హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారతీయ ఉద్యోగార్థుల్లో ఎక్కువ మంది అమెరికా, కెనడా, యూకేలో ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మూడు కాకుంటే మిడిల్ ఈస్ట్ దేశాలను ఎంచుకొంటున్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న భారతీయుల సెర్చ్ యాక్టివిటీ 2019 నవంబర్ నుంచి ఏప్రిల్ 2020 మధ్య ఎక్కువగా ఉన్నది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత జాబ్‌సెర్చ్ యాక్టివిటీ తగ్గింది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు గాడినపడుతుండటంతో భారతీయులు ఎక్కువగా వెళ్లాలనుకొంటున్న అంతర్జాతీయ గమ్యస్థానాలను తెలుసుకొనేందుకు జాబ్ వెబ్సైట్ సంస్థ ఇన్‌డీడ్ ‘క్రాస్ బోర్డర్ డాటా’ను పరిశోధించి ఈ వివరాలను వెల్లడించింది.
రెండో స్థానంలో కెనడా..
2019-2021 మధ్య కాలంలో భారత ఉద్యోగార్థుల్లో 40 శాతం మంది అమెరికాలో ఉద్యోగాల కోసం వెతికారు. స్నేహపూర్వక దౌత్య విధానాలతో కెనడా (16 శాతం) రెండోస్థానంలో నిలిచింది. యూఏఈ, బ్రిటన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. 2020లో ఏడోస్థానంలో ఉన్న ఖతార్, 2021లో సింగపూర్‌తో కలిసి నాలుగుకు చేరింది.
టెక్ కొలువులవైపే మొగ్గు
సాఫ్ట్వేర్ ఇంజినీర్, పుల్ స్టాక్ డెవలపర్, డాటా అనలిస్ట్ తదితర టెక్ ఉద్యోగాలు చేసేందుకు చాలామంది అన్వేషించారు. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలైన డ్రైవర్, హెల్పర్ వంటి వాటికి సైతం మంచి డిమాండ్ ఉన్నది. థర్డ్ వేవ్ వచ్చినా పలు దేశాల్లో పనిచేసేందుకు భారతీయులు సిద్ధంగా ఉన్నారని ఇన్‌డీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశికుమార్ తెలిపారు.
భారతీయులు ఆసక్తిచూపిన టాప్ దేశాలివే..
దేశం ఉద్యోగాల కోసం
వెతికినవారి శాతం
అమెరికా 40
కెనడా 16
యూఏఈ 14
బ్రిటన్ 14
ఖతార్, సింగపూర్ 3