పెళ్లిచూపులు… ఆమె కళ్లు మాత్రమే కనిపించాయతనికి. అచ్చం తన ప్రేయసి కళ్లలాగే ఉన్నాయి. ఇక, మరో ఆలోచన రాలేదు. గులాబీ… ప్రేమకు చిహ్నం. దాన్ని చూడగానే మనకు ప్రియమైన వారు, ఆ తాలూకు బహుమతులే గుర్తుకు వస్తాయి. అచ్చం దానిలాగే, ఇంకొన్ని పువ్వులూ ఉన్నాయి. గులాబీ అక్కచెల్లెళ్లలా కనిపించే వీటిని చూసినా మనసు అంతే ముచ్చట పడుతుంది. మీరూ మా గులాబీలాగే ఉన్నారు పూబాలగారూ… అంటూ పలకరించేస్తుంది. పోలికకే కాదు… కానుకకూ బాగుండే వీటిని మనమూ పరిచయం చేసుకుందామా?!
రనన్క్యులస్
బ్రహ్మదేవుడి సృష్టిలో గులాబీలుంటే, విశ్వామిత్రుడి ప్రతిసృష్టిలో రనన్క్యులస్లు ఉన్నాయేమో అనిపిస్తుంది ఈ పువ్వుల్ని చూస్తుంటే. అందం, ఆకర్షణలోనే కాదు, రూపంలోనూ గులాబీకి సరిసాటి ఇవి. అందుకే వీటిని రనన్క్యులస్ రోజ్లుగానూ పిలుస్తారు. రోజాల్లాగే ఎరుపు, గులాబీ, నారింజ, పసుపులాంటి నిండైన రంగుల్లో ఆకట్టుకుంటాయివి. ఆకర్షణకు చిహ్నంగా వీటిని చెబుతారు. ఇక, ఈ పుష్పాల నుంచి వచ్చే సువాసన కూడా రోజా పువ్వు మాదిరిగానే ఉంటుంది. అందుకే గులాబీ అక్కచెల్లెళ్లలో దీనిది మొదటి స్థానం. వేజుల అలంకరణ కోసం పెంచే ఇవి, ఇంట్లోని కుండీల్లోనూ పెరుగుతాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఈ పూలు పూస్తాయి. అయితే ఈ చెట్టుకు గులాబీలా ముళ్లుండవు. ఒక్కమాటలో చెప్పాలంటే… ఆ గులాబీ గుచ్చుకుంటుంది…ఈ గులాబీ గుచ్చుకోదు! మిగతాదంతా సేమ్ టు సేమ్.
పెయోనీస్
Poenis
అలంకరణలో అధికంగా ఉపయోగించే పెయోనీస్ పువ్వులు కూడా అచ్చం గులాబీల్లానే కనిపిస్తాయి. ఆసియా, ఐరోపాలతోపాటు అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. మంచి సువాసనతో పసుపు, తెలుపు, ఎరుపు, ఊదా… ఇలా ఎన్నో రంగుల్లో పూస్తాయి. వీటిలో దాదాపు 33 విభిన్న రకాలు ఉన్నాయి. పింక్ హవాయియన్ కోరల్కు ఎక్కువమంది అభిమానులు ఉంటారు. పెద్ద గులాబీని పోలి ఉండే ఇది బొకేలు, వేజులు, మండపాలు… ఇలా ఏ అలంకరణలో అయినా ప్రత్యేకంగా కనిపిస్తుంది మరి!
కామెల్లియా జపోనికా
Camelia
గులాబీ పువ్వుకు కవల సోదరి ఉంటే కామెల్లియా జపోనికాలాగే ఉంటుంది అంటారు ప్రకృతి ప్రేమికులు. ఎవరు ఎవరన్నది పోల్చుకోవడం బాగా తెలిసిన వారికి తప్ప అసాధ్యం అనిపించేలా ఉంటాయి ఈ రెండు పువ్వులు. కామెల్లియా జపోనికా అన్నది నిజానికి ఓ టీ చెట్టు. మనం తేనీరుకు వాడే థియేసియే జాతికి చెందిన మొక్కే ఇది కూడా. దీని ఆకుల్లో వాపుల్ని (ఇన్ఫ్లమేషన్), క్యాన్సర్లని నివారించే ప్రత్యేక సుగుణాలుంటాయి. అందుకే టీలలోనూ, కషాయాలూ, టించర్ల తయారీలోనూ దీన్ని వాడతారు. దాదాపు రెండు వేల దాకా విభిన్న రకాలు ఉన్నాయీ పువ్వుల్లో. తెలుపు, ఎరుపు, గులాబీలతోపాటు వాటిమీద రంగుల్లో గీతలు వచ్చేవి మనకు అధికంగా కనిపిస్తాయి. ఎక్కువగా చైనా, జపాన్, ఐరోపాల్లో పెరిగే ఇది భారత్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లోనూ మనగలదు. దీని చెట్టు కూడా గుబురుగా గులాబీ చెట్టును పోలి ఉంటుంది. ఎరుపు రంగు పువ్వు ప్యాషన్కీ, గులాబీ రంగు ప్రేమకీ, తెలుపు అభిమానానికీ చిహ్నాలుగా చెబుతారు.
లిసియాంథస్
Lisanthenium
పూల వేజుల్లో గులాబీ హవా చెప్పనక్కర్లేదు. అక్కడ రోజాను అలంకరిస్తేనే అసలైన అందం అనేవాళ్లు చాలామందే ఉంటారు. అచ్చం అలాగే కనిపిస్తూ గులాబీకన్నా ఎక్కువ వర్ణాల్లో మురిపిస్తాయి ‘లిసియాంథస్’ పువ్వులు. రోజాల్లాగే గంట ఆకృతిలో ఉండే ఇవి, చెట్టు నుంచి కోసిన తర్వాత దాదాపు రెండు వారాల దాకా తాజాగా ఉంటాయి. తెలుపు, గులాబీ రంగులతో పాటు వంగ వన్నెల్లోనూ చూడముచ్చటగా పూస్తాయివి. చిన్నసైజులో ఉండే గులాబీనేమో అని చాలామంది అనుకునే ఈ పువ్వులు వాటితో పోలిస్తే ఖరీదు తక్కువ. ఇక, మెచ్చుకోలు, కృతజ్ఞతల్లాంటి వాటిని సూచిస్తాయి. కాబట్టి భాగస్వామికి ఇవ్వడానికి ఇవి మంచి ఎంపిక.
డబుల్ తులిప్
గులాబీలాగే డబుల్ తులిప్నూ ప్రేమకు చిహ్నంగా చెబుతారు. సాధారణ తులిప్ పువ్వులకు రెండు రెట్లు అధికంగా రేకలు ఉండే ఇవి చూడగానే అచ్చం రోజాల్లాగే కనిపిస్తాయి మరి! ఎరుపు, పసుపు, తెలుపు, బచ్చలపండు రంగు, వంగపండు రంగు…ఇలా తులిప్ పువ్వుల్లో ఉండే వింతైన వర్ణాలన్నీ ఇందులోనూ కనిపిస్తాయి. రెండు రంగుల కలబోతగానూ ఇవి విరబూస్తాయి. ప్రియమైన వారికి ఇచ్చే అందమైన ప్రేమ కానుకల్లో ఇవీ ఒకటి.
డబుల్ ఇంపేషన్స్
డబుల్ తులిప్లలాగే డబుల్ ఇంపేషన్స్ పువ్వులూ గులాబీని పోలి ఉంటాయి. అదాటున చూస్తే అసలైన గులాబీనే అనిపించేలా కనిపిస్తాయి. నారింజ, పసుపు, తెలుపు, గులాబీ, ఊదా… ఇలా ఎన్నెన్నో రంగుల్లో ముచ్చటగా విచ్చుకుంటాయివి. సాధారణంగా రోజాలు ఎక్కువ సూర్యరశ్మిని కోరుకుంటే, ఇవి మాత్రం నీడను ఇష్టపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి నీడలోనూ చక్కగా బతకగలవు. కుండీల్లో కూడా పెరిగే ఇవి వసంత రుతువులో గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి. అలా వీటిని చూసిన ఎవరైనా ఆర్టిఫీషియల్ గులాబీల పూలకుండీని తెచ్చుకున్నారా… అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత ఆకర్షణీయంగా కనిపించడం ఈ డబుల్ ఇంపేషన్స్ పూల ప్రత్యేకత!