కరెంట్ అఫైర్స్


Wed,September 18, 2019 12:06 AM

Telangana
Telangana

ఈ-మ్యాగజైన్‌ ప్రారంభం

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఈ-మ్యాగజైన్‌ (ఎడ్యుష్యూర్‌)ను రూపొందించింది. దీనిని హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 11న విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. దీనిలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశబోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ప్రస్తావిస్తారు.

నాయుడమ్మ అవార్డులు

సైన్స్‌ & టెక్నాలజీ రంగంలో కృషిచేసినందుకు త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిలకు డాక్టర్‌ నాయుడమ్మ అవార్డులు లభించాయి. నాయుడమ్మ 79వ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 11న యలవర్తి ఫౌండేషన్‌ ఈ అవార్డులను ప్రదానం చేసింది.

ఓయూ ప్రొఫెసర్‌కు అవార్డు

ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ఫ్రొఫెసర్‌ మల్లేశంకు ఇంజినీర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 159వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

సామాజిక, ఆర్థిక నివేదిక

సెప్టెంబర్‌ 12న విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.4,57,034తో మొదటి స్థానంలో నిలవగా జగిత్యాల జిల్లా రూ.92,751తో చివరి స్థానంలో నిలిచింది. పెద్దపలి జిల్లా తలసరి ఆదాయం రూ.1,46,634, కరీంనగర్‌ జిల్లా తలసరి ఆదాయం రూ.1,28,221.

National
National

జాతీయ పశువ్యాధుల నివారణ

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాన్ని (నేషనల్‌ యానిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం-ఎన్‌ఏడీసీపీ) ప్రధాని మోదీ సెప్టెంబర్‌ 11న ప్రారంభించారు. జంతువుల రక్షణ కోసం ప్రవేశపెడుతున్న ఈ కొత్త పథకంలో భాగంగా ఐదేండ్లలో 50 కోట్ల జంతువులకు (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు) వ్యాక్సినేషన్‌ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రీ థింకింగ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పుస్తకావిష్కరణ

మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌ రాయ్‌ రాసిన ‘రీ థింకింగ్‌ గుడ్‌ గవర్నెన్స్‌' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 13న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్‌ 12న ప్రారంభించారు. ఈ పథకం 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏండ్లు దాటిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్‌ అందించేందుకు ఉద్దేశించింది. ఈ పథకంతోపాటు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పెన్షన్‌ యోజన పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో కూడా 60 ఏండ్లు నిండిన లబ్ధిదారులకు నెలకు రూ.3000 పెన్షన్‌ అందిస్తారు.

తేజస్‌ ల్యాండింగ్‌ విజయవంతం

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, నౌకాదళ వెర్షన్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌'కు సంబంధించి అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న విజయవంతమైంది. డీఆర్‌డీవో, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఈ తేజస్‌ను గోవాలోని ఓ నావికా కేంద్రంలో పరీక్షించారు. నౌకాదళంలోని విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై తొలిసారిగా తేజస్‌ దిగింది. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాల తర్వాత ఈ తరహా సామర్థ్యమున్న దేశంగా భారత్‌ నిలిచింది.

మిలిటరీ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌

షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) దేశాల తొలి మిలిటరీ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌ను న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 13న నిర్వహించారు. యుద్ధక్షేత్రంలోని సైనికులు జీవ ఉగ్రవాదం (బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర క్రిముల ద్వారా ప్రజలను చంపడం లేదా అస్వస్థతకు గురిచేయడం) బారిన పడకుండా ఎస్‌సీఓ దేశాల సైనిక బలగాల వైద్య సర్వీసులు (ఏఎఫ్‌ఎంఎస్‌) ప్రభావశీల మార్గాల అన్వేషణపై చర్చించారు.

International
International

మలేరియా కేసుల జాబితా

ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల జాబితా-2017ను సెప్టెంబర్‌ 10న లాన్సెట్‌ జర్నల్‌ విడుదల చేసింది. ఈ నివేదికలో ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కాంగో, మొజాంబిక్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

అమెరికాలో జడ్జిగా భారత సంతతి వ్యక్తి

అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి పదవికి భారత సంతతికి చెందిన అనురాగ్‌ సింఘాల్‌ పేరును డొనాల్డ్‌ ట్రంప్‌ సెప్టెంబర్‌ 10న ప్రతిపాదించారు. ఫ్లోరిడాలో ఈ పదవికి నామినేట్‌ అయిన తొలి భారత సంతతి న్యాయవాదిగా సింఘాల్‌ ప్రత్యేకత సాధించారు.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా నూర్‌ వలీ

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ నూర్‌ వలీ మెహసుద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్‌ 12న ప్రకటించింది. ఇంతకుముందు మసూద్‌ అజర్‌, సయ్యద్‌ హఫీజ్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది.

చైనా ఉపగ్రహాల ప్రయోగం

విపత్తుల నివారణ, వాతావరణ మార్పుల అధ్యయనం, ధృవప్రాంతాల పరిశీలన, పట్టణ నిర్మాణాల లక్ష్యంగా మూడు ఉపగ్రహాలను చైనా అంతరిక్షంలోకి పంపింది. షాంగ్జి ప్రావిన్స్‌లో ఉన్న తైవాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్‌ 12న వీటిని రోదసిలో చేరవేసింది. లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ నుంచి రిసోర్స్‌ శాట్‌ లైట్‌, మరో రెండు చిన్నతరహా ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి.

క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్‌

దక్షిణాసియాలోనే తొలి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్‌ను భారత్‌-నేపాల్‌ మధ్య సెప్టెంబర్‌ 10న ప్రారంభించారు. బిహార్‌లోని మోతిహారి, నేపాల్‌లోని అమ్లేఖ్‌ గంజ్‌ల మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 69 కి.మీ. పొడవునా ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైన్‌ ద్వారా నేపాల్‌కు ఏటా సుమారు 20 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు అందనున్నాయి.

టైమ్స్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌

ప్రఖ్యాత టైమ్స్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని 1400 యూనివర్సిటీలను పరిశీలించి 2020కుగాను ర్యాంకులను సెప్టెంబర్‌ 12న ప్రకటించింది. దీనిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ (యూకే) మొదటిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (యూఎస్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి (యూకే), స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ (యూఎస్‌) నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ 301-350 ర్యాంకు సాధించింది.

స్లీరోసిస్‌ వ్యాధి పరిశోధనలకు విరాళం

బ్రిటిష్‌ దేశానికి చెందిన, హాలీవుడ్‌ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌ సెప్టెంబర్‌ 12న యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌కు రూ.134.39 కోట్లు విరాళంగా అందించింది. వీటిని మల్టిపుల్‌ స్లీరోసిస్‌ వ్యాధిపై పరిశోధనల కోసం యూనివర్సిటీలోని రీజనరేషన్‌ న్యూరాలజీ కేంద్రానికి ఇచ్చింది.

Sports
Sports

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేతగా బియాంకా

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా కెనడాకు చెందిన బియాంకా ఆండ్రెస్కూ నిలిచింది. న్యూయార్క్‌లో సెప్టెంబర్‌ 8న జరిగిన ఫైనల్లో 15వ సీడ్‌ బియాంకా 8వ సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా)పై విజయం సాధించింది. ప్రైజ్‌మనీ విజేతకు రూ.27.59 కోట్లు (38,50,000 డాలర్లు), రన్నరప్‌కు రూ.13.62 కోట్లు (19,00,000 డాలర్లు) లభించాయి.

సెప్టెంబర్‌ 9న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) డానియల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను ఓడించి టైటిల్‌ సాధించాడు. కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న నాదల్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత రోజర్‌ ఫెదరర్‌ (20) రికార్డుకు ఒక్క టైటిల్‌ దూరంలో ఉన్నాడు.

ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రి విజేత చార్లెస్‌

ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రి విజేతగా ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెక్క్‌ నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్‌ 8న జరిగిన ఈ పోటీలో చార్లెస్‌ 53 ల్యాపుల రేసును గంటా 15 నిమిషాల 26.665 సెకన్లలో పూర్తిచేసి విజయం సాధించాడు. మెర్సిడెస్‌ డ్రైవర్లు బొటాస్‌, హామిల్టన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఈసీబీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా స్ట్రాస్‌

ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్‌ సెప్టెంబర్‌ 13న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈసీబీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ ఆష్లే గైల్స్‌ స్థానంలో స్ట్రాస్‌ బాధ్యతలు చేపట్టారు.

Persons
Persons

బాయ్‌కాట్‌, స్ట్రాస్‌లకు నైట్‌హుడ్‌

ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజాలు జెఫ్రీ బాయ్‌కాట్‌, ఆండ్రూ స్ట్రాస్‌లకు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నైట్‌హుడ్‌' పురస్కారాన్ని సెప్టెంబర్‌ 10న ప్రకటించింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌కు వీరు అందించిన సేవలకుగాను ఈ పురస్కారం దక్కింది. దీంతో వారు తమ పేరుకు ముం దు ‘సర్‌' పెట్టుకునే అవకాశం ఉంటుంది.

ఛాయాశర్మకు గేమ్‌ చేంజర్‌ పురస్కారం

నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మహిళా పోలీస్‌ అధికారిణి ఛాయాశర్మకు ఆసియా సొసైటీ గేమ్‌ చేంజర్‌ అవార్డు సెప్టెంబర్‌ 11న లభించింది. అమెరికాకు చెందిన ఆసియా సొసైటీ ఆసియాలో విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచినవారిని ఈ పురస్కారంతో సత్కరిస్తుంది. అక్టోబర్‌ 24న న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

కోడెల శివప్రసాదరావు మృతి

టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్‌ 16న మరణించారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947, మే 2న కోడెల జన్మించారు. అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికైన ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పలు శాఖల్లో పనిచేశారు.
Vemula-Saidulu

657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles