కేంద్ర బడ్జెట్‌ 2019-20


Wed,July 10, 2019 02:23 AM

Indian-Railway
-ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు వరుసగా ఐదేండ్లలో ఇది ఏడో బడ్జెట్‌. స్వతంత్ర భారతదేశంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. వరుసక్రమంలో 28వ ఆర్థికమంత్రి. కాగా 1970-71 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారు. నాడు ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ రాజీనామాతో ఇందిరాగాంధీ ఆర్థికమంత్రిగా ఏడాదికాలం ఆ పదవిని నిర్వహించారు. నిర్మలా సీతారామన్‌ జూలై 5న రూ.27,86,349 కోట్లతో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
-ఈ బడ్జెట్‌ గతేడాది బడ్జెట్‌ కంటే రూ. 3 లక్షల 44 వేల కోట్లు అధికం. నిర్మలా సీతారామన్‌ తమిళనాడు నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో వ్యక్తి. తాజా బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2 గంటల 17 నిమిషాలు బడ్జెట్‌ ప్రసంగం కొనసాగించింది.
-2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్లు ఉండేదని ఐదేండ్లలో దాన్ని 2.7 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో 5 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు. ఈ ఆర్థిక ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2014కు ముందు ప్రపంచంలో 11వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 6వ స్థానానికి చేర్చామని, భవిష్యత్తులో అమెరికా, చైనా తర్వాత ఇండియాదేనని చెప్పారు.
budget12
-భారత రాజ్యాంగంలోని 112 ప్రకరణ ప్రకారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. దీన్ని వార్షిక నివేదిక లేదా వార్షిక ఆదాయ, వ్యయ పత్రం అంటారు. బడ్జెట్‌ అంటే ప్రతి ఒకరిలో కొంత ఆసక్తి ఉంటుంది. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ఇలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. బ్రిటిష్‌ పాలనాకాలంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆర్థిక సభ్యుడిగా ఉన్న జేమ్స్‌ విల్సన్‌ బడ్జెట్‌ను మనదేశంలో తొలిసారిగా 1860, ఫిబ్రవరి 18న ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత బడ్జెట్‌ను తొలిసారిగా ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి 1947, నవంబర్‌ 26న ప్రవేశపెడితే.. భారత్‌ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత జాన్‌ మథాయ్‌ 1950, ఫిబ్రవరి 28 ప్రవేశపెట్టారు. దేశంలో ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా జీఎస్టీ పట్టాలు ఎక్కిన దరిమిలా అమల్లోకి వస్తున్న రెండో బడ్జెట్‌.

ప్రధానాంశాలు

-మహిళలు ఆర్థిక స్వావలంబన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ‘Naari Tu Narayani’ పథకం.
-పెట్రోల్‌, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం, రోడ్‌ సెస్‌ ప్రతి లీటర్‌కు రూపాయి పెంపు.
-ఆదాయపు పన్ను రిటర్న్‌ చేయడానికి పాన్‌ కార్డు స్థానంలో ఆధార్‌కార్డును ఉపయోగించుకోడానికి వెసులుబాటు.
-బంగారం, ఇతర లోహాలపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంపు.
-స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు.
-స్వయం సహాయక బృందాల్లోని ఒక మహిళకు ముద్ర పథకం కింద రూ.లక్ష వరకు రుణం.
-మిగతా మహిళలకు రూ.5 వేల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌.
-చిన్న దుకాణాల వద్ద డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌)ను ఎత్తివేయనున్న ఆర్బీఐ, బ్యాంకులు.
-అందుబాటు ధరల ఇండ్ల రుణాలపై రూ.1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపు.
-పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మధ్యలో ఉంటే పన్ను రేటు 3 శాతం, రూ.5 కోట్లు దాటితే 7 శాతం.
-ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పుపై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు పన్ను తగ్గింపు.
-2019, అక్టోబర్‌ 2 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన నిషేధం.
-ఏడాదికి రూ. కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 2 శాతం పన్ను.
-రూ.400 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన కంపెనీలకు పన్ను 25 శాతం.
-వడ్డీపై పన్ను మినహాయింపుతో గృహ నిర్మాణ రంగానికి ఊతం.
-ఇక ఆధార్‌తోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు.
-ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ.3.01 కోట్లు.
-ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్లు సహాయం.
-స్త్రీ సంక్షేమ శాఖకు రూ.29 వేల కోట్లు.
-త్వరలో కొత్త అద్దె ఇండ్ల చట్టం.
-2024 నాటికి నల్లా నీరు.
-ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లక్షా ఐదువేల కోట్ల రూపాలయలు ఉపసంహరణ.
-విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం.
-ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు 114 రోజుల్లోనే ఇండ్లను నిర్మించడం.
-ఉడాన్‌ పథకం కింద చిన్న పట్టణాలకు విమానయానం.
-సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణ సదుపాయం.
-స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ చానల్‌.
-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి: రైతులకు సాయం చేయడానికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 2 హెక్టార్లలోపు ఉన్న రైతులకు రూ.6 వేలు ఇస్తానని ప్రకటించారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక రెండు హెక్టార్ల నిబంధనను తొలగించి అందరికి సాయమందించాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 12.50 కోట్ల నుంచి 14.50 కోట్లకు పెరిగింది. ఈ రూ.6 వేల సాయం మూడు విడుతల్లో అందజేస్తారు.
budget9
-విద్యుత్‌ రంగం: ఒకే దేశం, ఒకే గ్రిడ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్‌ రంగానికి ప్రభుత్వం త్వరలో ఒక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించనున్నది. దేశంలో ప్రస్తుత విద్యుత్‌ పరిస్థితిని సమీక్షించుకుని, భవిష్యత్తులో సంక్షోభం లేకుండా చేసేందుకు, విద్యుత్‌ రంగ సమస్యలను తీర్చేందుకు ఒన్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు వెళ్లనున్నారు. భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఉజ్వల, సౌభాగ్య పథకాల కింద 2022 నాటికి గ్రామాల్లో కోరుకున్న ప్రతి ఇంటికి వంటగ్యాస్‌, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.
-వ్యవసాయరంగం: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్‌ తమ ప్రభుత్వం ‘గావ్‌, గరీబ్‌ ఔర్‌ కిసాన్‌' నినాదంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు.
-ఈ బ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి రూ.1.39 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గత బడ్జెట్‌లో రూ.63,836 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతుల ఆదాయ వృద్ధికి, వారిలో వ్యాపార సామర్థ్యాల పెంపు, వ్యవసాయంలో మౌలిక వసతులకు ప్రాధాన్యమిచ్చారు. ఆహార శుద్ధి పరిశ్రమలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనున్నారు.
-రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దేశవ్యాప్తంగా జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి సంబంధించిన వినూత్న పైలెట్‌ ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతుంది.
-విద్యారంగం: 2019-20 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.95,000 కోట్లు కేటాయించారు. గత విద్యా సంవత్సరం కంటే 13 శాతం నిధులను అదనంగా కేటాయించారు. పాఠశాల విద్య కోసం రూ.56,536.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ.38,317 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య కేటాయింపులు 6.2 శాతం, ఉన్నత విద్యకు 0.4 శాతం పెరిగాయి. పరిశోధనలు ప్రోత్సహించడం, విదేశీ విద్యార్థులను మనదేశంలో చదువుకునే స్థాయిలో ‘ప్రపంచ శ్రేణి’ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం, క్రీడా సంస్కృతిని పెంపొందించేలా ‘ఖేలో ఇండియా’ పథకాలను ఆర్థికమంత్రి ముఖ్యంగా ప్రస్తావించారు. విద్యారంగంలో ప్రపంచ శ్రేణి సంస్థలను ఏర్పాటు చేసేందుకు రూ.400 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 3 రెట్లు అధికం. మోదీ సర్కార్‌ వచ్చాకే ప్రపంచంలోని 200 అత్యుత్తమ సంస్థల జాబితాలో మనదేశానికి చెందిన 3 సంస్థలకు చోటు దక్కింది. ఇందులో రెండు ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్సీ ఉన్నాయి.
budget10

రైల్వేలు

-రైల్వే సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ప్రసంగంలో ప్రతిపాదించారు. ప్రైవేట్‌ సాయానికి సిగ్నల్‌ ఇచ్చారు. ఈసారి రూ.20 వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వేల మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 ఏండ్ల మధ్య రూ.50 లక్షల పెట్టుబడులు అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.
-ఈ రైల్వే బడ్జెట్‌లో రైల్వేల కోసం రూ.65,837 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.55,088 కోట్లుగా ఉంది. అలాగే మూలధన వ్యయం కింద రూ.1.6 లక్షల కోట్లను కేటాయించారు. గతేడాది మూలధన వ్యయ కేటాయింపులు రూ.1.48 కోట్లు.
budget11
-2021-22 వరకు మొత్తం బ్రాడ్‌గేజ్‌ వ్యవస్థ విద్యుదీకరణ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒక్క ఏడాదే 7 వేల కి.మీ. పూర్తిచేస్తారు.
-కాపలాదార్లు లేని లెవల్‌ క్రాసింగ్‌లు తొలగింపు బ్రాడ్‌గేజ్‌ మార్పిడి పనులు 2018-19లో లక్ష్యం మేరకు పూర్తిచేశారు.
-ఆదాయపు పన్ను శ్లాబులు (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు)
CAR

పెరిగేవి

-బంగారం, వెండి, ఏసీలు, స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్లు, సీసీ కెమెరాలు, స్పీకర్లు, డిజిటల్‌ వీడియో రికార్డర్లు
-ఆటోమొబైల్‌ వినియోగించే సీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు
-కార్ల అద్దాలు, రియర్‌ వ్యూ గ్లాస్‌లు
-మోటార్‌బైక్‌లకు వేసే తాళాలు, ఆయిల్‌ ఎయిర్‌ ఫిల్టర్లు, బైక్‌ హార్న్‌లు, లైటింగ్‌ సిస్టం, కార్ల విండో స్క్రీన్‌ వైపర్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్త నిధి పన్ను, జీడి పిక్కలు, సబ్బులు, ప్లాస్టిక్‌ ఫ్లోర్లు, కవర్లు, టైర్లు, న్యూస్‌ ప్రింట్‌, మ్యాగజీన్లు, దిగుమతి చేసుకునే వస్తువులు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు, సిరామిక్‌ టైల్స్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అలాయ్‌ స్టీల్‌ వైర్‌, మెటల్‌, ఫర్నిచర్‌, పీవీసీ పైపులు.
-దిగుమతులు చేసుకునేవాటిలో పెరిగేవి: విదేశీ కార్లు, స్టీల్‌ ఉత్పత్తులు, ప్లాస్టిక్‌, వాహన పరికరాలు, పుస్తకాలు.

తగ్గేవి

-గృహ రుణాలు, రక్షణ సామగ్రి, నాప్తా, సెల్‌ఫోన్‌ చార్జర్లు, సెటప్‌ బాక్సులు, మొబైల్‌ ఫోన్‌లో వినియోగించే లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌లు.

భారతదేశ అప్పులు


Nirmala-Sitharaman1
-దేశీయంగా, విదేశాల్లో కలిపి భారత ప్రభుత్వం అప్పు పెరిగింది. 2019-20 నాటికి దేశ అప్పు రూ. 98,67,921.44 కోట్లుగా అంచనా వేశారు. 2018-19 చివరికి సవరించిన అంచనాల ప్రకారం అప్పు రూ. 90,56,725048 కోట్లుగా ఉంది.
కొత్త పథకాలుప్రధానమంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన
-సన్న, చిన్నకారు రైతులకు 60 ఏండ్లు దాటినవారికి పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆయా రైతులకు ప్రతినెల రూ. 3 వేలు అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం కోసం 18 నుంచి 40 మధ్య ఏండ్లున్న సన్న, చిన్నకారు రైతులు తమ వాటాగా నిర్ణీత సొమ్మును చెల్లించాలి. తెలంగాణలో సుమారు 20 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.

ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్‌


budget6
-రిటెల్‌ ట్రేడర్లు, షాప్‌ కీపర్స్‌కు బీమా కల్పించడానికి ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ పేరుతో పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కోటిన్నర లోపు లావాదేవీలు జరిపే రిటెల్‌ ట్రేడర్లు షాప్‌ కీపర్లకు ఈ పథకం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది దీనివల్ల లబ్ది పొందుతారు.

హర్‌ ఘర్‌ జల్‌ పథకం


budget7
-దేశంలో సురక్షిత తాగునీరు అందని గ్రామాలకు 2024 నాటికి మంచినీరు అందించేందుకు వీలుగా కొత్తగా హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 28,261.59 కోట్లు కేటాయించారు.

జలశక్తి అభియాన్‌


-ఇండ్లళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు ఉపయోగపడే విధంగా 256 జిల్లాల్లో అమలు చేయనున్నారు.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన


-మత్య్స పరిశ్రమ ఆధునీకరణ, సముద్రంలో అన్వేషణ, ఉత్పత్తి, వేట, నిల్వ పద్ధతులు, నాణ్యత పరిరక్షణ చేపల ఉత్పత్తులకు అదనపు విలువల జోడింపు తదితరాలకు నూతన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 3737 కోట్లు కేటాయించారు.

ఆర్థిక మంత్రుల ప్రత్యేకతలు


-ఇప్పటి వరకు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన 26 మంది ఆర్థిక మంత్రుల్లో తొమ్మిది మందికి మాత్రమే అర్థశాస్త్ర, వాణిజ్య శాస్త్రంలో డిగ్రీలు, 11 మందికి న్యాయశాస్త్ర డిగ్రీలు ఉన్నాయి.
-ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు- జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ
-ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రధానమంత్రులు అయినవారు- చరణ్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌, వీపీ సింగ్‌, మన్మోహన్‌సింగ్‌
-ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రాష్ట్రపతులు అయినవారు- ఆర్‌ వెంకట్రామన్‌, ప్రణబ్‌ ముఖర్జీ
-బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి- ఇందిరాగాంధీ
-పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థికమంత్రి- నిర్మలా సీతారామన్‌
-రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసి ఆర్థికమంత్రి అయినవారు సీడీ దేశ్‌ముఖ్‌, మన్మోహన్‌ సింగ్‌
-1991లో మన్మోహన్‌సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతుల పరంగా అతిపెద్దది. ఆ బడ్జెట్‌లో 18,520 పదాలు ఉన్నాయి.
-1952లో సీడీ దేశ్‌ముఖ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతుల పరంగా అతిచిన్నది. ఆ బడ్జెట్‌లో కేవలం 4,454 పదాలు ఉన్నాయి.
-బడ్జెట్‌ను ఎక్కువసార్లు ప్రవేశపెట్టినవారు- మొరార్జీ దేశాయి (10 సార్లు), చిదంబరం (9), ప్రణబ్‌ ముఖర్జీ (8)
-సుదీర్గంగా బడ్జెట్‌ ప్రసంగం చేసినవారు- మధు దండావతే (133 నిమి.)
-అత్యధికంగా తమిళనాడు నుంచి ఆరుగురు ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. వారు.. షణ్ముఖం శెట్టి, టీటీ కృష్ణమాచారి, సుబ్రమణ్యం, ఆర్‌ వెంకట్రామన్‌, చిదంబరం, నిర్మలా సీతారామన్‌షణ్ముగం శెట్టి
-స్వాతంత్య్రానంతరం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. ప్రణాళిక సంఘం ఏర్పాటు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

జాన్‌ మథాయ్‌


-1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి. పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి.

సీడీ దేశ్‌ముఖ్‌


-దేశంలో తొలిసారిగా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

టీటీ కృష్ణమాచారి


-సంపద పన్నును ప్రవేశపెట్టడం, స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడించే పథకం ప్రారంభం. దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ ఏర్పాటు.

జవహర్‌లాల్‌ నెహ్రూ


-బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని (1958), గిఫ్ట్‌ ట్యాక్స్‌ ప్రతిపాదన.

మొరార్జీ దేశాయ్‌


-ప్రజా కోణంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి. వ్యవసాయరంగంలో పరిశోధనలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను నెలకొల్పి హరిత విప్లవాన్ని ప్రారంభించాడు.
-బంగారంపై నియంత్రణ కోసం గోల్డ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చాడు. తన పుట్టిన రోజన (ఫిబ్రవరి 29) 1964, 1968లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు. వస్తుత్పత్తి విధానానికి స్వస్తిపలికి స్వీయ మదింపు పద్ధతికి రూపకల్పన చేశాడు.

ఇందిరాగాంధీ


-బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. పాల దిగుబడిని పెంచడానికి శ్వేత విప్లవాన్ని ప్రవేశపెట్టారు.
budget8

వైబీ చవాన్‌


-బీమా, బొగ్గు కంపెనీలను జాతీయం చేయడానికి రూ. 56 కోట్లు కేటాయించారు. రూ. 550 కోట్లు లోటు ఏర్పడటంతో ఈ బడ్జెట్‌ను బ్లాక్‌ బడ్జెట్‌ అంటారు.

సీ సుబ్రమణ్యం


-ఈఎస్‌ఐ, ఈపీఎస్‌ కుటుంబ పథకాలను ప్రారంభించాడు.

హెచ్‌ఎం పటేల్‌


-ఆర్థిక మంత్రి పదవిని చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి.

చౌదరి చరణ్‌ సింగ్‌


-వినియోగదారుల వస్తువులపై ఎక్సైజ్‌ డ్యూటీని విధించారు.

హెచ్‌ఎస్‌ బహుగుణ


-బడ్జెట్‌ను ప్రవేశపెట్టని ఆర్థికమంత్రి.

ఆర్‌ వెంకట్రామన్‌


-జీవనధార ఔషధాలు, సైకిళ్లు, కుట్టుమిషన్లు, ప్రెషర్‌కుక్కర్లపై ఎక్సైజ్‌ డ్యూటీని రద్దు చేశారు. రేడియోలపై లైసెన్సును రద్దు చేశారు.

ప్రణబ్‌ ముఖర్జీ (1982)


-ఎన్నారైల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు

వీపీ సింగ్‌ (1984)


-కొన్ని వరాలు, కొన్ని భారలతో రూపొందించిన క్యారెక్టరిస్టిక్‌ బడ్జెట్‌. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు, మోడ్‌, వ్యాట్‌ పన్నుల అమలు, పన్ను ఎగవేతదారులపై కఠికంగా వ్యవహరించేలా ఈడీకి అధికారాల పెంపు.

రాజీవ్‌ గాంధీ (1987)


-దీన్ని గాంధీ బడ్జెట్‌ అంటారు. కనీస వాణిజ్య పన్ను (వ్యాట్‌), కార్పొరేషన్‌ ట్యాక్స్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది.

నవ భారత నిర్మాణానికి ప్రభుత్వం నిర్ధేశించిన పది సూత్రాలు


1. మౌళిక సదుపాయాలను పెంపొందించడం
2. ఆర్థిక రంగంలో ప్రతి రంగాన్ని డిజిటల్‌ ఇండియా కిందకు తీసుకురావడం
3. దేశాన్ని కాలుష్య రహిత భారతంగా తీర్చిదిద్దడం, విద్యుత్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం
4. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఆటో మొబైల్స్‌, వైద్య పరికరాల తయారీలో మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వడం
5. నదుల శుద్ధి, సమర్ధవంతంగా నీటి వినియోగం, ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించడం
6. ఆర్థిక వృద్ధికి సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, సాగరమాలను విస్తృతపరచడం
7. ఉపగ్రహాలు, గగన్‌యాన్‌, చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో రోదసీలోకి దూసుకెళ్లడం
8. సేంద్రీయ పద్ధతిలో ఆహార పదార్థాలు పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల వంటివి మనకు సరిపడేంతగా ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తి చేయడం
9. ఆయుష్మాన్‌ భారత్‌వంటి పథకాలతో ఆరోగ్య భారత్‌ను నిర్మించడం, అందరికి ఆరోగ్య భారత్‌ను కల్పించడం
10. టీమిండియా విత్‌ జన్‌ భాగదారి కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలనా దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడం
-తొలి బడ్జెట్‌ను స్వాతంత్య్రానంతరం షణ్ముఖం శెట్టి రూ. 197 కోట్ల అంచనా వ్యయంతో 1947, నవంబర్‌ 26న ప్రవేశపెట్టారు.
-అంచనా ఆదాయం రూ. 171 కోట్లు.
-అంచనా వ్యయం రూ. 197 కోట్లు.
-తంతి తపాల ద్వారా ఆదాయం రూ. 15.9 కోట్లు
-రక్షణ కోసం కేటాయించింది రూ. 92.74 కోట్లు
-దేశ విభజన, ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలు, కాందిశీకుల లాంటి సమస్యలతో సతమతమౌతున్న సమయంలో ఈ బడ్జెట్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి పెంచడం, దేశరక్షణను పటిష్టపరచడం, పౌర సదుపాయాల కల్పనపై దృష్టిసారించారు.

kovind-nirmala

ఎన్‌బీ చవాన్‌ (1988)


-జవహర్‌ రోజ్‌గార్‌ యోజనను ప్రవేశపెట్టారు.

మధు దండావతే


-సెబీ ఏర్పాటు, బడ్జెట్‌పై అత్యధిక సమయం మాట్లాడిన ఆర్థికమంత్రి

మన్మోహన్‌సింగ్‌


-లైసెన్స్‌ రాజ్‌కు చరమగీతం పాడారు. లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ లాంటి నూతన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఎగుమతి, దిగుమతి విధానాల్లో భారీ మార్పు, కస్టమ్స్‌ సుంకాలను 220-150 శాతానికి తగ్గించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారు.

చిదంబరం


-డ్రీమ్‌ బడ్జెట్‌, తొలి సారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నల్లధనం వెలికితీతకు ఆస్తులు స్వీయ ప్రకటన పథకం ప్రవేశపెట్టారు. ఐటీ రేటును తగ్గించడం వల్ల పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగి ఆదాయం పెరిగింది.

యశ్వంత్‌ సిన్హా


-ఫిబ్రవరి 29న సహస్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2000 ఏడాది వరకు సాయంత్రం పూట బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ఎత్తివేశారు. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రతిపాదించారు.

జశ్వంత్‌ సింగ్‌


-అతి తక్కువకాలం (13 రోజులు) ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఎలక్ట్రిక్‌ విధానంలో ఆదాయ పన్ను వివరాలను నమోదు చేసే విధానాన్ని ప్రారంభించారు.

అరుణ్‌ జైట్లీ


-సాంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం ప్రస్తావన లేకపోవడం, బడ్జెట్‌ను హిందీలో ప్రసంగించడం, 92 ఏండ్ల తర్వాత రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌ కలిపి ప్రవేశపెట్టడం వంటివాటితోపాటు డిజిటల్‌ విధానాన్ని (2017-18) ప్రోత్సహించారు. గతంలో బ్రిటిష్‌ ఆర్థికవేత్త విలియం అక్‌వర్త్‌ సారథ్యంలోని కమిటీ సిఫారసుతో రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెట్టారు.

నిర్మాలా సీతారామన్‌


-బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రి.

దేశంలో నాలుగు దిక్కుల్లో ఉన్న రైల్వే స్టేషన్లు

ఉత్తరం - బారాముల్లా (కశ్మీర్‌)దక్షిణం - కన్యాకుమారి (తమిళనాడు)తూర్పు - లెడో (అసోంలోని తీన్‌ సుకాడియా)పడమర - నలియా (గుజరాత్‌లోని భుజ్‌ సమీపంలో)
-రైల్వేశాఖ తొలి మంత్రి - జాన్‌ మథాయ్‌
-రైల్వేశాఖ ప్రస్తుత మంత్రి - పీయూష్‌ గోయెల్‌

రైల్వేల సంక్షిప్త చరిత్ర


AFP
-దేశంలోని రైల్వేలను నాటి బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్‌ డల్‌హౌసీ కాలంలో 1853, ఏప్రిల్‌ 16న ఏర్పాటు చేశారు.
-మొదటి రైలు 1853, ఏప్రిల్‌ 16న 14 బోగీలతో 400 మంది ప్రయాణికులతో బొంబాయి - థానే మధ్య 34 కి.మీ. దూరం 15 నిమిషాలపాటు ప్రయాణించింది.
-హైదరాబాద్‌లో 1873 నాటికే నిజాం స్టేట్‌ రైల్వే వ్యవస్థ కొలువుదీరి ఉంది.
-మొదటి రైల్వేలైన్‌ 1874 జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది.
-1907లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
-భారతీయ రైల్వేల నినాదం ‘జాతి జీవనరేఖ’.
-1951లో భారత ప్రభుత్వం రైల్వేలను జాతీయం చేసింది.
-భారతీయ రైల్వేలు 150 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002, ఏప్రిల్‌ 16న ‘బోలు ది గార్డ్‌'ను విడుదల చేశారు.
-ప్రపంచంలో పొడవైన రైల్వే స్టేషన్‌ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1.8 కి.మీ. ఉన్నది.
-ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,128 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. అతిపెద్ద రైల్వేజోన్‌ ఉత్తర రైల్వేజోన్‌ (6,968 కి.మీ.), అతిచిన్న రైల్వేజోన్‌ తూర్పు రైల్వేజోన్‌ (2,414 కి.మీ.)
-దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతిరోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి.
-దేశంలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రుగఢ్‌ వరకు 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణిస్తుంది.
-దేశంలో అత్యల్ప దూరం (3 కి.మీ.) ప్రయాణించే రైలు నాగపూర్‌-అజ్నీ ప్యాసింజర్‌ రైలు.
-దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణం చేసే రైలు గతిమాన్‌. ఇది గంటకు 160 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య నడుస్తుంది.
-దేశంలో అత్యల్ప వేగంతో ప్రయాణించే రైలు నీలగిరి. ఇది గంటకు 10 కి.మీ. వేగంతో మొట్టుపాలెం-ఊటి మధ్య నడుస్తుంది.

2019-20 బడ్జెట్‌ రూపకల్పనలో కీలక వ్యక్తులు


-కె. సుబ్రమణియన్‌ - చీఫ్‌ ఎకానమిక్‌ అడ్వైజర్‌
-సుభాష్‌చంద్ర గార్గ్‌ - ఫైనాన్స్‌ సెక్రటరీ
-అజయ్‌భూషణ్‌ పాండే - రెవెన్యూ సెక్రటరీ
-ఎ. చక్రవర్తి - సెక్రటరీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌
-జీసీ ముర్ము - సెక్రటరీ, వ్యయాల శాఖ
-రాజీవ్‌ కుమార్‌ - సెక్రటరీ, ఆర్థికసేవల శాఖ
budget3

తెలంగాణకు కేటాయింపులు


-రాష్ర్టానికి పన్నుల వాటా రూ.19.718 కోట్లు
-ఐఐటీ హైదరాబాద్‌కు రూ.80 కోట్లు
-తెలంగాణ, ఏపీ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు
-హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌కు రూ.319.39 కోట్లు
-సాలార్‌జంగ్‌ మ్యూజియంకు రూ.27.99 కోట్లు
-సింగరేణి కాలరీస్‌ సంస్థకు రూ.1850 కోట్లు
-స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు, ఇతర ప్రయోజనాల కోసం రూ.952.81 కోట్లు కేటాయింపు
-ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌-హైదరాబాద్‌కు రూ.28 కోట్లు
-ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ & సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్‌-హైదరాబాద్‌కు రూ.53.93 కోట్లు
-నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు-హైదరాబాద్‌కు రూ.80.75 కోట్లు
-హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టు రెండో దశకు రూ.120 కోట్లు
-గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.4 కోట్లు
-హల్వా: మన సంప్రదాయం ప్రకారం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు నోరు తీపి చేసుకుంటాం. బడ్జెట్‌ తయారీకి ముందు ఆర్థిక శాఖలోని సిబ్బందికి ఆనవాయితీ ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 22న ఢిల్లీలోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం నార్త్‌ బ్లాక్‌లో హల్వా వేడుక నిర్వహించారు. మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా హల్వా వండి ఆర్థికశాఖ సిబ్బందికి పంచారు. సుమారుగా 100 మందికిపైగా ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ ముద్రణాలయంలో బడ్జెట్‌ తయారీలో నిమగ్నమై ఉంటారు. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టేవరకు వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Nirmala-Sitharaman

నిర్మలా సీతారామన్‌ ప్రస్థానం

-నిర్మలా సీతారామన్‌ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో సావిత్రి, నారాయణ దంపతులకు జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో మద్రాస్‌ తిరుచిరాపల్లిలో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసినది. తిరుచురాపల్లిలోని సీతారామాస్వామి కళాశాల నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, ఢిల్లీలోని జేఎన్టీయులో ఎంఏ ఎకనామిక్స్‌, ఎంఫిల్‌ పట్టాపొందారు. 1986లో తెలుగు వాడైన పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. వివాహనంతరం లండన్‌లోని రెజెంట్‌స్ట్రీట్‌లో ఒక గృహోపకరణాల షాప్‌లో సేల్స్‌ గర్ల్స్‌గా పనిచేసింది. అనంతరం అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ & ఎకనమిస్ట్‌ అసిస్టెంట్‌గా సేవలు అందించారు. బీబీసీ చానల్‌లో పనిచేశారు. 2008లో బీజేపీలో చేరి 2010లో అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని మోడీ మంత్రివర్గంలో వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ (స్వతంత్రహోదా) మంత్రిగా పనిచేశారు. 2017లో రక్షణ శాఖ మంత్రిగా, బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

బడ్జెట్‌ పదజాలం

-రాబోయే ఆదాయ, వ్యయాల వివరాలను తెలిపే ద్రవ్య సంబంధ నివేదికను బడ్జెట్‌ అంటారు. పన్ను విధింపు పరిధి, ప్రభుత్వ వ్యయ పరిమాణం, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు ఇవ్వబడిన ప్రాముఖ్యతలు, వనరుల కేటాయింపులు, అర్థికవ్యవస్థ స్థితి, కోశ విధానం ద్వారా ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది.
-లోటు బడ్జెట్‌- ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా చూపే ఆర్థిక నివేదికను లోటు బడ్జెట్‌ అంటారు.
-మిగులు బడ్జెట్‌- ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు తక్కువగా చూపే ఆర్థిక నివేదికను మిగులు బడ్జెట్‌ అంటారు.
-సంతులిత బడ్జెట్‌- ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉండే ఆర్థిక నివేదికను సంతులిత బడ్జెట్‌ అంటారు.
-ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌- బడ్జెట్‌లోని వివిధ పద్దులను పరిశీలించి ఆమోదించడానికి కొంత వ్యవధి అవసరం. కాబట్టి ప్రభుత్వం గ్రాంట్లను ముందుగా పొందే అవకాశాన్ని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అంటారు.
budget4
-శూన్యబడ్జెట్‌- గత సంవత్సర బడ్జెట్‌ అంశాలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొత్తగా ఆ సంవత్సరం అంచనాల ప్రకారం తయారు చేసే బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను మొదట ప్రతిపాదించినది అమెరికాలోని ఓ సంస్థలో పీటర్‌ పైర్‌ ప్రారంభించాడు. మన దేశంలో 1986-87లో ప్రవేశపెట్టినా అది కొనసాగలేదు.
-ప్రభుత్వ రాబడి- పౌరుల ఖర్చుకోసం, పరిపాలన కోసం, పౌరుల నుంచి గ్రహించిన మొత్తాన్ని ప్రభుత్వ రాబడి అంటారు.
-ప్రభుత్వ వ్యయం- దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, పౌర శ్రేయస్సును రక్షించడం కోసం, అభివృద్ధి చేయడానికి పెట్టిన ఖర్చులను ప్రభుత్వ వ్యయం అంటారు.
-మూలధన వ్యయం- నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల వంటి వాటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు.
-ద్రవ్యలోటు- ప్రభుత్వ ఖర్చులకు రుణేతర రెవెన్యూ మార్గాల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు.
-రెవెన్యూలోటు- రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు.
-కోశలోటు- బడ్జెట్‌ లోటుకు మార్కెట్‌ రుణాలు కలిపితే కోశలోటు వస్తుంది.
-ప్రాథమిక లోటు- కోశలోటు, వడ్డీ చెల్లింపులకు మధ్య ఉన్న తేడానే ప్రాథమిక లోటు అంటారు.
budget5

బడ్జెట్‌ బ్రీప్‌ కేసు

-ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎప్పటి నుంచో వస్తున్న (బ్రిటిష్‌ కాలం నాటి) సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఎర్రటి పట్టువస్త్రంలో చుట్టిన బడ్జెట్‌ పత్రాలతో లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ విధానం భారత సంప్రదాయ ‘బహీఖాతా’ (లెడ్జర్‌)లో పెట్టుకొని పార్లమెంటులోకి వచ్చారు. దీనిపై మూడు సింహల రాజముద్ర ఉన్నది. గతంలో గోధుమ రంగుతో కూడిన బ్రీప్‌కేసులో బడ్జెట్‌ పత్రాలతో వచ్చేవారు. బడ్జెట్‌ ప్రతులను లెదర్‌ సూట్‌కేసులో తీసుకొచ్చే సంప్రదాయం 1860లో విలియం గ్లాడ్‌స్టోన్‌ ప్రారంభించిన సాంప్రదాయం. అప్పటి నుంచి ఈ లెదర్‌ బ్యాగ్‌ను గ్లాడ్‌ స్టోన్‌ బాక్స్‌ అని పిలిచేవారు.
A.-Krishnaiah

1151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles