Rain Update | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ ఉత్తర జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి డాక్టర్ శ్రావణి తెలిపారు. జూలై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించారు.
గురువారం వరకు లోటువర్షపాతం ఉన్న జిల్లాల్లో కూడా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైనట్టు చెప్పారు. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 9.05 సెం.మీ వర్షపాతం కురిసింది. శనివారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వద్ద బర్రెలు, ఆవులు వాగు దాటుతున్న సమయంలో వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మూడు కిలోమీటర్ల తర్వాత పశువులు సురక్షితంగా బయటపడ్డాయి. కాగజ్‌నగర్‌లో అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కాగజ్‌నగర్, దహెగాం మండలాల మధ్య 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.