కరెంట్ అఫైర్స్


Wed,August 7, 2019 02:01 AM

International
International

సూపర్ ఎర్త్‌ను గుర్తించిన నాసా

నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టెస్) ఇటీవల విశ్వంలో కొత్త గ్రహ వ్యవస్థను గుర్తించింది. ఇందులో భూమిని పోలిన గ్రహం ఉందని, భూమికంటే పెద్దగా ఉన్న ఈ గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఉందని ప్రకటించింది. సూపర్ ఎర్త్‌గా పిలుస్తున్న ఈ గ్రహానికి జీజే 357డీ అని పేరుపెట్టారు. సౌరవ్యవస్థకు 70 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నూతన గ్రహ వ్యవస్థలో మూడు గ్రహాలు ఒక చిన్న మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయని నాసా వెల్లడించింది. ఈ నక్షత్రానికి టీవోఐ270 అని నామకరణం చేసింది.

మెకాంగ్-గంగా కో ఆపరేషన్

మెకాంగ్- గంగా సహకార సంస్థ (ఎంజీసీ) మంత్రుల స్థాయి పదో సమావేశం ఆగస్టు 2న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో ఎంజీసీ 2019-20 ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను పునరుద్ధరించారు. ఎంజీసీలో భారత్‌తోపాటు కాంబోడియా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థను లావోస్ రాజధాని వెంటియన్‌లో 2000లో ప్రారంభించారు. సభ్య దేశాల మధ్య టూరిజం, సంస్కృతి, విద్య, ప్రజారోగ్యం, సంప్రదాయ వైద్యం, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, రవాణా, సమాచారం, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు, నీటి వనరుల విషయంలో పరస్పర సహకారానికి సంస్థ కృషి చేస్తుంది.

భారత్‌లో ప్రధాన నది గంగ కాగా, తూర్పు ఆసియా దేశాల్లో మెకాంగ్ నది ముఖ్యమైనది. ఈ నది పరివాహంలో మయన్మార్, థాయ్‌లాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం దేశాలు ఉన్నాయి. అందువల్లనే ఈ సంస్థకు రెండు నదుల పేర్లను కలిపి పెట్టారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవం

ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఎంపవర్ పేరెంట్స్- ఎనేబుల్ బ్రెస్ ్టఫీడింగ్ అనే నినాదంతో 120 దేశాల్లో తల్లిపాల విశిష్టతను తెలుపుతూ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిపాల ప్రాధాన్యాన్ని పెంచేందుకు ప్రత్యేక వారోత్సవాన్ని నిర్వహించాలని 1991లో వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ ్టఫీడింగ్ యాక్షన్ (డబ్ల్యూఏబీఏ) నిర్ణయించగా 1992 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని యునెస్కో, డబ్ల్యూహెచ్‌వోలు నిర్వహిస్తాయి.

మానవ అక్రమ రవాణా నిరోధక దినం

జూలై 30న ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫికింగ్: కాల్ యువర్ గవర్నమెంట్ టు యాక్షన్ పేరుతో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో వివిధ దేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. 2013లో ఐరాస సాధారణ సభ ఒక తీర్మానం ద్వారా ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

National
National

ఆర్టికల్ 370 రద్దు

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుచేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్ము, కశ్మీర్‌లు శాసనసభ ఉన్న యూటీలుగా, లదాక్ శాసనసభ లేని యూటీగా ఏర్పడ్డాయి. ఆగస్టు 5న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయటంతో ప్రభుత్వ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది.

సైన్యంలో ఈ -కార్లు

దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తనవంతుగా భారత సైన్యం పర్యావరణ హితమైన ఈ కార్ల వాడకాన్ని మొదలుపెట్టింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థతో కలిసి సైనిక అధికారులు మామూలు కార్ల వాడకానికి బదులుగా కార్లను ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి ఈ కార్లను ఢిల్లీలో మాత్రమే ఉపయోగిస్తారు.

వన్ నేషన్ వన్ రేషన్‌కార్డు

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం జారీ చేసే రేషన్ కార్డులను దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా రూపొందించే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో ప్రారంభించారు. ఆగస్టు 1నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా ఏ రాష్ట్ర లబ్దిదారులైనా తమ రేషన్ సరుకులను తాము నివసిస్తున్న ప్రదేశంలోనే తీసుకోవచ్చు. ఉపాధి కోసం వలస వెళ్లే ప్రజలకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నేషనల్ టైం రిలీజ్ స్టడీ

దేశంలో సరిహద్దుల నుంచి సరుకులను త్వరగా చేరవేయడానికి వీలుగా ప్రభుత్వం మొదటిసారి నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ (టీఆర్‌ఎస్)ని ప్రారంభించింది. కేంద్ర రెవెన్యూ విభాగం ఆర్థిక శాఖతో కలిసి దీన్ని ఆగస్టు 1న ప్రారంభించింది. ఈ విధానాన్ని అంతర్జాతీయంగా బ్రస్సెల్స్‌కు చెందిన వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూసీవో) రూపొందించింది. దేశంలోకి ప్రవేశించే, దేశం బయటకు వెళ్లే సరుకులకు అనుమతులు త్వరితగతిన ఇవ్వడం ద్వారా వేగవంతమైన రవాణాకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఇది వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సుప్రీం జడ్జీల సంఖ్య పెంపు

పెండింగ్ కేసులు పెరిగిపోయి న్యాయమూర్తులపై పని ఒత్తిడి అధికమవుతుండటంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండగా, దీన్ని 34కు పెంచనున్నారు. ఇందుకోసం 1956నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టానికి సవరణలు చేస్తారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొబైల్ గేమ్

భారత వాయుసేనపట్ల దేశంలోని యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) త్రీడీ మొబైల్ గేమ్‌ను ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏ కట్ ఎబో పేరుతో రూపొందించిన ఈ గేమ్‌ను ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా జూలై 31న ప్రారంభించారు. 2014లో కూడా గార్డియన్స్ ఆఫ్ స్కైస్ పేరుతో ఐఏఎఫ్ ఓ గేమ్‌ను విడుదల చేసింది.

అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్

సమాజానికి సేవలు అందించడంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఢిల్లీలో జూలై 30న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. గ్రామాల స్థాయిలోనే స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేలా ప్రోత్సాహం అందిస్తుంది.

ఒడిశా సచివాలయం పేరు మార్పు

ఒడిశా సచివాలయం పేరును లోక్ సేవా భవన్‌గా మార్చారు. ఇప్పటివరకు సచివాలయంగా వ్యవహరిస్తున్నారు. దీనిని ఇకనుంచి లోక్‌సేవా భవన్‌గా పిలువాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆగస్టు 4న తెలిపారు.

Telangana
Telangana

అధికారికంగా జయశంకర్ సర్ జయంతి

జీవితాంతం తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 6న జయశంకర్ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు.

Persons
Persons

ఎన్డీటీవీ జర్నలిస్టు రవీశ్‌కుమార్‌కు

ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు లభించింది. దేశంలో ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన రవీశ్‌కుమార్‌కు జర్నలిజం విభాగంలో 2019కిగాను అవార్డు అందజేయనున్నట్లు రామన్‌మెగసెసె అవార్డుల కమిటీ ఆగస్టు 1న ప్రకటించింది. రవీశ్‌కుమార్‌తోపాటు ఈ ఏడాది వివిధ రంగాల్లో సేవలందించిన ఐదుగురికి ఈ అవార్డులు ప్రకటించారు. అందులో కోస్వె విన్ (మయన్మార్), నీలపైజిత్ ఆంగ్‌కోనా (థాయ్‌లాండ్), కయబెబ్ రామ్యుండో పుజంటీ (ఫిలిప్పైన్స్), కిమ్‌జోంగ్ కి (దక్షిణ కొరియా) ఉన్నారు. ఆసియా నోబెల్‌గా వ్యవహరించే రామన్ మెగసెసె అవార్డును 1957లో ఫిలిప్పైన్స్ మూడో అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరుమీదుగా ఏర్పాటుచేశారు. న్యూయార్క్‌కు చెందిన రాక్‌ఫెల్లర్స్ బ్రదర్స్, ఫిలిప్పైన్స్ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని ఏర్పాటుచేశాయి.

గిరిరాజ్ ప్రసాద్ గుప్తా

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా (సీజీఏ) గిరిరాజ్ ప్రసాద్ గుప్తా ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించారు. 1983 ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ బ్యాచ్ అధికారి అయిన ప్రసాద్‌గుప్తా దేశంలో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అభివృద్ధి, అమలులో ఎనలేని కృషి చేశారు.

దేవదాస్ కనకాల

ప్రముఖ నటుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల ఆగస్టు 2న హైదరాబాద్‌లో మరణించారు. యానాంలో జన్మించిన ఆయన పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొంది అనేక తెలుగు సినిమాల్లో నటించారు. సొంతంగా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుచేసి ప్రస్తుతం ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చారు.

ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా గిరీష్

పార్లమెంటులో అంచనాల సంఘం చైర్మన్‌గా బీజేపీ ఎంపీ గిరీష్ బాపట్ నియమితులయ్యారు. ఆయన పుణే నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్లమెంటులోని మూడు ద్రవ్యపరమైన కమిటీల్లో అంచనాల సంఘం ఒకటి. ఈ సంఘంలో సభ్యులుగా దిలీప్ ఘోష్, పీపీ చౌదరి, కేసీ పాటిల్ నియమితులయ్యారు.

Sports
Sports

పృథ్వీషాపై సస్పెన్షన్

భారత యువ క్రికెటర్ పృథ్వీషా డోప్ టెస్టులో పట్టుబడ్డాడు. దాంతో అతనిపై నవంబర్ 15 వరకు బీసీసీఐ నిషేధం విధించింది. నిషేధం పూర్తయ్యేవరకు అతడు ఎలాంటి ఫార్మాట్‌లో క్రికెట్ ఆడరాదని స్పష్టం చేసింది.

థాయ్‌లాండ్ ఓపెన్

థాయ్‌లాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను భారత జోడీ గెలుచుకుంది. బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ చైనా ఆటగాళ్లు జున్ చెన్ జోడీని 21-19, 18-21, 21-18 పాయింట్ల తేడాతో ఓడించింది. ఈ టైటిల్‌ను గెలిచిన తొలి భారత జంటగా వీరు రికార్డు సృష్టించారు.

భారత్‌దే టీ 20 సిరీస్

అమెరికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టీ 20 మ్యాచుల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆగస్టు 4న లాడర్‌హిల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో భారత్ 22 పరుగుల తేదాడో నెగ్గింది. మొదటి మ్యాచ్‌లో కూడా భారత్ గెలువటంతో సిరీస్ సొంతమైంది.

వినేశ్ పొగాట్‌కు మరో స్వర్ణం

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పోలెండ్‌లోని వార్సాలో ఆదివారం జరిగిన రెజ్లింగ్ పోటీ ఫైనల్లో 53 కిలోల విభాగంలో పోలెండ్ క్రీడాకారిణి రుక్సానాను ఓడించి స్వర్ణపతకం సాధించింది. ఇటీవలే ఆమె స్పెయిన్ గ్రాండ్‌ప్రీ, యాసర్ గోడు టోర్నీల్లో స్వర్ణాలు సాధించారు.

Vemula-Saidulu

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles