HIV Positive | ఉద్ధమ్‌సింగ్ నగర్, జూన్ 26: దొంగ పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పరారై పెండ్లి కొడుకులను మోసం చేసిన నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను గతంలో పెండ్లి చేసుకున్న వారి కోసం వేట ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని యూఎస్ నగర్ జిల్లాకు చెందిన 20 ఏండ్ల మహిళ యూపీ, ఉత్తరాఖండ్‌లలో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది.
మే 6న యూపీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముజఫర్‌నగర్ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయగా, హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఆమె ఆ వ్యాధిని గతంలో ఎంతమందికి వ్యాపింపచేసిందోనని పాత పెండ్లి కొడుకుల కోసం యూపీ పోలీసులు వేట ప్రారంభించారు.
పుణెలో ఇద్దరికి జికా వైరస్
పుణె, జూన్ 26: మహారాష్ట్రలోని పుణెలో 46 ఏండ్ల వైద్యుడు, అతడి కుమార్తెకు జికా వైరస్ సోకింది. అయితే, వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి ఒకరు బుధవారం తెలిపారు. నగరంలో రెండు కేసులు నమోదుకావటంతో, ఆరోగ్య విభాగం సిబ్బంది చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ముఖ్యంగా గర్భిణిల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జూన్ 21న అతడి రక్త నమూనాల్ని పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, జికా వైరస్ పాజిటివ్ అని తేలింది.