దహనకారిగా పనిచేసే వాయువు?


Wed,November 6, 2019 01:53 AM

air

పర్యావరణం

- పర్యావరణం అనే పదాన్ని ఇంగ్లిష్‌లో ఎన్విరాన్‌మెంట్‌ అంటారు. ఇది Environner అనే ఫ్రెంచ్‌ పదం నుంచి ఆవిర్భవించింది. ఎన్విరాన్‌ అంటే చుట్టూ ఆవరించి ఉన్న అని అర్థం.
- మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి, నీరు, నేల, జంతువులు, వృక్షాలు అనే జీవ, నిర్జీవ సమన్వయ వ్యవస్థనే పర్యావరణం అంటారు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే మన జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రంగాలను ‘పర్యావరణం’ అంటారు. ప్రభావిత అంశాలు భౌతికం కావచ్చు లేదా రసాయనికమైన మార్పులు కావచ్చు. ఏమార్పు జరిగినప్పటికీ మన పరిసరాల్లో ఉన్న భౌతిక, రసాయనిక సంబంధమైన అంశాలతో కూడిన సమన్వయ స్వరూపాన్నే పర్యావరణం అంటారు.
- భూమిపై నివసించే అన్ని రకాల జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. జీవులు సైతం పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ‘జీవ నిర్జీవ అంశాల సమన్వయ సహకార సంక్లిష్టతను పర్యావరణం’ అని టాలమీ నిర్వచించారు.
- ఆధునిక పర్యావరణవేత్తల అభిప్రాయం ప్రకారం జీవులు, మానవ జీవనాన్ని ప్రభావితం చేసే మొత్తం బాహ్యకారకాలు పర్యావరణంగా పరిగణిస్తారు.
- పర్యావరణాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

సహజసిద్ధ పర్యావరణం

- మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, జంతువులు, వృక్షాలు కలిసి సహజసిద్ధ పర్యావరణం అంటారు. వీటి స్థితినిబట్టి నాలుగురకాలుగా ఉంటాయి. అవి..
1. వాతావరణం 2. జలావరణం
3. శిలావరణం 4. జీవావరణం

మానవ నిర్మిత పర్యావరణం

- దీన్ని సామాజిక, సాంస్కృతిక పర్యావరణం అంటారు. మానవుడు వివాహం, కుటుంబ బాధ్యతలు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మానవుని మేథస్సు పెరిగిన కొద్ది సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా పరిశ్రమలు, వాటి కోసం భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు, వంతెనలు ఇలా అన్ని అభివృద్ధి చెందాయి. ఇవన్నీ మానవ నిర్మిత పర్యావరణం కిందికి వస్తాయి.

- సహజ పర్యావరణం అనే పదాన్ని ఫ్రెంచ్‌ భాష నుంచి స్వీకరించారు. ఎన్విరాన్‌ అంటే ఆవరించడం. పర్యావరణంలో శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు విభాగాలుంటాయి.
air1

శిలావరణం

- మనం నివసించే భూమిని శిలావరణంగా పిలుస్తారు. ఘనస్థితిలో మెత్తగా ఉన్న భూమి ఉపరితలాన్ని శిలావరణం అంటారు. ఇది కొంతవరకు గుల్లగా ఉండి దానిపై పెరిగే మొక్కలకు చెట్లకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది.
- స్థూలంగా దాని సంఘటనం కింది విధంగా ఉంటుంది.
1. అకర్బన లవణాలు ఆక్సీ లవణాలు (సల్ఫేట్లు, సిలికేట్లు, కార్బొనేట్ల వంటివి)- 60 శాతం
2. కర్బన పదార్థాలు (జంతు, వృక్ష సంబంధమైనవి)- 30 శాతం
3. నీరు- 5 శాతం
4. గాలి

- భూమి అంతర్నిర్మాణం: భూమి పైపొర వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. భూమి వ్యాసార్ధం 6400 కి.మీ. భూమి అంతర నిర్మాణం భూపటలం, భూ ప్రావారం, భూ కేంద్రమండలం అని మూడు భాగాలుగా ఉంటుంది.
- భూమిని పరిశీలిస్తే లోతుకు పోయేకొద్ది భూగర్భజలం, రాతి పొర, రాతిపొరల కింద పెట్రోలియం ఉంటాయి. భూకేంద్ర మండలం (కోర్‌)లో ఉష్ణోగ్రత సుమారు 30000C, భూ కేంద్రం వద్ద సుమారు 60000C ఉంటుంది (ప్రతి 32 మీ. భూ కేంద్రం వైపు వెళ్లే కొద్ది 10C పెరుగుతుంది). భూ కేంద్ర మండలంలో ఐరన్‌, నికెల్‌, టంగ్‌స్టన్‌ వంటి లోహాలు, లోహ ఆక్సైడ్లు ద్రవస్థితిలో ఉంటాయి. పరివర్తన మూలకాలైన ఈ లోహాలవల్ల భూమి గురుత్వాకర్షణ ధర్మం కలిగింది.
- భూమి మీద అక్కడక్కడ అగ్ని పర్వతాలు ఉండటానికి, హిమాలయాల వంటి శీతల ప్రాంతాల్లో కూడా వేడినీటి ప్రవాహాలు నిరంతరం ఉండటానికి కారణం భూకేంద్ర ప్రాంతంలోని అధిక ఉష్ణోగ్రతే కారణం. వెదరింగ్‌ ప్రక్రియ వల్ల క్రమేపీ ఛిద్రమై మార్పు చెందుతూ చెట్లు, మొక్కలు పెరగడానికి వ్యవసాయానికి అనువుగా మారింది.

- భూమిపై శిలారూపంలో ఉండే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, రాళ్లు, మట్టి పొరలు, వాటిని సంయుక్తంగానే శిలావరణం అంటారు. భూమిలోని ఖనిజాలు, శిలాజ ఇంధనాలు కూడా ఇందులో భాగమే. శిలామయమైన భూమి ఉపరితలం కాలక్రమేనా అనేక భౌతిక రసాయనిక మార్పులకు గురై చిన్న చిన్న రేణువులుగా మారి మృత్తికలు ఏర్పడుతాయి. ఇందులో జీవసంబంధ కుళ్లిన పదార్థం (హ్యూమస్‌) చేరడంతో సారవంతంగా మారి మానవ మనుగడకు బాగా తోడ్పడుతున్నాయి.
జలావరణం
- భూమి ఉపరితలంపై ఆవరించి ఉన్న సముద్రాలు, నదులు, జలాశయాలు, సరస్సులు, చెరువులన్నింటినీ జలావరణం అంటారు. జలావరణంలో 97 శాతం నీరు ఉప్పునీటి రూపంలో, 3 శాతం నీరు మంచినీటి రూపంలో ఉంది. ఈ 3 శాతం మంచినీటిలో 2 శాతం మంచురూపంలో మిగిలిన 1 శాతం నీరు మాత్రమే మానవులు, ఇతర జీవులకు అందుబాటులో ఉంది.
- మొత్తం భూగోళ వైశాల్యం 510 మి.చ.కి.మీ. ఇందులో నీటి భాగమే ఎక్కువ. జలభాగం 361 మి.చ.కి.మీ. (70.78 శాతం) మిగిలిన 149 మి.చ.కి.మీ. (29.22 శాతం) భూమి ఆవరించి ఉంది. సముద్రాలు అతి పురాతన పర్యావరణ వ్యవస్థగా పరిగణిస్తారు.

- సాధారణంగా సముద్రజలం ప్రతి 100 గ్రాములకు 35 గ్రా. లవణాలు కలిగి ఉన్నాయి. నిజానికి భూమిపై కంటే సముద్రాల్లోనే ఎక్కువ జీవజాలం ఉంది. మొట్ట మొదట జీవం పుట్టింది కూడా సముద్రాల్లోనే. సముద్రాలు అత్యంత సువిశాలంగా ఉండటంతో సూర్యరశ్మి ద్వారా గాలి నీటి ఆవిరిని గ్రహించి తిరిగి వర్షాన్ని ఇస్తుంది. నిరంతర పోటు, పాట్ల వల్ల నదీ ముఖద్వారాలు ఎల్లప్పుడు నిర్మలంగా ఉంటాయి. సముద్రాలు అనేక ఖనిజాలకు నిలయం, అనేక రకాల ఆహార పదార్థాలను కలిగిన ఆహార గోదాములు.
- సముద్రజలం మంచినీటి కంటే ఎనిమిది రెట్లు కార్బన్‌డై ఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. ఫలితంగా వాతావరణంలోని కార్బన్‌డై ఆక్సైడ్‌ తగ్గి భూగోళాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి కాపాడుతున్నాయి. సముద్ర జలాలు వాతావరణం కంటే 1000 రెట్లు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఇలా ఉష్ణోగ్రత గ్రహించి గ్లోబల్‌ వార్మింగ్‌ను సమతా స్థితిలో ఉంచుతున్నది.
- సముద్ర జలాల్లో 35 శాతం వరకు వివిధ లవణాలు ముఖ్యంగా సోడియం క్లోరైడ్‌ కలిగి ఉంటాయి. దీంతో అది తాగడానికి పనికిరాదు. అయినప్పటికీ భూమిపై జలవలయం (వాటర్‌ సైకిల్‌)లో నీటి పరిమాణం స్థిరంగా ఉంచడానికి సముద్రాలు తోడ్పడుతాయి.

వాతావరణం

- పర్యావరణంలోని తృతీయ అనుఘటకం వాతావరణం. అంటే గాలి మనని పరివేష్టించి ఉండే ఈ భాగం చాలా ప్రాధాన్యం కలిగింది.
- సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు పోయేకొద్ది ఉష్ణోగ్రతలో కలిగే మార్పులను అనుసరించి వాతావరణ నిర్మాణాన్ని ఐదు ప్రధాన ఆవరణాలుగా విభజించారు.
- భూమ్యాకర్షణ వల్ల భూమి చుట్టూ 1600 కి.మీ. వరకు వాయు మండలం ఆవరించి ఉంది. ఈ వాయుమండలాన్నే వాతావరణం అంటారు. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువులు, జీవ, భౌమ్య, రసాయన వలయాలకు కారణమై భూమిపై జీవ ఆవిర్భావానికి, మనుగడకు దారితీస్తున్నాయి. వాతావరణంలోని వాయువులు భూగోళంపై సమశీతల స్థితిని ఏర్పరచి భూగోళాన్ని ఇతర గోళాల్లా మరీ శీతలంగా గానీ, ఉష్ణంగా గానీ ఉండకుండా కాపాడుతున్నాయి. వాతావరణం భూమి నుంచి గ్రహించిన నీటి ఆవిరిని తిరిగి వర్షంగాను, మంచుగాను మారి జలావరణానికి, జీవావరణానికి, శిలావరణానికి ఉపయోగపడుతున్నది.

వాతావరణ సంఘటనం

- భూమి చుట్టూ ఉన్న వాయుగోళంలో 5.7x 1015 టన్నుల వాయు ద్రవ్యరాశి ఉంది. ఈ వాయుగోళంలో జీవులకు అనుకూలంగా ఉండే అనేక మూలకాలు ఉన్నాయి. అవి..
- నైట్రోజన్‌- 79.09 శాతం
- ఆక్సిజన్‌- 20.94 శాతం
- ఆర్గాన్‌- 0.93 శాతం
- కార్బన్‌ డై ఆక్సైడ్‌- 0.03 శాతం
- నియాన్‌- 0.0018 శాతం
- హీలియం- 0.0005 శాతం
- ఓజోన్‌- 0.00006 శాతం
- హైడ్రోజన్‌- 0.00005 శాతం

- మొదటి నాలుగు వాయువులు 99.99 శాతం వాతావరణాన్ని ఆక్రమించి ఉన్నాయి. నియాన్‌, హీలియం, ఓజోన్‌, హైడ్రోజన్‌ వంటి వాయువులు, క్రిప్టాన్‌, గ్జీనాన్‌, మీథేన్‌ వంటి సూక్ష్మ పరిమాణ వాయువులు ఉంటాయి. ప్రతి వాయువు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా జీవుల ఆవిర్భావానికి; మనుగడకు కారణమవుతాయి.
- నత్రజని: భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, జీవుల మనుగడలో వాయువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవకోటికి ఆహారం అందించే మొక్కలు నత్రజనిని నైట్రేట్ల రూపంలో గ్రహించి నత్రజని సంబంధ ప్రోటీన్లను అందిస్తున్నాయి.
- ఆక్సిజన్‌: జీవకోటికి ప్రాణవాయువులా ఉపయోగపడుతుంది. ఆక్సీకరణ చర్యలో పాల్గొంటుంది. దహనకారిగా పనిచేస్తుంది.
- కార్బన్‌డై ఆక్సైడ్‌: చెట్లు, మొక్కలు ఈ వాయువుని తీసుకొని, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను ఉత్పత్తిచేసి సమస్త జీవ కోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ వావయువు వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి భూగోళ ఉష్ణ సమస్థితిని కాపాడి జీవుల మనుగడకు కారణమవుతుంది.
- ఓజోన్‌: సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను శోషించి వడబోయడం ద్వారా, విశ్వాంతరాల నుంచి భూమిని చేరే కాస్మిక్‌ కిరణాలను గ్రహించి పరావర్తనం చెందించి జీవజాలం వినాశనం కాకుండా కాపాడుతుంది.
- నీటి ఆవిరి: భూమి నుంచి బాష్పీభవనం, చెట్ల నుంచి బాష్పోత్సేకం, ఉత్పతనం వంటి ప్రక్రియల ద్వారా వాతావరణంలోకి చేరుతుంది. ఇది సూర్యుని నుంచి వెలువడే వేడిని గ్రహించి, వేడి తీవ్రతను తగ్గించి అది భూమిని తాకకుండా చేస్తుంది. వాతావరణాన్ని తడిగా ఉంచుతుంది. వాతావరణంలోని నీటి ఆవిరి తగిన పరిస్థితులు లభించినప్పుడు ద్రవీభవనం చెంది వర్షంగాను, ఘనీభవనం చెందితే మంచుగాను మారి భూమిని చేరి జీవజాతి మనుగడకు తోడ్పతుంది.
- భూమి చుట్టూ 1600 కి.మీ. వరకు గాలి ఆవరించి ఉంటుంది. దీని లక్షణాలను బట్టి, రసాయనిక పరిస్థితిని బట్టి కింది వాతావరణ పొరలుగా విభజించాలి. అవి.. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం.
air2

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles