కరెంట్ అఫైర్స్


Wed,September 11, 2019 12:31 AM

presons

మోదీకి గ్లోబల్‌ గోల్‌కీపర్‌ అవార్డు


pmModi
ప్రధానమంత్రి మోదీకి ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ గోల్‌కీపర్‌' అవార్డును ఇస్తున్నట్లు బెల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సెప్టెంబర్‌ 3న ప్రకటించింది. మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేయనున్నారు. సెప్టెంబర్‌ 24న బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం వేదికగా జరుగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా గ్లోబల్‌ గోల్‌కీపర్‌ అవార్డును ఇస్తున్నట్లు ఫౌండేషన్‌ తెలిపింది.

ఏడబ్ల్యూఈబీ అధ్యక్షుడిగా సునీల్‌ అరోరా

ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం (ఏడబ్ల్యూఈబీ) అధ్యక్షుడిగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోరా సెప్టెంబర్‌ 3న నియమితులయ్యారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏడబ్ల్యూఈబీ నాలుగో సర్వసభ్య సమాఖ్య మాజీ అధ్యక్షుడు అయాన్‌ మింకు రాడులెస్క్‌ (రొమేనియా) నుంచి సునీల్‌ అరోరా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

రాబర్ట్‌ ముగాబే మృతి

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు 95 ఏండ్ల రాబర్ట్‌ ముగాబే సెప్టెంబర్‌ 6న మరణించారు. 1924, ఫిబ్రవరి 21న బ్రిటిష్‌ పాలనలోని రొడీషియా (ప్రస్తుత జింబాబ్వే)లో రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబంలో ముగాబే జన్మించారు. జెస్యూట్‌ మతబోధకుడి ద్వారా విద్యనభ్యసించారు. దక్షిణాఫ్రికాలోని ఫోర్ట్‌ హారే యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 14 ఏండ్ల జైలు శిక్షను అనుభవించారు. 1960లో జింబాబ్వే ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌ (జాను) పార్టీని స్థాపించారు. స్వాతంత్య్రానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ జాతిపితగా పేరుగాంచిన ఆయన 1987 నుంచి 2017 వరకు దేశ అధ్యక్ష హోదాలో కొనసాగారు. 2017, నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన సుదీర్ఘ పాలనకు తెరపడింది. జింబాబ్వే ప్రస్తుత అధ్యక్షుడిగా ఎమర్సన్‌ మగగ్వా ఉన్నారు.

Sports

టీ20లకు మిథాలీ వీడ్కోలు


Mithali-Raj
భారత మహిళా క్రికెటర్‌, హైదరాబాదీ స్టార్‌ మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. వన్డేలపై మరింత దృష్టిసారించేందుకు, 2021లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్‌ 3న మిథాలీ తెలిపింది. మహిళా క్రికెట్‌లో టీ20లు ప్రారంభమైన 2006 నుంచి టీమిండియా 104 మ్యాచ్‌లు ఆడితే అందులో 89 మ్యాచుల్లో ఆమె ప్రాతినిథ్యం వహించింది.

100 వికెట్ల వీరుడు మలింగ

శ్రీలంక క్రికెటర్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో తొలి 100 వికెట్ల వీరుడిగా రికార్డు సృష్టించాడు. అతడు మొత్తం 104 వికెట్లు తీశాడు. శ్రీలకంలోని కాండీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వరుస బంతుల్లో నలుగురిని అవుట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మలింగ 5 హ్యాట్రిక్‌లు సాధించాడు. మరే బౌలర్‌ ఇన్నిసార్లు ఈ ఘనత సాధించలేదు.

యూఎస్‌ ఓపెన్‌ మెన్స్‌ డబుల్‌

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో టాప్‌ సీడ్‌ యువాన్‌ సెబాస్టియన్‌ కబాల్‌-రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జంటకు పురుషుల డబుల్స్‌ టైటిల్‌ లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్‌ 6న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో కబాల్‌-ఫరా జంట ఎనిమిదో సీడ్‌ మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)-హొరాసియో జెబాలస్‌ (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. విజేత జంటకు రూ.5.30 కోట్లు (7,40,000 డాలర్లు) ప్రైజ్‌మనీ లభించింది.

National

రాంజెఠ్మలానీ మృతి


Ram-Jethmalani
ప్రముఖ న్యాయకోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ సెప్టెంబర్‌ 9న మరణించారు. 1923, సెప్టెంబర్‌ 14న సింధ్‌ప్రావిన్స్‌లోని శికార్‌పూర్‌లో ఆయన జన్మించారు. దేశంలో అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఆయన ఒకరు. దేశంలోని చాలామంది ప్రముఖుల కేసులను ఆయన వాదించారు. 1971లో మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 1977లో జనతాపార్టీ తరఫున, 1980లో బీజేపీ తరఫున ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు

ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్లు సెప్టెంబర్‌ 1న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినాయి. తెలంగాణకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు తెలంగాణ బీజేపీ సీనియర్‌ నాయకుడు దత్తాత్రేయ, రాజస్థాన్‌కు హిమాచల్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న కల్‌రాజ్‌ మిశ్రా, కేరళకు ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్‌ సింగ్‌ కోషియారీలు నియమితులయ్యారు.

కంబోడియాకు భారత యుద్ధనౌకలు

భారతదేశ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌లు కాంబోడియా దేశానికి సెప్టెంబర్‌ 6న బయలుదేరాయి. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతానికి రాయల్‌ కంబోడియా నేవీతో వృత్తిపరమైన అంశాలు, ఉన్నతాధికారులతో సమావేశాలు జరిపారు. ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రికి కెప్టెన్‌ అశ్విన్‌ అరవింద్‌, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌కు కెప్టెన్‌ గింటో జార్జ్‌చాకో.

ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌

ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌-2019 సదస్సు సెప్టెంబర్‌ 4న బెంగళూరులో ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సదస్సుకు 7 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష సైంటిస్ట్‌ బ్రిగ్‌ జెన్‌ ప్రొఫెసర్‌ చైమ్‌ ఈష్డె హాజరయ్యారు.

Telangana

కరాటే సైదులుకు బెస్ట్‌ కోచింగ్‌ అవార్డు


Saidulu
నల్లగొండ జిల్లాకు చెందిన వీ సైదులుకు అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో బెస్ట్‌ కోచింగ్‌ అవార్డును సెప్టెంబర్‌ 4న అందుకున్నాడు. ఈయన నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు గోల్డ్‌మెడల్‌ సాధించాడు.

ఇక్రిశాట్‌ డైరెక్టర్‌కు జయశంకర్‌ అవార్డు

ఇక్రిశాట్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కే వర్షిణికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ లైఫ్‌టైమ్‌ పురస్కారం లభించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 3న నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

హేమలతకు చేంజ్‌ మేకర్‌ అవార్డు

శిశు పోషణ విషయంలో విశేష కృషి చేసినందుకు జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలతకు చేంజ్‌ మేకర్‌ అవార్డు లభించింది. సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును ఆ సంస్థ ఏర్పాటై వందేండ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్‌ 4న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.

హెచ్‌సీయూకు ఎమినెన్స్‌ హోదా

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఎమినెన్స్‌ (ఐఓఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌ 5న ప్రకటించింది. ఈ హోదా దక్కిన విద్యాసంస్థల్లో మద్రాస్‌ ఐఐటీ, ఖరగ్‌పూర్‌ ఐఐటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలు ఉన్నాయి.

మంత్రివర్గ విస్తరణ

రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురు మంత్రులు సెప్టెంబర్‌ 8న ప్రమాణస్వీకారం చేశారు. కే తారకరామారావు (ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు), టీ హరీశ్‌రావు (ఆర్థికం), పీ సబితా ఇంద్రారెడ్డి (విద్యాశాఖ), పీ అజయ్‌కుమార్‌ (రవాణా), గంగుల కమలాకర్‌ (బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు), సత్యవతి రాథోడ్‌ (గిరిజన, స్త్రీ శిశు సంక్షేమం)లను మంత్రులుగా గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు.

గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం

రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ సెప్టెంబర్‌ 8న ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

కోట్ల వెంకటేశ్వరరెడ్డికి కాళోజీ పురస్కారం

2019కుగాను కాళోజీ నారాయణరావు పురస్కారం కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డికి లభించింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 9న ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును అందజేయనున్నారు. 2015లో అమ్మంగి వేణుగోపాల్‌, 2016లో గోరెటి వెంకన్న, 2017లో సీతారాం, , 2018లో అంపశయ్య నవీన్‌లకు కాళోజీ పురస్కారాలు లభించాయి.

International

భారత్‌-రష్యా 20వ వార్షిక సదస్సు


India-Russia
రష్యాలోని వ్లాదివోస్తోక్‌ నగరంలో భారత్‌-రష్యా 20వ రష్యా వార్షిక సదస్సును సెప్టెంబర్‌ 4 నుంచి 6 తేదీ వరకు నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, భారత ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సమావేశంలో ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, ఇంధనం, పెట్రోలియం, వాణిజ్యం, సహజవాయు వు, చెన్నై నుంచి వ్లాదివోస్తోక్‌ వరకు పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పా టు చేసే విషయం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అమెరికాలో భారత సంతతి మహిళా జడ్జి

భారత సంతతి మహిళ షిరీన్‌ మాథ్యూస్‌ కాలిఫోర్నియాలోని సదరన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఆర్టికల్‌-3 జడ్జిగా నియమితులయ్యారు. ఆమెను జడ్జిగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారని నేషనల్‌ ఆసియా పసిఫిక్‌ అమెరికన్‌ బార్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఏపీఏబీఏ) సెప్టెంబర్‌ 1న తెలిపింది.

అత్యుత్తమ జీవన నగరాల జాబితా

ఎకనామిక్స్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాలతో అత్యుత్తమ జీవన నగరాల జాబితాను సెప్టెంబర్‌ 4న విడుదల చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా (99.1 పాయింట్లు) తొలి స్థానంలో నిలిచింది. కెనడాలోని సిడ్నీ 2వ, జపాన్‌లోని ఒసాకా 3వ స్థానాల్లో నిలిచాయి. చివరిస్థానంలో సిరియాలోని డమాస్కస్‌ నిలిచింది. భారతదేశంలోని న్యూఢిల్లీ 118వ, ముంబై 119వ, పాకిస్థాన్‌లోని కరాచీ 136వ, బంగ్లాదేశ్‌లోని ఢాకా 138వ స్థానాల్లో నిలిచాయి.

ఇండోనేషియాలో ఐసీఐడీ సదస్సు

ఇండోనేషియాలోని బాలిలో సెప్టెంబర్‌ 2న అంతర్జాతీయ స్థాయిలో మూడేండ్లకోసారి ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ (ఐసీఐడీ) నిర్వహించే సదస్సు ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 7 వరకు జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చీఫ్‌ ఇంజినీర్లు హమీద్‌ ఖాన్‌, శంకర్‌, నర్సింహ, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు సదస్సుకు హాజరై తెలంగాణ రాష్ట్రం తీసుకున్న జల సంరక్షణ చర్యలపై మాట్లాడారు. మిషన్‌ కాకతీయ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆధునీకరణ, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటి వినియోగ సామర్థ్యం అంశాలపై పత్రాలు సమర్పించారు.
Vemula-Saidulu

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles