కరెంట్ అఫైర్స్


Wed,October 23, 2019 12:46 AM

Telangana
Telangana

బయో ఏషియా వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

2020, ఫిబ్రవరి 17న జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు వెబ్‌సైట్‌, థీమ్‌లను హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అక్టోబర్‌ 16న ఆవిష్కరించారు. ఈ సదస్సును ‘టుడే ఫర్‌ టుమారో’ నినాదంతో నిర్వహించనున్నారు.

న్యాక్‌కు అవార్డు

హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ-న్యాక్‌)కు నేషనల్‌ లీడర్‌షిప్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. 24 వేలమందికి శిక్షణ ఇచ్చినందుకు అసోచామ్‌ సంస్థ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ విభాగంలో న్యాక్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అక్టోబర్‌ 17న బీహార్‌ రాజధాని పట్నాలో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఈ అవార్డును అందజేశారు.

టీఎస్‌ శక్తి యాప్‌కు పురస్కారం

రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కో నిర్వహిస్తున్న ‘టీఎస్‌ శక్తి’ యాప్‌లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌కు ‘శాప్‌ ఏస్‌' ఉత్తమ పురస్కారం లభించిందని జెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు అక్టోబర్‌ 18న తెలిపారు. ఈ యాప్‌ కోసం ‘శాప్‌ ఈఆర్‌పీ’ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడానికి శాప్‌ ఇండియా సంస్థతో జెన్‌కో ఒప్పందం చేసుకుంది. దీని వినియోగం బాగున్నందున ‘2019 కస్టమర్‌ ఎక్సలెన్స్‌-శాప్‌ ఏస్‌' పురస్కారానికి ఎంపికైంది.

భారత్‌ బయోటెక్‌కు అవార్డు

వ్యాక్సిన్లు, బయో ఔషధాలు తయారుచేసే సంస్థ భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు మధ్యశ్రేణి కంపెనీల విభాగంలో ‘ఉత్తమ పరిశోధన’ అవార్డు లభించింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అక్టోబర్‌ 18న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.

National
National

నీతి ఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌

దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌-2019ను నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీలో అక్టోబర్‌ 17న విడుదల చేశారు. ఈ ఇండెక్స్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ సంస్థ, నీతి ఆయోగ్‌ సంయుక్తంగా రూపొందించాయి. దీనిలో పెద్ద రాష్ర్టాలు, ఈశాన్య రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా ర్యాంకులను కేటాయించారు. పెద్ద రాష్ర్టాల కేటగిరీలో కర్ణాటక తొలి స్థానంలో నిలువగా తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. ఈశాన్య రాష్ర్టాల కేటగిరీలో సిక్కిం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ మొదటి స్థానాల్లో ఉన్నాయి.

పశుగణన నివేదిక

కేంద్ర పశు సంవర్థక శాఖ 20వ పశుగణన నివేదికను అక్టోబర్‌ 17న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 535.78 మిలియన్ల పశు సంపద ఉందని ఈ నివేదిక వెల్లడించింది. 2012లో విడుదలైన 19వ పశుగణన నివేదికతో పోల్చితే 4.6 శాతం పశుసంపద పెరిగింది. 20వ పశుగణన ప్రకారం గో సంపద 18 శాతం, గొర్రెల సంఖ్య 14.1 శాతం, మేకల సంఖ్య 10.1 శాతం, కోళ్ల సంఖ్య 16.8 శాతం పెరిగింది. గుర్రాల సంపద 45.6 శాతం తగ్గి 3.4 లక్షలకు పడిపోయింది. గాడిదల సంఖ్య 61.23 శాతం తగ్గి 1.2 లక్షలకు, ఒంటెల సంఖ్య 37.1 శాతం తగ్గి 2.5 లక్షలకు పడిపోయింది.

International
International

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌

ప్రపంచ ఆకలి సూచీ-2019 (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)ను ఐరిష్‌ సహాయ సంస్థ కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌, జర్మన్‌ సంస్థ వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంయుక్తంగా అక్టోబర్‌ 16న విడుదల చేశాయి. 117 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌లు అగ్రస్థానాల్లో ఉండగా.. భారతదేశం 102వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన నేపాల్‌ 73, శ్రీలంక 66, బంగ్లాదేశ్‌ 88, మయన్మార్‌ 69, పాకిస్థాన్‌ 94వ స్థానాల్లో ఉన్నాయి. చైనా 25వ స్థానంలో ఉంది.

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడితో కోవింద్‌ భేటీ

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 18న భేటీ అయ్యారు. ఆ దేశ రాజధాని మనీలాలో జరిగిన ఈ భేటీలో రక్షణ, వాణిజ్య సంబంధాలు, సముద్రతీర భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.

స్టార్టప్‌ దేశాల జాబితా

విజయవంతమైన ఎక్కువ స్టార్టప్‌ (యూనికార్న్‌)ల జాబితా హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌-2019 అక్టోబర్‌ 17న విడుదలైంది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో (206 స్టార్టప్‌లు) నిలిచింది. రెండో స్థానంలో అమెరికా (203 స్టార్టప్‌లు), మూడో స్థానంలో భారతదేశం (21 స్టార్టప్‌లు) నిలిచాయి.

తొలి ఏఐ యూనివర్సిటీ

ప్రపంచంలోనే తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యూనివర్సిటీని యూఏఈ ప్రభుత్వం అక్టోబర్‌ 17న ప్రారంభించింది. ‘ది మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎంబీజడ్‌యూఏఐ)’గా పిలిచే దీన్ని యూఏఈ రాజధాని అబుదాబిలో నెలకొల్పారు.

యూఎన్‌వోలో వెనెజులాకు చోటు

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో వెనెజులాకు అక్టోబర్‌ 20న చోటు లభించింది. 47 మంది సభ్యులతో కూడిన ఈ కౌన్సిల్‌ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. కౌన్సిల్‌లో 14 సభ్యదేశాల మూడేండ్ల కాలపరిమితి ముగిసింది. బ్రెజిల్‌ కూడా కౌన్సిల్‌కు ఎంపికైంది. లాటిన్‌ అమెరికా నుంచి పోటీపడిన కోస్టారికా 96 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

Persons
Persons

ఇద్దరికి బుకర్‌ ప్రైజ్‌

ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు బుకర్‌ ప్రైజ్‌-2019ను అక్టోబర్‌ 14న మొదటిసారి ఇద్దరికి ప్రకటించారు. కెనడియన్‌ రచయిత్రి మార్గరెట్‌ ఎట్‌వుడ్‌, ఆంగ్లో-నైజీరియన్‌ రచయిత్రి బెర్నాైర్డెన్‌ ఎవరిస్టోలకు సంయుక్తంగా బుకర్‌ ప్రైజ్‌ లభించింది. బెర్నాైర్డెన్‌ ఈ బహుమతి పొందిన తొలి నల్లజాతీయురాలు. మార్గరెట్‌ రచించిన ‘ది టెస్టమెంట్స్‌', ఎవరిస్టో రచించిన ‘గర్ల్‌, ఉమన్‌, అదర్‌' అనే నవలలకు ఈ బహుమతి వరించింది. బహుమతి కింద 50 వేల బ్రిటిష్‌ పౌండ్లు నగదు అందిస్తారు.

మొదటి అంధ మహిళా ఐఏఎస్‌

దేశంలోనే మొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా ప్రాంజల్‌ పాటిల్‌ నియమితులయ్యారు. కేరళలోని తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌గా అక్టోబర్‌ 14న ఆమె బాధ్యతలు చేపట్టారు.

ప్రపంచ ఉక్కు సంఘం చైర్మన్‌గా యోంగ్‌

వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ప్రపంచ ఉక్కు సంఘం) చైర్మన్‌గా హెచ్‌బీఐఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ యూయూ యోంగ్‌, వైస్‌ చైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ అక్టోబర్‌ 16న ఎన్నికయ్యారు. మెక్సికోలోని మాంటెర్రీలో జరిగిన సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు.

విరాళాల్లో శివ్‌ నాడార్‌కు అగ్రస్థానం

సామాజిక సేవా కార్యక్రమాల కోసం అత్యధికంగా విరాళమిచ్చిన దేశీ దిగ్గజాల్లో హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు. వ్యక్తిగతంగా, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన 100 మందితో ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్‌-2019 అక్టోబర్‌ 14న విడుదలైంది. ఈ లిస్ట్‌లో శివ్‌ నాడార్‌ రూ.826 కోట్లు విరాళమిచ్చి మొదటి స్థానంలో నిలిచారు. రూ.453 కోట్లు విరాళమిచ్చిన అజీమ్‌ ప్రేమ్‌జీ 2వ, రూ.402 కోట్లు విరాళమిచ్చిన ముకేశ్‌ అంబానీ 3వ స్థానంలో నిలిచారు.

తదుపరి సీజేఐగా జస్టిస్‌ బోబ్డే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా షరద్‌ అర్వింద్‌ బోబ్డే పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ప్రతిపాదిస్తూ అక్టోబర్‌ 18న కేంద్ర చట్ట, న్యాయ శాఖకు లేఖ రాశారు. 2019, నవంబర్‌ 17తో రంజన్‌ గొగోయ్‌ పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐగా జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పేరును రంజన్‌ సూచించారు.

ఎన్‌ఎస్‌జీ డీజీగా అనూప్‌

నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా గుజరాత్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అనూప్‌కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామక కమిటీ అక్టోబర్‌ 18న ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో 2020, సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనున్నారు.

మహిళల స్పేస్‌వాక్‌

అమెరికాకు చెందిన మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్‌, జెస్సికా మియెర్‌లు అక్టోబర్‌ 18న స్పేస్‌లో నడిచారు. వీరిద్దరు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం వెలుపల 7 గంటల 17 నిమిషాలపాటు గడిపారు. పురుషులతో కలిసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్‌ వాక్‌ చేసిన తొలి సందర్భం ఇదే.

సీసీఎల్‌ చైర్మన్‌ ప్రసాద్‌కు అవార్డు

ఇన్‌స్టంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టంట్‌ కాఫీ ఆర్గనైజేషన్‌ నుంచి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించిందని సీసీఎల్‌ అక్టోబర్‌ 18న తెలిపింది. జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇన్‌స్టంట్‌ కాఫీ రంగంలో చేసిన కృషికి ఆయనకు ఈ అవార్డు లభించింది.

Sports
Sports

ఐసీసీ మహిళల ర్యాంకింగ్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను అక్టోబర్‌ 15న వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ ప్లేయర్‌ అమి సటర్త్‌వెయిట్‌ మొదటి ర్యాంక్‌లో నిలువగా భారత ప్లేయర్‌ స్మృతి మంధాన రెండో స్థానంలో నిలిచింది.

రొనాల్డో 700 గోల్స్‌

పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో 700 గోల్స్‌ పూర్తిచేసి రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌ 15న ఉక్రెయిన్‌తో జరిగిన యూరో-2020 క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో 72వ నిమిషంలో లభించిన పెనాల్టీని రొనాల్డో గోల్‌ చేసి ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

పీకేఎల్‌-7 విజేత వారియర్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ విజేతగా బెంగాల్‌ వారియర్స్‌ నిలిచింది. అక్టోబర్‌ 19న జరిగిన ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ జట్టుపై 39-34 తేడాతో విజయం సాధించింది.

సుల్తాన్‌ ఆఫ్‌ జొహార్‌ హాకీ విజేత బ్రిటన్‌

సుల్తాన్‌ ఆఫ్‌ జొహార్‌ హాకీ విజేతగా బ్రిటన్‌ నిలిచింది. అక్టోబర్‌ 19న మలేషియాలోని జొహార్‌ బహ్రూలో జరిగిన ఫైనల్లో 1-2 గోల్స్‌తో భారత్‌ను బ్రిటన్‌ ఓడించింది.

ఐఎస్‌ఎల్‌ ప్రారంభం

ఇండియన్‌ సూపర్‌లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆరో సీజన్‌ టోర్నమెంట్‌ కేరళ కొచ్చిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్‌ 20న ప్రారంభమైంది. ఈ టోర్నీ 2020 ఫిబ్రవరి 23 వరకు జరుగనున్నది. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్‌ ఏఎఫ్‌సీ, ఒడిశా జట్లు పాల్గొన్నాయి. గత సీజన్‌లో ఈ టైటిల్‌ విజేత కేరళ బ్లాస్టర్స్‌.
Vemula-Saidulu

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles