మహాత్మాగాంధీని కాపాడిన రైల్వే క్రాసింగ్..!

Tue,October 1, 2019 05:47 PM


పూణే: రేపు అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సిద్దమవుతున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో ప్రాణాలు వదిలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాల్పుల ఘటనకు ముందు గాంధీజిపై నాలుగైదు హత్యాప్రయత్నాలు కూడా జరిగాయట. వీటిలో ఒకటి పూణేలో జరిగిన హత్యాయత్నం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదే ఘటనలో గాంధీజి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పుకున్నారు.. గాంధీజి మరణానికి ముందు 14 ఏళ్ల క్రితం పూణేలో ఈ ఘటన జరిగింది.


1934 జూన్ 25న మహాత్మాగాంధీ అంటరానితరానికి వ్యతిరేకంగా జాతీయస్థాయి ప్రచారాన్ని చేపట్టిన సందర్భం. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గాంధీజీ విశ్రాంబాగ్ ప్రాంతంలో జరిగే సభకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఓ కారుపై బాంబు విసిరారు. గాంధీజీ ప్రయాణిస్తున్న కారుగా భావించిన దుండగులు ఈ బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో కారులో ప్రయాణిస్తున్న పూణే మున్సిపల్ ఆఫీస్ ఉన్నతాధికారి, కుటుంబసభ్యులు గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వతంత్ర భారత తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన (కాంగ్రెస్)నర్హర్ విష్ణు గాడ్గిల్ మరాఠీలో రాసిన తన ఆటోబయోగ్రఫీ ‘పథిక్’ (ఏ ట్రావెలర్)లో ప్రస్తావించారు.

గాంధీజి సభకు సరైన సమయానికి వెళ్లేందుకు బయలుదేరారు. కానీ గాంధీజీ ప్రయాణిస్తున్న కారు వాక్‌డేవాడి రైల్వే క్రాసింగ్ వద్ద 5 నిమిషాలు ఆగింది. ఇంతలోనే విశ్రాంబాగ్ లోని సభా ప్రాంగణం బయట పెద్ద పేలుడు సంభవించింది. మీటింగ్ హాల్ లో ఉన్నవారంతా గాంధీజీకి స్వాగతం పలికేందుకు టపాకాయలు కాల్చుతున్నారనుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి కావాలనే గాంధీజి ప్రయాణిస్తున్న కారుగా భావించి బాంబు విసిరాడని ఆ తర్వాత తెలిసిందని గాడ్గిల్ పేర్కొన్నారు. రైల్వే క్రాసింగ్ గేట్ మూయడంతో 5 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల గాంధీజి ప్రాణాలతో బయటపడ్డారని..రైల్వే క్రాసింగ్ మహాత్మాగాంధీ జీవితాన్ని ఎలా కాపాడిందో గాడ్గిల్ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు.

2729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles