అమర హరితం!


Mon,October 14, 2019 01:31 AM

amara-haritham
మనకు మనం
దిగంబరమై
నాగరికత గురించి మాట్లాడుకుంటున్నం
పర్యావరణంపై
ఆందోళన పడుతున్నం !

మూడొందల గజాల ప్లాట్లో
ఆరంతస్తుల బంగ్లా
నీడనిచ్చే చెట్టుకు అడ్రస్ లేదు

ఇండ్లు, గోడలు మిద్దెల మీద
రంగురంగుల టాటా స్కైలు, నెట్వర్క్ టవర్లు
హోదాకు సంకేతంగా
గేట్ల ముందర టామీలు
పచ్చదనం పంచే చెట్లు
కిచకిచ స్వాగతాలు పలికే పిట్టలేవి

తడి తగులకుండా నిండుగా గ్రానైట్ మార్బుల్
మట్టి అంటకుండా పార్కింగ్ ఫ్లోరింగ్ టైల్స్
రోడ్లు అద్దాలై, బావులు భవంతులై
చెరువులు రియల్ లై
భూమి వ్యాపారమై మెరుస్తుంటే
చెట్టు భరోసా నేలను వెతుకుతున్నది
ఆసరయ్యే మనిషిని గాలిస్తున్నది

పేపర్ ప్లేట్లల్ల డిన్నర్ లు
ప్లాస్టిక్ గ్లాసుల్ల డ్రింక్స్
పాలప్యాకెట్లు, విత్తనాలు
కిరాణం సరుకు రవాణాలు
ప్లాస్టిక్ వియ్యాలై నేలను కబలిస్తున్నయి

నెత్తిన ముండ్లకంపేసుకొని
శరీర గోడలకు ఎయిర్ కూలర్లు ఏసీలను బిగించుకుంటున్నం
తలంబ్రాలు తద్దినాలకు విరివిగా క్రాకర్స్
పుట్టలో పాలు పోసినా నెత్తిన కిరీటం మొలిచినా
వీధులన్నీ డీజేల హింసల విన్యాసాలు
మట్టి జీవితాలన్ని మల్టిప్లెక్స్ లైనంక
హారితహారాలకు మానవహారాలైతున్నం

ఆస్తికోసం అమ్మయ్యలను రాత్రిపూట రోకలిబండతో మోదినట్లు
కనిపించిన ప్రతి చెట్టును దరువాజను చేస్తే
అడవి నగరమైనాక
ఇగుర్లపై సెమినార్లు దట్టించి దంచుతున్నం

గుట్కాలూ,గోవాలు
పాన్ మహల్‌లు దసరా దీపావళులై
పొగాకు జర్దాలు ఉగాదులు సంక్రాంతులై
దవడలు గిర్నీలై భక్షాల్లా నములుతూ
స్వచ్ఛభారత్ లకై కోటి దీపాల్నీ వెలిగిస్తున్నం
ప్రకృతి పర్యావరణానికై నిప్పుల్లో నడుస్తున్నం

చెట్లుంటేనే
మైసమ్మలు పోషమ్మలు పొలిచల్లుకునేది
చెట్లుంటేనే
ఋతుపవనాలు స్వేచ్ఛగా వీచేది
చెట్టుకిందనే
మహాతపస్సు ఫలించి సిద్ధార్థుడు
జ్ఞాన బుద్ధుడైంది
చెట్లు చిగురిస్తేనే చరిత్ర ఇగురుపోసేది

ఎన్కట
ఏ తోవల నడిచినా
సైన్యం పహారా కాస్తున్నట్లు ఆకుపచ్చ చెట్లు
ఇప్పుడు
సరిహద్దుల ఉగ్రవాదుల చేతుల్లో
హతమైన మరిత అమరులు

- వనపట్ల సుబ్బయ్య, 9492765358

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles