సీఎం పదవీ కాలాన్ని పంచుకునే ప్రసక్తే లేదు..!

Fri,November 8, 2019 05:15 PM

ముంబై: ఇన్నేండ్లు మాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరకి ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు ఓటేశారు. శివసేనతో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా పంచుకునేది లేదు. అసలు 50:50 ఫార్ములా గురించే చర్చించలేదని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించిన అనంతరం దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు.


'మహారాష్ట్రలో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతగానే కృషి చేశాను. ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధి చాలా సంతోషం కలిగించింది. మేం చేసిన పనులతో ప్రజలు సంతృప్తి చెందారు కనుకే మళ్లీ ఆశీర్వదించారు. ఈ ఐదేళ్లు రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాం. ప్రభుత్వాన్ని స్వచ్ఛంగా నడిపించాం. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. వాటిని సమర్థంగా పరిష్కరించాం. మహారాష్ట్రను పాలించే అధికారం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు. వసేన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయి. శివసేనతో సీఎం పదవీ కాలాన్ని పంచుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని దారులు తెరిచే ఉన్నాయని' ఆయన వివరించారు.

'రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీ మాది. రెండున్నరేళ్ల పదవీకాలంపై ఏనాడూ చర్చ జరగలేదు. పదవీకాలంపై నా సమక్షంలో ఎప్పుడూ చర్చ జరగలేదు. అమిత్ షా, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చ జరిగితే మాత్రం నాకు తెలియదు. మేం మాట్లాడేదే లేదని శివసేన చెప్పడంతో మాకేమీ అర్థం కావడం లేదు. సంక్షోభ పరిష్కారం కోసం నేను చాలా ప్రయత్నించా. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇప్పటి వరకు శివసేన మమ్మల్ని సంప్రదించలేదు కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను కలిసింది. భాగస్వామి పార్టీ మా గురించి చెడుగా మాట్లాడటం అంగీకరించలేం. మోదీ గురించి శివసేన ఇలాగే మాట్లాడితే ఆపార్టీతో స్నేహంపై పునరాలోచన చేస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ నన్ను కోరారు' అని ఫడణవీస్ పేర్కొన్నారు.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles