన్ని చైతన్యం చేస్తాయి.
-బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, అటుకులు, వేరుశనగ చట్నీ, ఉడికించిన గుడ్డు, ఇష్టమైతే బ్రెడ్‌ తీసుకుంటే మంచిది.

ధ్యానంతో ఏకాగ్రత

-పరీక్షల్లో జ్ఞాపకశక్తికి ప్రాముఖ్యం ఎక్కువ. దాన్ని పెంచుకోవడానికి ధ్యానం ఒక మార్గం. అది ఒత్తిడిని జయించి ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది.

భయం వీడండి

-భయమే మొదటి శత్రువు. భయపడితే వచ్చిన సమాధానాలు కూడా రాయలేం. కాబట్టి ముందుగా మనం భయాన్ని వీడాలి. ఆత్మవిశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితుల సూచనలు, ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్‌ దోహదపడతాయి. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షహాల్లోకి వెళ్లగలిగితే సగం విజయం సాధించినట్లే. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒత్తిడికి గురికాకుండా పరీక్షహాల్లో ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తించి మొదటగా బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలి. తరువాత కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు ఆ తరువాత మిగతావాటి గురించి ఆలోచించాలి. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా జాగ్రత్త పడాలి.
SALEEM
-మహమ్మద్‌ సలీం షరీఫ్‌
మండల విద్యాధికారి,
నడిగూడెం మం. సూర్యాపేట
9948506786

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles