కరెంట్ అఫైర్స్


Wed,November 6, 2019 12:40 AM

Telangana
Telangana

హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ టీబీ, ఊపిరితిత్తుల వ్యాధుల నిరోధక సంస్థ (ఐయూఏటీబీఎల్‌డీ) ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును అక్టోబర్‌ 30న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సదస్సుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు 130 దేశాల నుంచి దాదాపు 400 మంది డాక్టర్లు హాజరయ్యారు.

యునెస్కో క్రియేటివ్‌ సిటీస్‌లో హైదరాబాద్‌

యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ) ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా అక్టోబర్‌ 31న విడుదల చేసిన ‘క్రియేటివ్‌ సిటీస్‌ (సృజనాత్మక నగరాలు)’ జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. ఈ జాబితాలో ఆహార (గ్యాస్ట్రోనమీ: రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించి) విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌కు చోటు దక్కింది. ఇందులో టర్కీ, పెరూ, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, ఇటలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఈక్వెడార్‌, చైనా దేశాల్లోని నగరాలు కూడా ఉన్నాయి. సినీ విభాగంలో ముంబైకి చోటు దక్కింది.

కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి రావాలని ఫోరం అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండ్‌ నుంచి నవంబర్‌ 3న ఆహ్వానం అందింది. ఈ ఫోరం 50వ వార్షిక సమావేశాలు 2020 జనవరి 21 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్నాయి.

International
International

సౌదీ రాజుతో మోదీ భేటీ

సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సాద్‌తో అక్టోబర్‌ 29న భేటీ అయ్యారు. అనంతరం ‘దావోస్‌ ఇన్‌ ద డెజర్ట్‌' పేరుతో నిర్వహించిన వార్షిక పెట్టుబడుల సదస్సులో భారతదేశ ఇంధన అవసరాల రీత్యా చమురు-సహజ వాయు రంగాల్లో రాబోయే ఐదేండ్లలో 100 బిలియన్‌ డాలర్ల (రూ.7 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలో రూపే కార్డు ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. యూఏఈ, బహ్రెయిన్‌లలో ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టారు.

అత్యత్తుమ సీఈవోల జాబితా

ప్రపంచంలోనే ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సీఈవోల జాబితాను హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ (హెచ్‌బీఆర్‌) అనే సంస్థ అక్టోబర్‌ 29న విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈవో జెన్‌సెన్‌ హువాంగ్‌ అగ్రస్థానంలో నిలువగా.. మార్క్‌ బెనియోఫ్‌ (సేల్స్‌ఫోర్స్‌ డాట్‌ కామ్‌-అమెరికా) 2, ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్ట్‌ (కెరింగ్‌-ఫ్రాన్స్‌) 3, రిచర్డ్‌ టెంపుల్టన్‌ (టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్‌-అమెరికా) 4, ఇగ్నాసియో గలన్‌ (ఇబెర్‌డ్రోలా-స్పెయిన్‌) 5వ స్థానాల్లో నిలిచారు.

ఇందులో ప్రవాస భారతీయులు శంతను నారాయణ్‌ (అడోబ్‌) 6, అయజ్‌ బంగా (మాస్టర్‌ కార్డ్‌) 7, సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌) 9, పీయూష్‌ గుప్త (డీబీఎస్‌ బ్యాంక్‌) 89వ స్థానాల్లో నిలిచారు.

గురునానక్‌ స్మారక నాణెం విడుదల

సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి (నవంబర్‌ 12)ని పురస్కరించుకుని గురునానక్‌ నాణేన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాణెం చిత్రాలను పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అక్టోబర్‌ 30న ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. రూ.50 విలువైన ఈ నాణెంతోపాటు రూ.8 విలువైన పోస్టల్‌ స్టాంప్‌ను కర్తార్‌పూర్‌ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నవంబర్‌ 9న ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లోని నారోవల్‌ జిల్లా రావి నది ఒడ్డున ఈ గురుద్వారా ఉంది.

డిఫెన్సెస్‌ నివేదిక

నవంబర్‌ 2ను ‘ఇంటర్నేషనల్‌ డే టు ఎండ్‌ ఇంప్యూనిటీ ఫర్‌ క్రైమ్స్‌ అగైనెస్ట్‌ జర్నలిస్ట్స్‌'గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో నవంబర్‌ 1న ఇంటెన్సిఫైడ్‌ అటాక్స్‌, న్యూ డిఫెన్సెస్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2017, 18లో 55 శాతం జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావరణంలేని ప్రాంతాల్లోనే జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. పాత్రికేయుల హత్యల్లో 30 శాతం అరబ్‌ దేశాల్లో, 26 శాతం లాటిన్‌ అమెరికా కరీబియన్‌ ప్రాంతంలో, 24 శాతం ఆసియా పసిఫిక్‌ దేశాల్లో చోటు చేసుకున్నాయి.

ఆసియాన్‌ దేశాల సమావేశం

థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆసియాన్‌ దేశాల 35వ వార్షిక సమావేశం నవంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించారు. 1967, ఆగస్టులో ఆసియాన్‌ సంస్థ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉన్నది. సభ్యదేశాల మధ్య సుస్థిరమైన అభివృద్ధి, ప్రాంతీయ ఉగ్రవాదం నిర్మూలన, వాణిజ్యం, సమగ్రమైన భద్రత అంశాలపై చర్చించారు. సింగపూర్‌, థాయిలాండ్‌, మలేషియా, కాంబోడియా, ఫిలిప్పీన్స్‌, లావోస్‌, ఇండోనేషియా, మయన్మార్‌, బ్రూనై, దక్షిణ వియత్నాం సభ్యదేశాలు.

బ్యాంకాక్‌లో హౌడీ మోదీ

థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్‌ 3న హౌడీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ థాయిలాండ్‌ భాషలో రాసిన ప్రసిద్ధ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను ఆవిష్కరించారు. అనంతరం మోదీ థాయిలాండ్‌ ప్రధాని ప్రయూత్‌ చాన్‌ ఓచాతో ఉగ్రవాదం, సుస్థిరమైన అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ రంగం, సైబర్‌ భద్రత అంశాలపై చర్చించారు.

National
National

యూటీలుగా కశ్మీర్‌, లద్దాఖ్‌

జమ్ముకశ్మీర్‌ను రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్ముకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2019’ భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 144 జయంతి రోజైన అక్టోబర్‌ 31 నుంచి అమల్లోకి వచ్చింది. వీటికి లెఫ్టినెంట్‌ గవర్నర్లను భారత ప్రభుత్వం నియమించింది. జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరీష్‌ చందర్‌ ముర్ము, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాథుర్‌ నియమితులయ్యారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

80 శాతం పోషకాహార లోపం

భారతదేశంలో 80 శాతానికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్‌ ‘మారుతున్న ప్రపంచంలో బాలల ఆహార అలవాట్లు, పోషకాహారం’ అనే పేరుతో అక్టోబర్‌ 31న విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది. దీని ప్రకారం దేశంలో 10 శాతం కంటే తక్కుమంది బాల బాలికలు మాత్రమే పోషకాహారం తీసుకుంటున్నారని తేలింది.

మోదీతో మెర్కెల్‌ భేటీ

భారత్‌లో రెండురోజులు పర్యటించిన జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ నవంబర్‌ 1న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో ఇరువురు నేతలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత నగరాల్లో హరిత రవాణా వ్యవస్థల కోసం 100 కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని అందించడానికి జర్మనీ అంగీకరించింది.

Sports
Sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా యాన్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన యాన్‌ సె యంగ్‌ విజేతగా నిలిచింది. పారిస్‌లో అక్టోబర్‌ 27న జరిగిన ఫైనల్లో యాన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించింది. ఈ క్రమంలో పిన్న వయస్సులో సూపర్‌-750 టైటిల్‌ గెలిచిన క్రీడాకారిణిగా యాన్‌ (17 ఏండ్ల 264 రోజులు) చరిత్ర సృష్టించింది. పురుషుల సింగిల్స్‌లో చెన్‌ లోంగ్‌ (చైనా) జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేషియా)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌లో మార్కస్‌ ఫెర్నాల్డి-కెవిన్‌ సుకముల్జో (ఇండోనేషియా) జంట విజేతగా నిలువగా.. భార్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి-చిరాగ్‌ శెట్టీల జోడీ రన్నరప్‌గా నిలిచింది.

మెక్సికో గ్రాండ్‌ప్రి విజేతగా హామిల్టన్‌

మెక్సికో గ్రాండ్‌ప్రిలో మెర్సిడెజ్‌ జట్టు డ్రైవర్‌ లూయీస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) విజేతగా నిలిచాడు. అక్టోబర్‌ 28న జరిగిన 71 ల్యాప్‌ల రేసులో హామిల్టన్‌ గంటా 36 నిమిషాల 48.904 సెకన్లలో గమ్యానికి చేరి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రేసులో వెటెల్‌ రెండోస్థానంలో, బొటాస్‌ మూడో స్థానంలో నిలిచారు.

ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ కోచ్‌గా లీసా

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ లీసా కెయిటీని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అక్టోబర్‌ 30 నియమించింది. ఈమె 2020, జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు తొలిసారిగా మహిళా క్రికెటర్‌నే హెడ్‌ కోచ్‌గా నియమించినట్లయింది.

బాక్సింగ్‌ అంబాసిడర్‌గా మేరీ కోమ్‌

జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌కు భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ బాక్సింగ్‌ అథ్లెట్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. టోక్యో-2020 ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) అక్టోబర్‌ 31న ప్రకటించిన 10 మంది సభ్యుల బాక్సింగ్‌ అథ్లెట్‌ అంబాసిడర్స్‌ బృందంలో మేరీకి చోటు లభించింది. వివిధ ప్రాంతాలకు అంబాసిడర్లుగా ఎంపికైనవారు..
పురుషులు: లుక్మో లవల్‌ (ఆఫ్రికా), జులియో సీజర్‌ లా క్రజ్‌ (ఉత్తర-దక్షిణ అమెరికా), జియాంగ్వాన్‌ అషియాహు (ఆసియా), వాసిల్‌ లామచెంకో (యూరప్‌), డేవిడ్‌ ఎన్‌యిక (ఓషియానియా).
మహిళలు: మేరీ కోమ్‌ (ఆసియా), ఖాదిజ మార్డి (ఆఫ్రికా), మిఖైలా మేయర్‌ (ఉత్తర-దక్షిణ అమెరికా), సారా ఔరహమౌనీ (యూరప్‌), షెల్లీ వాట్స్‌ (ఓషియానియా).

బాక్సింగ్‌లో స్వర్ణాలు

ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు శివ థాపా, పూజా రాణిలకు స్వర్ణ పతకాలు లభించాయి. టోక్యో (జపాన్‌)లో అక్టోబర్‌ 31న జరిగిన పురుషుల 63 కేజీల విభాగంలో శివ థాపా సనతలి టోల్తయెవ్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. మహిళల 75 కేజీల విభాగంలో పూజా రాణి కై ట్లిన్‌ పార్కర్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది.

Persons

అల్‌ బాగ్దాదీ హతం

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) నాయకుడు అబూ బాకర్‌ అల్‌ బాగ్దాదీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్టోబర్‌ 27న ప్రకటించారు. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా డెల్టా ఫోర్స్‌ దళాలు ‘ఆపరేషన్‌ కైలా ముల్లర్‌' పేరుతో జరిపిన దాడుల్లో బాగ్దాదీ హతమయ్యాడు. అమెరికాలోని అరిజోనాకి చెందిన కైలా ముల్లర్‌ ఒక సేవా సంస్థలో పనిచేస్తుండేది. 2013లో ఆమెను ఐసిస్‌ కిడ్నాప్‌ చేసి చంపేసింది. దీంతో ఈ ఆపరేషన్‌కు ఆమె పెట్టారు. ఈ ఐసిస్‌ ఉగ్రసంస్థకు కొత్త నాయకుడిగా అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ ఎంపికైనట్టు ఐసిస్‌ అక్టోబర్‌ 31న ఒక ఆడియో ప్రకటన విడుదల చేసింది.

అర్జెంటీనా అధ్యక్షుడిగా ఆల్బెర్టో

అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఆల్బెర్టో ఫెర్నాండెజ్‌ ఎన్నికయ్యారు. అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో ఆల్బెర్టో ప్రస్తుత అధ్యక్షుడు మౌరిసియో మాక్రిపై విజయం సాధించాడు. ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా క్రిస్టీనా ఫెర్నాండెజ్‌ ఎన్నికయ్యారు. ఆల్బెర్టో డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

రజనీకాంత్‌కు గోల్డెన్‌ జూబ్లీ అవార్డు

ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ‘ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ అవార్డు’ లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ నవంబర్‌ 2న ప్రకటించారు. 50వ (గోల్డెన్‌ జూబ్లీ) ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డుల ప్రదానోత్సవంలో రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే విదేశీ నటి విభాగంలో ఫ్రెంచ్‌ నటి ఇసబెల్లె హపెర్ట్‌కు లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ గోల్డెన్‌ జూబ్లీ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డుల కార్యక్రమం నవంబర్‌ 20 నుంచి 28 వరకు జరుగనుంది.
Vemula-Saidulu

617
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles