హౌదీ మోదీకి ట్రంప్ : వైట్‌హౌజ్

Mon,September 16, 2019 10:07 AM

హైద‌రాబాద్‌: అమెరికా టెక్సాస్ రాష్ర్టం హ్యూస్టన్‌లో ఈ నెల 22న జరుగనున్న హౌదీ మోదీ సభలో ప్రధాని మోదీతో కలిసి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటారని శ్వేత‌సౌధం స్ప‌ష్టం చేసింది. దీంతో ట్రంప్‌, మోదీ బంధం స‌రికొత్త అధ్యాయానికి తెర‌లేప‌నున్న‌ది. రెండు అత్యంత పెద్ద ప్ర‌జాస్వామ్య దేశాల‌కు చెందిన నేత‌లు ఒకే వేదిక‌పై భారీ స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. హౌదీ మోదీ ఈవెంట్ కోసం ఇప్ప‌టికే అమెరికాకు చెందిన 50 వేల మంది రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఇద్ద‌రు నేత‌లు ఒకే వేదిక‌పై క‌ల‌వ‌డం రెండు దేశాల బంధాన్ని చాటిచెబుతుంద‌ని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ స్టిఫెనీ గ్రిసామ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అమెరికాలో స్థిర‌ప‌డ్డ వేలాది మంది భార‌తీయుల‌ను ఉద్దేశించి ఓ అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌సంగించ‌డం కూడా ఇదే తొలిసారి అవుతుంది. హౌదీ మోదీ ఈవెంట్‌కు ట్రంప్ రావ‌డం చ‌రిత్రాత్మ‌కం అవుతుంద‌ని అంబాసిడ‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. ఫ్రాన్స్‌లో జ‌రిగిన జీ-7 దేశాల స‌ద‌స్సు స‌మ‌యంలో ట్రంప్‌ను మోదీ ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఈ వేదికపైనే ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య విభేదాలకు కూడా తెరపడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. 2020లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలించే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్‌పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 27న ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.


1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles