కరెంట్ అఫైర్స్


Wed,July 31, 2019 02:06 AM

ఘనవ్యవర్థాల నిర్వహణఘనవ్యవర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 2018 నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు శుద్ధి చేసిన ఘనవ్యవర్థాల నిర్వహణ జాబితాను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జూలై 25న విడుదల చేసింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ మొదటి స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఏటా 6,01,885 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో 84 శాతం ప్రాసెస్ చేస్తున్నారు. తెలంగాణలో 26,90,415 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, 73 శాతం ప్రాసెస్ అవుతున్నాయి. పశ్చిమబెంగాల్ అత్యంత తక్కువగా 5 శాతం, జమ్మకశ్మీర్ 8 శాతం ప్రాసెస్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా ఏటా 8,22,38,050 మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.


తెలంగాణ పోలీసులకు పతకాలు

62వ అఖిలభారత డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు పతకాల పంట పండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జూలై 16 నుంచి 20 వరకు జరిగిన ఈ పోటీల్లో రాచకొండ సైబర్ క్రైం సీఐ అవినాశ్‌రెడ్డి ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో బంగారు, మెడికో లీగల్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. చార్మినార్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జీ భాస్కర్‌రావు బంగారు పతకం గెలవగా, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్సై జీ అనూరాధ రజత పతకం గెలిచారు. ఐడబ్ల్యూఎస్ విభాగంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ శ్రీనివాస్‌కు కాంస్యం లభించింది.
Polices

40 వేల మెగావాట్ల సౌరవిద్యుత్

2022 నాటికి దేశంలో 40 వేల మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ కూడా ఉంటుంది. ఈ ఏడాది జూలై 18 నాటికి గ్రిడ్‌కు అనుసంధానించిన దేశంలోని రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పాదిత సామర్థ్యం 1700 మెగావాట్లు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా భావిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రాథమిక పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఉత్తర రైల్వే పరిధిలోని న్యూఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌లోని చిన్న పట్టణం కాత్రా వరకు ప్రయోగాత్మకంగా ఈ రైలును నడిపించారు. ట్రైన్-18గా కూడా పిలుస్తున్న ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి నిర్మించింది. ఈ రైలులో జీపీఎస్ వంటి అత్యాధునిక సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

జూలై 23 నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ డే

జూలై 23న నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ డేను దేశవ్యాప్తంగా నిర్వహించారు. దేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23న ప్రారంభం కావటంతో ఆ రోజును బ్రాడ్‌కాస్టింగ్ డేగా నిర్వహిస్తున్నారు. 1927 జూలై 23న బాంబే నుంచి ప్రైవేటు సంస్థ ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఐబీసీ) తొలిసారి రేడియో ప్రసారాలు ప్రారంభించింది. ఆ తర్వాత నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1938 జూన్ 8న ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. స్వాతంత్య్రానంతరం ఆ సంస్థే ఆలిండియా రేడియోగా మారింది.

డ్రాగన్ బ్లడ్ ట్రీ

డ్రాగన్ బ్లడ్ ట్రీగా పిలిచే డ్రాకెనా కాంబోడియానా చెట్టు జాతిని పరిశోధకులు భారతదేశంలో మొదటిసారి గుర్తించారు. అసోంలోని పశ్చిమ కాబ్రి ఆంగ్‌లాంగ్ జిల్లాలో ఈ చెట్టు జాతిని గుర్తించారు. ఈ చెట్టునుంచి కారే ద్రవం రక్తం వర్ణంలో ఉంటుంది. ఈ ద్రవాన్ని ప్రాచీనకాలం నుంచి అనేక వ్యాధులకు ఔషధంగానే కాకుండా రంగులు వేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు.
Dragon-Blood-Tree

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం


కర్ణాటక 31వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప జూలై 26న ప్రమాణం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవడంలో విఫలం కావడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్పతో కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటకకు యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి.

చంద్రశేఖర్ బయోగ్రఫీ

భారత 8వ ప్రధాని చంద్రశేఖర్ రాజకీయ జీవితాన్ని అక్షరబద్ధం చేస్తూ రాసిన చంద్రశేఖర్- ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ జూలై 25న పార్లమెంటు లైబ్రరీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్ హరివంశ్, రవిదత్ బాజ్‌పాయ్ సంయుక్తంగా రాశారు. భారత ప్రధానిగా చంద్రశేఖర్ 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 వరకు పనిచేశారు. 1983లో ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వరకు 4260 కిలోమీటర్ల దూరం ఆరు నెలలపాటు పాదయాత్ర నిర్వహించారు.

యుకెరి

ఇంగ్లండ్ విద్యార్థులు భారత్‌లో విద్యనభ్యసించి పరిశోధనలు చేసేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్దేశించిన యూకే - ఇండియా ఎడ్యుకేషన్ రిసెర్చ్ ఇనిషియేటివ్ పథకాన్ని జూలై 23న భారత్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రిటన్ యూనివర్సిటీల్లో కూడా భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 200 రకాల విద్యావకాశాలను కల్పిస్తారు.

జోర్డాన్‌లో అండర్ వాటర్ మ్యూజియం

పర్షియన్ గల్ఫ్ దేశం జోర్డాన్ మొదటిసారి అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియాన్ని జూలై 25న ప్రారంభించింది. అఖాబా తీరంలో ఎర్రసముద్రం అంచున ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యుద్ధట్యాంకులు, సైనికులను తరలించే వాహనాలు, జోర్డాన్ వైమానికదళానికి చెందిన ఏహెచ్-1 హెలికాఫ్టర్ తదితర 19 వాహనాలను నీటిలోపల ఉంచారు. నీటిలో 92 అడుగుల లోతులో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంవల్ల ఆ దేశంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Jordan

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

ప్రముఖ కవి, విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ జూలై 25న హైదరాబాద్‌లో మరణించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో 1944లో ఆయన జన్మించారు. శ్రీకాంతశర్మ తండ్రి ప్రఖ్యాత కవి ఇంద్రగంటి హనుమశ్శాస్త్రి. శ్రీకాంతశర్మ వచనం, కవిత్వం, పద్యం, లలిత గీతాలు, యక్షగానం, నాటిక, నాటకం, విమర్శ ఇలా సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో సిద్ధహస్తుడిగా పేరుపొందారు.

జైపాల్‌రెడ్డి మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి జూలై 28న హైదరాబాద్‌లో మరణించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం నెర్మెట్ట గ్రామంలో 1942 జనవరి 19న జైపాల్‌రెడ్డి జన్మించారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1969, 72, 78, 83 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984, 98లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచారు. 1997లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. 2004, 09లో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ గౌరవం పొందిన మొదటి వ్యక్తి.

బీఎస్‌ఎఫ్ డీజీగా వీకే జోహ్రీ

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్‌ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్‌గా భారత గూఢచార సంస్థ రా సీనియర్ అధికారి వీకే జోహ్రీ నియమితులయ్యారు. ప్రస్తుత బీఎస్‌ఎఫ్ డీజీ రజినికాంత్ మిశ్రా ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జోహ్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ముఖేష్ గౌడ్ మృతి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ జూలై 29న మృతిచెందారు. 1959, జూలై 1న జన్మించిన ముఖేష్ గౌడ్ 1989, 2004లో మహరాజ్‌గంజ్, 2009లో గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

క్రికెట్‌కు మలింగ వీడ్కోలు

శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లసిత్ మలింగ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు జూలై 26న వీడ్కోలు పలికాడు. సొంత దేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు ద్వారా వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. 226 వన్డేలు ఆడిన మలింగ 338 వికెట్లు పడగొట్టాడు.

టెస్టులకు ఆమిర్ గుడ్‌బై

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ టెస్టు క్రికెట్‌కు జూలై 26న వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు ఆడిన ఆమిర్ 119 వికెట్లు పడగొట్టాడు.

భారత బాక్సర్లకు స్వర్ణాలు

ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంటులో భారత బాక్సర్లు 9 పతకాలు సాధించారు. ఇండోనేషియాలోని లాబువాన్ బాజోలో నిర్వహించిన ఈ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున బారో (54 కిలోలు), మోనిక (48 కిలోలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కిలోలు) స్వర్ణాలు సాధించారు. పురుషుల విభాగంలో అంకుశ్‌దహియా (64 కిలోలు), అనంత ప్రహ్లాద్ (52 కిలోలు), నీరజ్ స్వామి (49 కిలోలు) స్వర్ణ పతకాలు సాధించారు. గౌరవ్ బిధురి (56 కిలోలు), దినేష్ డాగర్ (69 కిలోలు) రజతాలు సాధించారు.
Boxers

మోహన్‌బగాన్ అవార్డులు

లెజెండరీ ఆటగాళ్లకు ప్రదానం చేసే మోహన్‌బగాన్ అవార్డులను 2019కు గాను ఇద్దరికి లభించాయి. రెండుసార్లు ఒలింపిక్స్ బంగారు పతకాలు గెలిచిన భారత హాకీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న కేశవ్‌దత్ (93), భారత ఫుట్‌బాల్‌లో గొప్ప మిడ్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన ప్రసూన్ బెనర్జీ (64)లకు ఈ అవార్డులు దక్కాయి. మోహన్‌బగాన్ దినోత్సవం (జూలై 29) రోజున వీరికి అవార్డులు ప్రదానం చేశారు. 1948, 52 ఒలింపిక్స్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలిచిన హాకీ జట్టులో కేశవ్‌దత్ సభ్యుడు. 1974, 78, 82 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత ఫుట్‌బాల్ జట్టులో ప్రసూన్ బెనర్జీ సభ్యుడు. వీరితోపాటు 2018-19 ఏడాదిలో వివిధ క్రీడల్లో ఉత్తమ ఆటగాళ్లుగా అరిజిత్ బగుయి (ఫుట్‌బాల్), అశోక్ బెనర్జీ (ఫుట్‌బాల్) మహ్మద్ షమీ (క్రికెట్) అవార్డులకు ఎంపికయ్యారు. 1911లో ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో జూలై 29న బ్రిటిష్ క్లబ్ ఈస్ట్ యార్క్‌షైర్‌ను ఓడించి భారతీయ క్లబ్ మారినర్స్ మొదటిసారి విజేతగా నిలిచినందుకు గుర్తుగా జూలై 29న మోహన్‌బగాన్ డే నిర్వహిస్తారు.

499
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles