కరెంట్ అఫైర్స్


Wed,July 10, 2019 01:07 AM

National
jaipur

జైపూర్‌కు వారసత్వ గుర్తింపు

రాజస్థాన్‌లోని చారిత్రక నగరం జైపూర్‌కు యునెస్కో వారసత్వ నగరంగా గుర్తింపునిచ్చింది. మధ్యయుగాలనాటి రాచరికపు సంస్కృతిని కాపాడుతున్నందుకుగాను ఈ పింక్‌ సిటీకి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఇప్పటివరకు యునెస్కో ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లోని 1092 ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్నాయి.

మోతీలాల్‌ ఓరా

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక జాతీయాధ్యక్షుడిగా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ మోతీలాల్‌ ఓరా జూలై 4న నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన ఓరా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో ఓరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

అతిపొడవైన రైల్వే సొరంగం

దేశంలోనే అతిపొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చెర్లపల్లి నుంచి రాపూరు వరకు 6.6 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ రైల్వే లైనును నిర్మించారు. 113 కిలోమీటర్ల పొడవైన ఓబులవారిపల్లి-వెంకటాచలం-కృష్ణపట్నం పోర్టు నూతన రైల్వే లైన్‌ మార్గంలో ఈ సొరంగాన్ని నిర్మించారు.

సీఐసీపై కమిటీ

కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీస్‌ (సీఐసీ)పై నియంత్రణ, పర్యవేక్షణకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సెంట్రల్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ తపన్‌ రాయ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ సీఐసీలోని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ బలోపేతానికి సూచనలు చేయనుంది.

సీసీఎంబీ

జన్యుపరమైన వ్యాధుల గుర్తింపు, నివారణ కోసం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ సంస్థలు జూలై 3న అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. డీఎన్‌ఏ ఆధారంగా వ్యాధులను తక్కువ ఖర్చుతో గుర్తించేలా ఈ సంస్థలు సాంకేతికతలను అభివృద్ధి చేయనున్నాయి.

ఆధార్‌ సేవా కేంద్రాలు

భారత ప్రజల వ్యక్తిగత గుర్తింపు కార్డు ఆధార్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యూఐడీఏఐ దేశవ్యాప్తంగా 114 ఆధార్‌ సేవా కేంద్రాలను నెలకొల్పనుంది. అందులో భాగంగా మొదటగా ఢిల్లీ, విజయవాడల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. దేశంలోని 53 నగరాల్లో దాదాపు రూ.400 కోట్ల ఖర్చుతో ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పాస్‌పోర్టు కేంద్రాల వలె పనిచేస్తాయి.

వ్యవసాయంపై సీఎంల కమిటీ

దేశంలో వ్యవసాయరంగంలో నూతన మార్పులను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో ముఖ్యమంత్రుల ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలోని ఈ కమిటీ వ్యవసాయరంగంపై విధాన నిర్ణయాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఆహారశుద్ధిరంగంలో వృద్ధికి సూచనలు చేయనుంది. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, నీతీ ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌చంద్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమత్రులు సభ్యులుగా ఉంటారు.

Telangana
CCMB

ఫారిన్‌ పోస్టాఫీస్‌

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఫారిన్‌ పోస్టాఫీసును ప్రారంభించారు. హిమాయత్‌నగర్‌లో ప్రారంభించిన ఈ పోస్టాఫీస్‌ ఆగస్టు 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. విదేశాలకు వెళ్లే పార్సిళ్లను ఇక్కడ తనిఖీలు చేసి నేరుగా పంపనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి పోస్టాఫీసులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో మాత్రమే ఉన్నాయి.

మలేరియాకు కొత్త మందు

మలేరియా వ్యాధికి హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త మందును ఆవిష్కరించారు. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్నజీవులు తమ శక్తిని పెంచుకోకుండా చూస్తూ అంతమొందించే బీవో 2 అపూ ఔషధాన్ని రూపొందించినట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మృణాల్‌కంటి భట్టి తెలిపారు.

INTERNATIONAL
Babylon

నార్త్‌ మిత్రదేశంగా భారత్‌

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) మిత్రదేశ హోదా కల్పించే బిల్లుకు అమెరికా చట్టసభ సెనేట్‌ జూలై 2న ఆమోదం తెలిపింది. ఈ హోదాను ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాలకు ఇచ్చారు. ఈ హోదా ద్వారా నాటో భారత్‌ మధ్య రక్షణ సహకారం మరింత పెరుగుతుంది.

బాబిలోన్‌కు వారసత్వ హోదా

ఇరాక్‌లోని ప్రాచీన మెసపొటోమియా నగరమైన బాబిలోన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చింది. క్రీస్తు పూర్వం 2000 ఏండ్లనాటి బాబిలోన్‌ నాగరికతకు ఈ నగరం రాజధానిగా విలసిల్లింది. దాదాపు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాచీన నగరానికి వారసత్వ హోదా కోసం ఇరాక్‌ ప్రభుత్వం 30 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నది.

Persons
Christine-Lagarde

యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌

అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు 2019 గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డులకు మాస్టర్‌కార్డు సీఈవో అజయ్‌బంగా, విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీలను ఎంపికచేసింది. ఈ నెల 11న వాషింగ్టన్‌లో జరుగనున్న యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ రెండో సమావేశంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

క్రిస్టీనా లగార్డే

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీనా లగార్డే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ బ్యాంకు అధిపతిగా నియమితులైన మొదటి మహిళ లగార్డే.

యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌

యూరోపియన్‌ కమిషన్‌ తదుపరి అధ్యక్షురాలిగా జర్మనీకి చెందిన ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ నియమితులయ్యారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ మంత్రివర్గంలో 2005 నుంచి ఉర్సులా మంత్రిగా కొనసాగుతున్నారు. యూరోపియన్‌ కమిషన్‌ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఉంది.

మనోజ్‌కుమార్‌ నంబియార్‌

మైక్రో ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌గా ఆరోహన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ మనోజ్‌కుమార్‌ నంబియార్‌ వరుసగా ఆరోసారి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 2001 ప్రకారం 2009లో మైక్రో ఫైనాన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశారు.

Sports
FIFA

రోహిత్‌శర్మ రికార్డు

క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మ రికార్డు సృష్టించారు. జూలై 6న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయటం ద్వారా 2019 ప్రపంచకప్‌లో 5 సెంచరీలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఒకే ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ అధిగమించాడు.

34వ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌

నేషనల్‌ ర్యాంకింగ్‌ మల్టీక్లాస్‌ చాంపియన్‌షిప్‌ 2019 సెయిలింగ్‌ పోటీలు జూలై 2న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ పోటీలు దేశంలోనే పురాతరమైన సెయిలింగ్‌ పోటీలు

మహిళా ఫుట్‌బాల్‌

ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను అమెరికా గెలుచుకుంది. జూలై 7న పారిస్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అమెరికా తన ప్రత్యర్థి నెదర్లాండ్స్‌ జట్టును 2-0 గోల్స్‌ తేడాతో ఓడించి చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది.

ఆర్జేన్‌ రాబిన్‌

నెదర్లాండ్స్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఆర్జేన్‌ రాబిన్‌ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌కు జూలై 5న ముగింపు పలికాడు. కెరీర్‌లో 96 మ్యాచ్‌లు ఆడిన రాబిన్‌ 37 గోల్స్‌ చేశాడు.

అంబటి రాయుడు

అంబటి రాయుడు జూలై 3న క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2013లో భారత్‌ తరఫున మొదటి వన్డే ఆడిన రాయుడు మొత్తం 55 వన్డేల్లో 1644 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోకపోవటంతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు రాయుడు ప్రకటించాడు.

హిమా దాస్‌

భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌ పోలెండ్‌లో నిర్వహించిన పోజ్నన్‌ అథ్లెటిక్‌ గ్రాండ్‌ ప్రి పోటీల్లో 200 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం సాధించింది. 23.65 సెకండ్లలో పరుగును పూర్తిచేసి విజేతగా నిలిచింది.

షోయబ్‌ మాలిక్‌

పాకిస్థాన్‌ మిడిలార్డన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 1999లో మొదటి వన్డే ఆడిన షోయబ్‌ 287 మ్యాచ్‌లలో 7,534 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 44 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
Vemula-Saidulu

879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles