జీరో వేస్ట్‌తో ఎకో ఫ్రెండ్లీ వివాహం చేసుకున్న బెంగళూరు జంట..!

Mon,September 16, 2019 01:53 PM

మన దేశంలో వివాహాలంటే ఎంత కోలాహలంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున అతిథులు వస్తుంటారు. వారి కోసం ఏర్పాట్లు చేయాలి. విందు భోజనం పెట్టాలి. ఇక వివాహం అయ్యాక పెద్ద ఎత్తున చెత్త, వ్యర్థాలు పేరుకుపోతాయి. ఆహారం బాగా వృథా అవుతుంది. అయితే ఆ విధంగా కాకూడదని, పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో బెంగళూరుకు చెందిన ఓ జంట వినూత్న రీతిలో గ్రీన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా వారు వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


బెంగళూరుకు చెందిన జయశ్రీ అరుణ్ కుమార్, అభినవ్ బర్గుర్‌ల వివాహం ఇటీవలే జరిగింది. అయితే వారు తమ వివాహం వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగవద్దని అనుకున్నారు. అందుకు గాను స్థానికంగా ఉన్న గ్రీన్ ఉత్సవ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. వారు ఆ దంపతుల వివాహ వేడుకను జీరో వేస్ట్ ఫంక్షన్‌గా నిర్వహించారు. ఎలాంటి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు మిగలకుండా, ఆహారం వృథా కాకుండా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో వివాహం జరిపించారు. అందుకు గాను గ్రీన్ ఉత్సవ్ ప్రతినిధులు వివాహ ఆహ్వాన పత్రికలను రీసైకిల్డ్ పేపర్‌తో తయారు చేశారు. అలాగే అతిథులకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరికాయలను ఇచ్చారు. టిష్యూ పేపర్లకు బదులుగా క్లాత్ నాప్కిన్స్‌ను ఉపయోగించారు.


ఇక ఆ వివాహంలో సెరామిక్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకుల్లో భోజనాలు వడ్డించారు. టీ, కాఫీలను ప్లాస్టిక్ కప్పులకు బదులుగా స్టీల్ గ్లాసుల్లో సర్వ్ చేశారు. వివాహ మండపం అలంకరణ కోసం సహజసిద్ధమైన పూలు, అరటి ఆకులను ఉపయోగించారు. వివాహం అయ్యాక ఆ ఆకులను, పూలను కంపోస్టు ఎరువు తయారీకి పంపించారు. అలాగే విందు భోజనం అయ్యాక మిగిలిన ఆహార పదార్థాలను పారేయకుండా దగ్గర్లో ఉన్న అనాథ్రమానికి పంపించారు. ఇలా గ్రీన్ ఉత్సవ్ ప్రతినిధులు పర్యావరణ హితమైన పద్ధతిలో అసలు వ్యర్థాలేమీ ఉత్పన్నం కాకుండా ఆ వివాహ వేడుకను నిర్వహించారు. దీంతో తాము అనుకున్నట్లు చేయగలిగామని ఆ నూతన దంపతులు తెలిపారు. ఇక వీరి కోవలోనే వీరి స్నేహితులు కూడా ఎకో ఫ్రెండ్లీ వివాహాలు చేసుకుంటామని చెబుతుండడం విశేషం..!

13834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles