C.A ఫౌండేషన్‌కు ప్రణాళిక


Mon,October 7, 2019 02:01 AM

మరికొద్ది రోజుల్లో సీఏ ఫౌండేషన్‌ చదివిన విద్యార్థులు తుది పరీక్ష రాయబోతున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ కొద్దికాలం ప్రిపరేషన్‌ కొనసాగిస్తే అంతిమ విజయాన్ని సులువుగా ఒడిసిపట్టొచ్చు.
ca-foundation
-నూతన విధానం ప్రకారం సీఏ ఫౌండేషన్‌లో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు 4 పరీక్షలు 4 రోజులు (ఒక్కో పేపర్‌- ఒక్కో రోజు) నిర్వహిస్తారు.
-పేపర్‌ 1, పేపర్‌ 2 డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో, పేపర్‌ 3, పేపర్‌ 4 మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి.


సీఏ ఫౌండేషన్‌

-అర్హత: ఇంటర్మీడియట్‌ (ఏ గ్రూపైనా) లేదా ప్లస్‌ టు లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్‌ చేసే రోజుకి విద్యార్థి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణుడై ఉండాలి.
-రిజిస్ట్రేషన్‌: మే నెలలో సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయాలంటే ముందు సంవత్సరం డిసెంబర్‌ 31లోగా, నవంబర్‌లో పరీక్ష రాయాలంటే అదే సంవత్సరం జూన్‌ 30లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

గమనిక:

సీఏ ఫౌండేషన్‌లోని మొదటి, రెండో పేపర్లకు మధ్యాహ్నం 2 గంటలకు మొదలయినప్పటికీ 1.45 గంటలకే ప్రశ్నపత్రం ఇస్తారు. అంటే విద్యార్థి ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా లభిస్తుంది.
ca-foundation3

ఏ సబ్జెక్టు ఎలా చదవాలి


పేపర్‌-1

-ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌. 100 మార్కులు
-అకౌంట్స్‌ సబ్జెక్టు మొత్తం డిస్క్రిప్టివ్‌గా మార్చారు. దీనివల్ల విద్యార్థి సీఏ ఇంటర్‌, ఫైనల్‌ దశల్లో డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో చేయాలనుకునే లెక్కలకు ముందుగానే శిక్షణ లభించినట్లు అవుతుంది.
-ప్రతి విద్యార్థికి ఇది ఒక మంచి స్కోరింగ్‌ సబ్జెక్టు. చాలా సునాయాసంగా 60-70 మార్కులు తెచ్చుకునే అవకాశం ఈ సబ్జెక్టుల్లో ఉంది.
-సీఏలో అకౌంట్స్‌ అనే సబ్జెక్టు సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్‌, సీఏ ఫైనల్‌ దశల్లో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సీఏ కోర్సు త్వరగా క్వాలిఫై కావడానికి ఈ సబ్జెక్టు దోహదపడుతుంది. కాబట్టి అకౌంట్స్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి.
-లెక్కలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. మీరు ఎన్ని లెక్కలు ప్రాక్టీస్‌ చేసినా కూడా పరీక్షల్లో కొద్దిపాటి మార్పులు చేసి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి విద్యార్థులు లెక్కలను బట్టీ పట్టకుండా కాన్సెప్ట్‌ మీద దృష్టి సారించాలి.
-ఈ సబ్జెక్టులో జర్నల్‌ ఎంట్రీస్‌ చాలా ముఖ్యమైనవి. అన్ని చాప్టర్లలోని జర్నల్‌ ఎంట్రీస్‌ అన్ని పుస్తకంలో ఒకేచోట రాసుకుంటే పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు పునశ్చరణ తేలికవుతుంది. ప్రతిరోజు అలా రాసుకున్న జర్నల్‌ ఎంట్రీస్‌ 15 నిమిషాలపాటు పునశ్చరణ చేసుకోవాలి.
-ఈ పేపర్‌లో ప్రాబ్లమ్స్‌తో పాటు థియరీ ప్రశ్నలు కూడా పరీక్షల్లో అడుగుతారు. కాబట్టి విద్యార్థులు థియరీని నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. 80 శాతానికి పైగా మార్కులు సాధించాలనుకునే విద్యార్థులకు థియరీ ప్రశ్నలపై పట్టు సాధించడం చాలా ముఖ్యం.
-సిలబస్‌లో కొత్తగా తీసుకువచ్చిన చాప్టర్లు: అకౌంటింగ్‌ ఫర్‌ నాట్‌ ఫర్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌, యావరేజ్‌ డ్యూ డేట్‌, అకౌంట్‌ కరెంట్‌. వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.

పేపర్‌-2

-బిజినెస్‌ లాస్‌, బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌
-ఈ పరీక్షను డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. కాబట్టి ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలి. ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి.
-గ్రామర్‌ మీద పట్టు సాధించాలి. సమాధానాల్లో స్పెల్లింగ్‌, గ్రమటికల్‌ మిస్టేక్స్‌ లేకుండా రాయాలి.

బిజినెస్‌ లాస్‌

-దీనికి 60 మార్కులు ఉంటాయి. ఇది డిస్క్రిప్టివ్‌ పేపర్‌.
-ఈ పేపర్‌ వల్ల సీఏ ఇంటర్‌, సీఏ ఫైనల్‌లోని లా & ఆడిటింగ్‌ వంటి థియరీ సబ్జెక్టులను చాలా సులువుగా చదవవచ్చు.
-ఒక వ్యాపారస్తునికి వ్యాపారానికి సంబంధించిన చట్టాలపై అవగాహన చాలా అవసరం. అందుకే ఒక బిజినెస్‌ చేయడానికి కావల్సిన చట్టాలకు సంబంధించిన వివరాలను చాలా వరకు ఈ సబ్జెక్టులో పొందుపర్చారు.
-B.Lawలో 60 మార్కులకు గాను 30 నుంచి 35 మార్కులు తేలికగానే తెచ్చుకోవచ్చు.
-థియరీ, ప్రాక్టికల్‌ ప్రశ్నలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
-సమాధానం రాసేటప్పుడు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పండి.
-సీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులో ప్రశ్నలను యథాతథంగా ఇవ్వకపోవచ్చు. కాబట్టి విద్యార్థులు బట్టీ విధానానికి స్వస్థి పలకాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివితే ప్రశ్నలు ఎలా అడిగినా విద్యార్థులు రాయగలుగుతారు.
-ఒకే ప్రశ్నను షార్ట్‌ లేదా ఎస్సే లేదా వెరీ షార్ట్‌ ప్రశ్నలుగా ఎలాగైనా అడగవచ్చు. సమాధానం రాసేటప్పుడు అడిగినన్ని మార్కులకే సమాధానం రాయాలి.
-ఈ సబ్జెక్టుకు రచయితల పుస్తకాలు ఏవీ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రచయిత బుక్‌లో ఒక సమస్యకి సమాధానం ఒక అభిప్రాయం ప్రకారం ఉంటే ఇంకొక బుక్‌ లేదా ఐసీఏఐ అభిప్రాయం మరోలా ఉండవచ్చు. కాబట్టి ఐసీఏఐ మెటీరియల్‌ను మాత్రమే ప్రామాణికంగా పెట్టుకొని చదివితే మంచింది.

బిజినెస్‌ కరస్పాండెన్స్‌, రిపోర్టింగ్‌

-దీనిలో 40 మార్కులు ఉంటాయి.
-ఈ సబ్జెక్టులో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయిలో నేర్చుకున్న ఇంగ్లిష్‌ సబ్జెక్టులోని చాలా అంశాలు పునరావృతం అవుతాయి.
-లెటర్‌ రైటింగ్‌, నోట్‌ మేకింగ్‌, డ్రాఫ్టింగ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి తదితర అంశాలు సిలబస్‌లో పొందుపర్చారు. విద్యార్థిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సబ్జెక్టును సిలబస్‌లో చేర్చారు. కాబట్టి విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలపై పట్టుసాధించాలి.
-‘కమ్యూనికేషన్‌' అనే మొదటి చాప్టర్‌ చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. కాబట్టి ఆ చాప్టర్‌లోని అన్ని ప్రశ్నలనూ చదవాలి.
-Indirect Speechని direct Speechగా మార్చడానికి Active Voice నుంచి Passive Voiceగా మార్చడానికి సంబంధించిన నిబంధనల గురించి పూర్తి అవగాహన ఉండాలి.
-Letter Writing, Circular Writing, Article Writing, Precis Writing, Note making, Memo Writing కి సంబంధించిన ఫార్మాట్‌ను బాగా సాధన చేయాలి.
-Meeting and Action Taken Report (ATR) after meetings, Complaint and Reply to Complaint Letters వంటివి కూడా బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

పేపర్‌-3

-బిసినెస్‌ మ్యాథమెటిక్స్‌, లాజికల్‌ రీజనింగ్‌, స్టాటిస్టిక్స్‌
-ఈ పేపర్‌ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది.
-స్టాటిస్టిక్స్‌, రీజనింగ్‌ అనేవి ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ వారికయినా కొత్త సబ్జెక్టులు.
-ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపువారైనా రీజనింగ్‌లో మంచి మార్కులు సంపాదించవచ్చు.
-ఈ పేపర్‌లోని అన్ని సబ్జెక్టుల్లో ఫార్ములాకు చాలా ముఖ్యమైనవి. అన్ని చాప్టర్లకు సంబంధించిన ఫార్ములాలన్నీ ఒక చోట రాసుకుని ప్రతిరోజు 15 నిమిషాలు రివిజన్‌ చేయాలి. చాలా మంది విద్యార్థులు పరీక్షలో కరెక్టు ఫార్ములా గుర్తురాక మార్కులు పోగొట్టుకుంటున్నారు.

బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌

-ఇది 40 మార్కులకు ఉంటుంది.
-ఈ సబ్జెక్టు ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌తో పోలిస్తే ఇక్కడ సులభంగా ఉంటుంది.
-ప్రతి చాప్టర్‌లోని సమస్యలను సాధన చేసిన తర్వాత ఆ సమస్యలకు సంబంధించిన సూత్రాలను ఒకటికి రెండుసార్లు చూడకుండా రాస్తే మంచిది.
-ఈ పరీక్షలో MCQsని ప్రాక్టీస్‌ చేయాలి.
-అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అన్ని చాప్టర్లకి ప్రాధాన్యం ఇవ్వాలి.
-నిడివిగా ఉన్న చాప్టర్ల కంటే, సులభంగా తక్కువ పరిమాణంలో ఉండే చాప్టర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
-ఈ సబ్జెక్టులో ముఖ్యమైన చాప్టర్స్‌ Derivatives, Integrations, Permutations and Combinations, Ratio and Proportions, Time Value of Money, Matrices.
-కొత్తగా టైమ్‌ వ్యాల్యూ ఆఫ్‌ మనీ, మ్యాట్రిక్స్‌ చాప్టర్లను చేర్చారు. అందువల్ల వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. టైమ్‌ వ్యాల్యూ ఆఫ్‌ మనీ నుంచి సుమారు 13 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

స్టాటిస్టిక్స్‌

-ఇది 40 మార్కులకు ఉంటుంది.
-ఇంటర్‌లో ఏ గ్రూపు చదివిన విద్యార్థులకైనా స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు కొత్తదే.
-మ్యాథ్స్‌ అంటే భయపడే విద్యార్థులు ఇందులో మంచి స్కోర్‌ చేసుకోవచ్చు. కనీసం 20-30 శాతం ప్రశ్నలు థియరీకి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఎంసీక్యూలను నిర్లక్ష్యం చేయకూడదు.
-ఈ సబ్జెక్టులో ప్రాబబిలిటీ, థియరిటికల్‌ డిస్ట్రిబ్యూషన్స్‌, శాంప్లింగ్‌, స్టాటిస్టికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ డాటా, టైమ్‌ సిరీస్‌ చాప్టర్లు ముఖ్యమైనవి. ఇందులో టైమ్‌ సిరీస్‌ చాప్టర్‌ను కొత్తగా చేర్చారు. దీనిపై దృష్టికేంద్రీకరించాలి.

లాజికల్‌ రీజనింగ్‌

-ఈ సబ్జెక్టుకు 20 మార్కులు కేటాయించారు.
-విద్యార్థులకు అనలిటికల్‌ స్కిల్స్‌, పరిశీలనా శక్తి పెరుగుతాయని ఈ సబ్జెక్టును సిలబస్‌లో చేర్చారు. ప్రస్తుతం ఏ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష అయినా రీజనింగ్‌ తప్పనిసరి సబ్జెక్టు. అందువల్ల ఇది సీఏ విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటర్‌లో ఏ గ్రూప్‌వారైనా ఇందులో మంచి మార్కులు సాధించవచ్చు.
-ఈ విభాగంలో మొత్తం ఏడు చాప్టర్లుంటాయి. వాటిలోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.
-తరగతిగదిలో ఏ రోజు విన్న అంశాలను అదేరోజు చదివితే పునశ్చరణ సులభమవుతుంది.
-లాజికల్‌ రీజనింగ్‌కి తార్కిక ఆలోచనా విధానం చాలా అవసరం. ఒక ప్రశ్న గురించి మనం ఎంత తార్కికంగా ఆలోచిస్తామనే దాన్నిబట్టి మనం ఎంచుకునే సమాధానం ఆధారపడి ఉంటుంది.

పేపర్‌-4

-బిజినెస్‌ ఎకనామిక్స్‌, బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌.
-ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌లో వివిధ రకాల వ్యాపార సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ప్రారంభ, నిర్వహణ పద్ధతులు, వస్తు ధర నిర్ణయాల గురించి, వ్యాపారానికి సంబంధించి వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది.

బిజినెస్‌ ఎకనామిక్స్‌

-దీనికి 60 మార్కులు ఉంటాయి.
-ఈ సబ్జెక్టు ద్వారా వ్యాపారంలో ఎకనామిక్స్‌ ప్రాధాన్యం ఎంత ఉంటుందో తెలుస్తుంది.
-పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో 30-40 ప్రశ్నలు తేలికగాను, నేరుగా అడిగేవిగాను ఉండే అవకాశం ఉంటుంది.
-ఈ సబ్జెక్టులో ప్రాబ్లమ్స్‌ వస్తే తికమక పడకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి సమాధానం గుర్తించాలి.
-ఇందులో పటాలు ఉన్నాయి. విద్యార్థులు వాటిని వివరించగలరా లేదా అని తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటిపై శ్రద్ద వహించాలి.
-నిర్వచనాలు, రచయితల పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
-ఇందులో థియరీ ఆఫ్‌ కన్జ్యూమర్‌ బిహేవియర్‌, కాస్ట్‌ అనాలిసిస్‌, ప్రొడక్షన్‌ అనాలిసిస్‌, ప్రైస్‌ అండ్‌ అవుట్‌పుట్‌ డిటర్మినేషన్‌, బిజినెస్‌ సైకిల్స్‌, డిమాండ్‌ ఫోర్‌కాస్టింగ్‌ చాప్టర్లు ముఖ్యమైనవి. వీటిలో బిజినెస్‌ సైకిల్స్‌, డిమాండ్‌ ఫోర్‌కాస్టింగ్‌ చాప్టర్లను కొత్తగా తీసుకువచ్చారు.

బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌

-దీనికి 40 మార్కులు ఉంటాయి. ఇది కొత్తగా తీసుకొచ్చిన సబ్జెక్టు కాబట్టి పరీక్షలో ప్రశ్నలు కఠినంగా రాకపోవచ్చు.
-బేసిక్స్‌పై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్టు ద్వారా మంచి స్కోర్‌ చేసుకోవచ్చు.
-ఐసీఏఐ వారి మెటీరియల్‌ తప్పనిసరిగా చదవాలి.
-దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు సిలబస్‌లో పొందుపర్చారు. బిజినెస్‌కు సంబంధించిన టెర్మినాలజీ, టెక్నికల్‌ పదాలకు సరైన అర్థం తెలుసుకోవాలి.
-వ్యాపార రంగంలో నిత్యం జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. దీనికోసం న్యూస్‌ పేపర్లలో ఉండే బిజినెస్‌ వార్తలు తప్పనిసరిగా చదవాలి.
-ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించి స్థాపించిన ఏడాది, వ్యవస్థాపకులు, చైర్మన్‌, సీఈఓ, ఎండీ, ఆ సంస్థ నిర్వహించే వ్యాపార లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించి ఒక పట్టికలా తయారు చేసుకుని సన్నద్ధమవ్వాలి. వీలైనప్పుడల్లా ఆ పట్టికను చూస్తూ ఉండాలి. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి.
-సీఏ ఫౌండేషన్‌ పరీక్షలోని చివరి రెండు పేపర్లు 3, 4 ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. వీటిలో ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు అంటే ఒక్కో తప్పు జవాబుకు 1/4 మార్కు తీసివేస్తారు. కాబట్టి తెలిసిన వాటికే జవాబులు రాయాలి.

ca-foundation2

విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు

-పరీక్షకు ఇంకొద్దిరోజుల కాలవ్యవధి మాత్రమే ఉంది. నేర్చుకోవాల్సిన అంశాలను ప్రాధాన్య క్రమంలో చదవాలి.
-మీరు చదువుకునే ప్రదేశాన్ని మార్చకండి.
-రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్‌కు కేటాయించండి.
-ఒక టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకోవాలి. అంటే ఏ సమయంలో ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్‌ చదవాలని. అంతేకాని ఎప్పుడుపడితే అప్పుడు, ఏది పడితే అది చదవద్దు. ఒక క్రమ పద్ధతిలో చదివితే సీఏ ఫౌండేషన్‌ పాసవడం పెద్ద కష్టమేమీ కాదు.
-ఏ సబ్జెక్టు అయితే కష్టమనుకుంటారో ఆ సబ్జెక్టుని ఎక్కువ సేపు చదవండి. అంతేగాని వచ్చిన సబ్జెక్టునే చదువుతూ పోతే రాని సబ్జెక్టుని చదవడానికి సమయం సరిపోదు. మెయిన్‌ పరీక్ష పాస్‌ కావాలంటే పూర్తిగా అన్ని సబ్జెక్టులు కలిపి 50 శాతం మార్కులే కాకుండా సబ్జెక్టు వైజ్‌గా కూడా 40 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే పాసైనట్లు పరిగణిస్తారు. కాబట్టి అన్ని సబ్జెక్టులకు కనీస ప్రాధాన్యం ఇవ్వాలి.
-రెండు పేపర్లలో 60 కంటే ఎక్కువ మార్కులు సాధించి మిగతా రెండు పేపర్లలో కనీసం 40 మార్కులు సాధించిన ఒక విద్యార్థి సునాయాసంగా సీఏ ఫౌండేషన్‌ పరీక్ష పాసవచ్చు.
-ఒక ‘డౌట్స్‌ బుక్‌' పెట్టుకోండి. మీకు వచ్చిన డౌట్స్‌ ఆ పుస్తకంలో రాయండి. మీ డౌట్స్‌ని చదువుకునే సమయంలో మీరే నివృత్తి చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్‌ని అడిగి నివృత్తి చేసుకోండి. అప్పటికీ మీ డౌట్‌ నివృత్తి కాకపోతే ఫ్యాకల్టీని అడిగి క్లారిఫై చేసుకోండి.
-ప్రతి 90 నిమిషాల తర్వాత మీరు చదువుతున్న సబ్జెక్టును మార్చండి. అంటే చదువుతున్న సబ్జెక్టును 90 నిమిషాలకు మార్చి మార్చి చదవండి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
-ఒకేసారి అన్ని సబ్జెక్టులు చదవకుండా వీలైనంతవరకు సబ్జెక్టులన్నిటిని రెండు విభాగాలుగా విభజించండి. మొదటి భాగంలో రెండు పేపర్లు, రెండో భాగంలో రెండు పేపర్లు ఉండేలా చూసుకోండి. మొదటి భాగంలో రెండు పేపర్లను ఎంచుకునేటప్పుడు ఒకటి మీకు బాగా వచ్చిన పేపర్‌, ఒకటి రాని పేపర్‌ ఎంచుకోవాలి. అలానే రెండో భాగంలోని రెండు పేపర్లలో కూడా ఒకటి బాగా వచ్చిన పేపర్‌, ఒకటి మీకు రాని పేపర్‌ ఎంచుకోవాలి.
-మొదటి రోజు మొదటి భాగంలోని రెండు సబ్జెక్టులు ప్రిపేర్‌ అయితే రెండో భాగంలోని రెండు పేపర్లు ప్రిపేరవ్వాలి. అలా పేపర్లు మారుస్తూ చదవండి తప్పా ఒక సబ్జెక్టు మొత్తం పూర్తయ్యాక మరొక సబ్జెక్టు చదవడమనేది సరైన పద్ధతి కాదు.
-మీరు ఇన్నాళ్లు టెక్ట్స్‌బుక్స్‌ లేదా ఏదైనా సీఏ ఫౌండేషన్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ని చదివి ఉంటే వాటినే మళ్లీ చదవండి. కొత్త స్టడీ మెటీరియల్‌ లేదా పాఠ్యపుస్తకాలను మాత్రం చదవద్దు. అలా చేస్తే కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు B.Law సబ్జెక్టులోని కొన్ని కేస్‌ స్టడీస్‌ ఒక టెక్ట్స్‌బుక్‌లో ఒకలా మరో టెక్ట్స్‌బుక్‌లో మరోలా ఉంటుంది. మీరు ఐసీఏఐ వారి స్టడీ మెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోండి. సీఏ ఫౌండేషన్‌లోని Accounts& B.Law సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. సీఏ ఫౌండేషన్‌ మొదటి ప్రయత్నంలోనే పాస్‌ కావాలంటే ఈ రెండు సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. ప్రిపరేషన్‌ సయమంలో ఈ సబ్జెక్ట్స్‌కు సింహభాగం కేటాయించండి.
-మార్కెట్‌లో లభించే వివిధ రకాల టెక్ట్స్‌బుక్స్‌ కన్నా ఐసీఏఐ జారీ చేసే మెటిరీయల్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.
-సీఏ ఇన్‌స్టిట్యూట్‌ మెటీరియల్‌లోని ఏ ఒక్క ప్రశ్నను వదలవద్దు. అన్ని ప్రశ్నలు చదవాలి.
-సీఏ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతి పరీక్షకు ఎంటీపీలు, ఆర్‌టీపీలు విడుదల చేస్తాయి. ఆర్‌టీపీలో ప్రతి చాప్టర్‌ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. ఎంటీపీ అంటే మోడల్‌ పేపర్స్‌ లాంటివి.
-2018, నవంబర్‌, 2019, మే, నవంబర్‌కు సంబంధించిన మోడల్‌, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లను సేకరించుకుని చదవాలి.
-సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు ఇప్పటికి 3 సార్లు జరిగాయి. ఆ ప్రశ్న పత్రాలను సేకరించి ప్రిపేర్‌ అవండి.
-ప్రాబ్లమేటిక్‌ పేపర్‌ ఏదైన సన్నద్ధమయ్యేటప్పుడు కేవలం ప్రశ్నలు చూస్తే చాలదు. ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
-మీరు చదివే పుస్తకాల్లోగాని లేదా ఐసీఏఐ మోడల్‌ టెక్ట్స్‌ పేపర్లలో ఉన్న MCQ’ల పక్కన కీ (answer) రాయకండి. అలా చేస్తే రివిజన్‌ చేసుకునే సమయంలో ఆ ఎంసీక్యూకి సంబంధించిన ఆన్సర్‌ పక్కనే ఉండటంవల్ల ఆ ఎంసీక్యూ జవాబు విశ్లేషించడానికి వీలుండదు. మీరు ఆ ఎంసీక్యూ మీద మళ్లీ ఏకాగ్రత పెట్టలేరు.
-ప్రాక్టీస్‌ చేస్తున్న క్రమంలో తప్పులను విశ్లేషించుకోవాలి. కష్టంగా అనిపిస్తున్న, వేగాన్ని నియంత్రిస్తున్న విషయాలను గ్రహించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి.
-తెలియని ప్రశ్నల్లో కూడా సులువుగా నేర్చుకోగల ప్రశ్నలు ఏమున్నాయో తెలుసుకోవాలి. వాటిని చదవడానికి ప్రయత్నించాలి.
-క్యాలిక్యులేటర్‌ను స్పీడ్‌గా ఉపయోగించేలా క్యాలిక్యులేటర్‌ టైపింగ్‌ ప్రాక్టీస్‌ చేయండి. ఒక మంచి కంపెనీకి సంబంధించిన క్యాలిక్యులేటర్‌ను ముందే కొనండి. కనీసం రోజుకు 15 నిమిషాలు పైనా క్యాలిక్యులేటర్‌పై స్పీడ్‌ టైపింగ్‌ ప్రాక్టీసు చేయండి. మీరు ఏ క్యాలిక్యులేటర్‌పై ప్రాక్టీసు చేశారో అదే క్యాలిక్యులేటర్‌ను పరీక్షా సమయంలో తప్పనిసరిగా ఉపయోగించండి. ఎట్టి పరిస్థితిల్లోనూ చిన్నసైజు క్యాలిక్యులేటర్‌ను వాడవద్దు. చిన్న క్యాలిక్యులేటర్‌ అయితే ఫింగరింగ్‌ సరిగా రాదు. చిన్న క్యాలిక్యులేటర్‌ వాడటంవల్ల పరీక్షలో అసౌకర్యంతో పాటు, సమయం కూడా వృథా అవుతుంది. సీఏ ఫౌండేషన్‌ పరీక్షలో ఎలక్ట్రానిక్‌ క్యాలిక్యులేటర్‌ వాడరాదు.
-తుది పరీక్ష ఏ సమయంలో జరుగుతుందో అదే సమయంలో నమూనా పరీక్షలు అలవాటు చేసుకోవాలి.

ఎంసీక్యూలు ఉన్న సబ్జెక్టులు ఎలా ప్రిపేరవ్వాలి

-ఎంసీక్యూలను Mugup చేయకూడదు. సీఏ ఫౌండేషన్‌ పబ్లిక్‌ పరీక్షలో తెలిసిన ఎంసీక్యూలనే చిన్న మార్పులు చేసి కొత్త పద్ధతిలో ప్రశ్నించే అవకాశం ఉంది. పేపర్‌ ఎలా వచ్చినా జవాబు రాయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే అంశాలవారీగా ప్రిపేరవ్వాలి.
-క్షుణ్ణంగా వచ్చిన ఎంసీక్యూ లేదా ప్రశ్నలు కొట్టివేస్తూ రావాలి. ఇలా చేయడంవల్ల మళ్లీ వాటిని చదవాల్సిన అవసరం ఉండదు.
-మొదటిసారి రివిజన్‌లో కొట్టివేయని ప్రశ్నలను రివైజ్‌ చేసుకోవాలి. వాటిలో వచ్చినవి, ముఖ్యం కాదనుకున్న వాటిని కొట్టివేయాలి. రెండో రివిజన్‌లో మరికొన్ని ఎంసీక్యూలను కొట్టివేస్తూ వెళ్లాలి. అలా మూడు, నాలుగు రివిజన్లు చేసే సమయానికి దాదాపు 80 నుంచి 90 శాతం ఎంసీక్యూలను కొట్టివేస్తే పరీక్షకు ఒకటి రెండు రోజుల ముందు మిగిలిన 10 శాతం ఎంసీక్యూలను చదివితే సరిపోతుంది.
డిస్క్రిప్టివ్‌ పేపర్లకు సంబంధించిన సలహాలు
-గుర్తుంచుకోవాల్సిన అంశాలను క్విక్‌ రివిజన్‌ నోట్స్‌, కీ పాయింట్స్‌ రాస్తే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. క్విక్‌ రివిజన్‌ నోట్స్‌ ద్వారా అతి తక్కువ సమయంలో సిలబస్‌ మొత్తాన్ని రివైజ్‌ చేయవచ్చు. దీనివల్ల ప్రతి రివిజన్‌లో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది.
-ప్రాబ్లమాటిక్‌ పేపర్లలో ఏదైనా ముఖ్యమైనవని అనిపిస్తే మీ మెటీరియల్‌లో/నోట్‌బుక్స్‌లో హైలైట్‌ చేయండి. దీనివల్ల రివిజన్‌కు పట్టే సమయాన్ని బాగా తగ్గించవచ్చు.
-తెలియని అంశాలను వదిలివేసి తెలిసిన అంశాలనే పునశ్చరణ చేయాలి.
-గత ప్రశ్నపత్రాలను లోతుగా, తార్కికంగా, భావనపరంగా, అన్వయపరంగా, వ్యూహాత్మకంగా పరిశీలిస్తే ప్రశ్నల ఓరియంటేషన్‌ అర్థమవుతుంది. అలాంటి ప్రశ్నలను వీలైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తే మంచిది. అలాగే అలాంటి ప్రశ్నలు ఉన్న మాక్‌టెస్టులనూ రాయాలి.
-ప్రతి ప్రశ్నను సాల్వ్‌ చేసేందుకు కాలపరిమితిని విధించుకోవాలి. అలా ప్రాక్టీస్‌ చేస్తూ వేగం పెంచుకోవాలి.

m-prakash

1026
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles