జేఈఈ మెయిన్‌లో భారీ మార్పులు


Mon,September 9, 2019 12:48 AM

మార్పులు మంచికే!!
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఈసారి భారీగా మార్పులు చేశారు. జేఈఈ విధానం ప్రవేశపెట్టిన ఎనిమిదేండ్ల తర్వాత పరీక్ష ప్రశ్నపత్రంలో జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. నిఫుణుల కమిటీ సిఫారసుల మేరకు స్కీం అండ్ సిలబస్‌లో భారీ మార్పులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డీ) సంస్కరణలు తీసుకువచ్చింది.
jee-students
- ప్రశ్నల సంఖ్య 90 నుంచి 75కి తగ్గింపు
- స్కీం&సిలబస్‌లో మార్పులు
-60 ఆబ్జెక్టివ్ (mcq), 15 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు
-360 నుంచి 300లకు తగ్గిన మొత్తం మార్కులు

-పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సంఖ్యతోపాటు ప్రశ్నల విధానాన్ని కూడా మార్చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష కొత్త విధానాన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో అందుబాటులో ఉంచింది. ఆబ్జెక్టివ్ విధానమే కాకుండా డిస్క్రిప్టివ్ విధానాన్ని కూడా తీసుకురావాలని భావించిన ఎంహెచ్‌ఆర్‌డీ.. ఈ మేరకు గతంలోనే నిఫుణల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే డిస్క్రిప్టివ్ విధానం కాకుండా సంఖ్యా సమాధాన (న్యూమరికల్ వ్యాల్యూ) సంబంధిత ప్రశ్నలను జేఈఈ మెయిన్ పరీక్షల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈ విధానం ఉండగా, ఇపుడు మెయిన్‌లోనూ ప్రవేశపెట్టింది. గతేడాది నుంచి జేఈఈ మెయిన్ రెండుసార్లు (జనవరి, ఏప్రిల్) నిర్వహిస్తున్న విషయం విదితమే.

300 మార్కులు- 75 ప్రశ్నలు

-జేఈఈ మెయిన్‌లో ఇప్పటివరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున మొత్తం 90 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండేవి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 360 మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండేది. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధించేవారు. కొత్త విధానంలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులే ఇవ్వనున్నప్పటికీ, ప్రశ్నల సంఖ్యను 75కి కుదించారు. ప్రతి సబ్జెక్టు నుంచి గతంలో 30 ప్రశ్నలు ఉండగా.. వాటిని 25కి తగ్గించారు. ఆ 25 ప్రశ్నల్లోనూ ఆబ్జెక్టివ్ విధానంలో 20 ప్రశ్నలు, న్యూమరికల్ వ్యాల్యూ పద్ధతిలో మరో 5 ప్రశ్నలు ఇస్తారు.
-మొత్తం మీద 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 15 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. న్యూమరికల్ వ్యాల్యూ కింద ఇచ్చే 15 ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ విధానం ఉండదు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశ పరీక్షల్లోనూ న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇచ్చేలా ఎంహెచ్‌ఆర్‌డీ మార్పులు చేసింది. బీఆర్క్‌లో ప్రవేశాలకు 77 ప్రశ్నలతో 400 మార్కులకు, బీప్లానింగ్‌లో ప్రవేశాలకు 100 ప్రశ్నలతో 400 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది.

పరీక్ష హాలుకు అరగంట ముందే రావాలి!

-దరఖాస్తులను ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో (jeemain. nta.nic.in) దాఖలు చేయాలి. అక్టోబర్ 1 లోపు ఫీజు చెల్లించవచ్చు.
-దరఖాస్తుల్లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు అక్టోబర్ 11 నుంచి 17 వరకు అవకాశం ఉంటుంది.
-డిసెంబర్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-మొదటి విడత పరీక్షలను 2020 జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.
-రోజు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్.
-రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తారు.
-పీహెచ్‌సీ అభ్యర్థులకు అదనపు సమయాన్ని ఇస్తారు.
-మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల్లోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల్లోపు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

మారిన విధానంలో న్యూమరికలే కీలకం

-మారిన విధానంలో మొదటి 20 ప్రశ్నలతో ఇబ్బంది లేదు. గతంలో లాగే వీటికి ఇచ్చిన నాలుగు ఆప్షన్ల నుంచి జవాబులను గుర్తించవచ్చు. దీనికి రకరకాల పద్ధతులను అభ్యర్థులు అనుసరించవచ్చు. దీనిలో కొంత తెలివిని, సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన న్యూమరికల్ వ్యాల్యూ విధానంలో అడిగే ఐదు ప్రశ్నలతోనే ఇబ్బంది. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేరయ్యేవారికి మాత్రం సులభమే. ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం కొంత ఊరట. విద్యార్థి సబ్జెక్టు లోతును పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉండవచ్చని నిపుణుల అంచనా. ప్రతి సబ్జెక్టులో 5 చొప్పున 15 ప్రశ్నలకు 60 మార్కులు కాబట్టి అవి చాలా కీలకం. మెయిన్ పాత పేపర్లతోపాటు గత అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఇచ్చిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు చూసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే వీటిని కచ్చితంగా చేస్తే మంచిది. నెగెటివ్ మార్కులు లేవు. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయడం మంచిది.

jee-students2

న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో కాఠిన్యత?

-గతంలో మూడుగంటల్లో 90 ప్రశ్నలకు సమాధానం గుర్తించేవారు. అంటే ప్రతి ప్రశ్నకు రెండు నిమిషాల సమయం దొరికేది. వీటిలో కొన్ని ప్రశ్నలు నేరుగా సమాధానం గుర్తించేవి ఉండేవి, వాటిని 30 సెకన్లలో జవాబు గుర్తించేవారు. దాంతో ప్రశ్నలకు సగటున కనీసం 3 నుంచి4 నిమిషాల సమయం దొరికేది. ఈసారి ప్రశ్నల సంఖ్య తగ్గించడం వల్ల పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే ఇప్పటివరకు ఇచ్చే ప్రశ్నల స్థాయి కంటే ఈసారి ప్రశ్నలస్థాయి పెరిగే అవకాశం ఉంటుందని జేఈఈ పరీక్షలో విశేష అనుభవం ఉన్న శిక్షణ నిపుణులు కాసుల కృష్ణచైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూమరికల్ వ్యాల్యూ జవాబులు ఉండే ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేనందున ప్రశ్నలు గతంలో అడ్వాన్స్‌డ్‌లో ఇచ్చిన విధంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

jee-students3

బీ ప్లానింగ్ కోర్సుకు ఇంటర్‌లో గణితం చదివితే చాలు

-ఈసారి చేసిన మరో ప్రధాన మార్పు సైన్స్ సబ్జెక్ట్ చదవకున్నా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీ ప్లానింగ్) కోర్సులో చేరడం. ఇదివరకు బీ ప్లానింగ్ కోర్సులో చేరాలంటే ఇంటర్‌లో గణితంతోపాటు భౌతిక, రసాయన శాస్ర్తాలు తప్పనిసరిగా చదవాల్సి ఉండేది. ఈసారి నుంచి గణితం సబ్జెక్టు చదివితే చాలు. భౌతిక, రసాయన శాస్ర్తాలు అవసరం లేదు. ఈక్రమంలో ఎంఈసీ గ్రూపు విద్యార్థులు కూడా బీ.ప్లానింగ్ చదవచ్చు. అంటే వారు జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్ష రాయవచ్చు.

బీఆర్క్‌లోనూ మార్పులు

-జేఈఈ మెయిన్‌లో రెండోపేపర్‌గా పేరుగాంచిన బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో ప్రవేశానికి నిర్వహించే మెయిన్ పేపర్-2 పరీక్షలో కూడా మరికొన్ని మార్పులు చేశారు.
-ఇప్పటివరకు బీఆర్క్ పరీక్షలో 100 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి 77 ప్రశ్నలే ఉంటాయి. ఇక్కడ గణితం ప్రశ్నలు 25 ఉంటే అందులో 5 పూర్ణాంక తరహావి ఇస్తారు. డ్రాయింగ్ పరీక్షలో గతంలో మూడు ప్రశ్నలు ఉండగా ఇప్పుడు రెండు మాత్రమే ఉంటాయి.

అర్హతలు:

జేఈఈ మెయిన్ పరీక్ష రాసేవారికి ఎటువంటి వయోపరిమితి లేదు. కానీ అభ్యర్థులు 2018, 2019లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా 2020 మార్చిలో పరీక్షలు రాస్తున్నవారై ఉండాలి. అయితే పరీక్ష అనంతరం ప్రవేశాలు పొందగోరే సంస్థల్లో వయోపరిమితి ఉంటుంది. (ఐఐటీల్లో ప్రవేశాలకు వయోపరిమితి ఉంటుంది)
నోట్: 2017 లేదా అంతకుముందు ఇంటర్ ఉత్తీర్ణులైనవారు జేఈఈ మెయిన్ రాయడానికి అర్హులు కారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే రాయడానికి అవకాశం ఇస్తారు.

పరీక్ష ఫీజు:

-బీఈ/బీటెక్ లేదా బీఆర్క్ లేదా బీప్లానింగ్ (ఏదైనా ఒకటి) పరీక్షకు- జనరల్, జనరల్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ బాలురకు ఫీజు- రూ.650/-
-ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, బాలికలకు రూ.325/-
-ఏవైనా రెండు పరీక్షలు అంటే బీఈ/బీఆర్క్ లేదా బీఈ, బీప్లానింగ్ రాయదలిస్తే ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు రూ.1300/- ఇతరులకు రూ.650/-
నోట్: ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.

రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:

-తెలంగాణలో: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.
-వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in

ఎన్‌టీఏతో మార్పులు ఆరంభం

-జేఈఈ మెయిన్ నిర్వహణ బాధ్యతను ఎన్‌టీఏకు అప్పగించిన తొలి ఏడాదే ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంతోపాటు రెండుసార్లు నిర్వహించారు. దీనికితోడు ఈసారి ప్రశ్నల సంఖ్య, విభిన్న ప్రశ్నలు, మార్కుల మొత్తం తదితరాల్లో మార్పులు చేయటం గమనార్హం. దీనివల్ల ప్రశ్నల కఠినత్వం కొంత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెయిన్ స్థాయిలోనే ఎక్కువమంది అభ్యర్థులను వడపోత పోయడానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టుపై పట్టు ఉన్నవారికి ఇది అనుకూలమని సీనియర్ ఫ్యాకల్టీలు భావిస్తున్నారు.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

544
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles