ప్రకృతి ప్రసాదించిన అందాలలో పూలు ప్రత్యేకం. కుసుమాల సోయగం, పరిమళం ముందు మరేవీ సాటిరావు. అందుకే, కుసుమాలంటే అతివలకు అంత ప్రీతి. అందుకే వారు తలపిన్ను మొదలుకుని పాదరక్షల వరకు పూల డిజైన్లు పొదిగిన వాటికి ప్రాధాన్యమిస్తారు. చీరలపై విరులకు విరివిగా చోటిస్తారు. ముదితల మనసు తెలిసిన డిజైనర్లు ఈ పూల వసంతాన్ని నగలపైకి మళ్లించారు. రాజస్థానీ సంప్రదాయ ఆభరణాలైన మీనాకారీ జువెలరీని పుష్పభరితం చేస్తున్నారు. మోడ్రన్ సొగసులు అద్దుకున్న ఈ మార్వెల్స్ స్పెషల్ నగల విశేషాలు ఇవి..
రాజస్థానీ ఆభరణాలు అనగానే గుర్తొచ్చేది మీనాకారీ జువెలరీ. ఈ సంప్రదాయ నగల చరిత్ర పెద్దదే. కెంపులు, పచ్చలు, వజ్రాలు, పూసలు, ముత్యాలు.. ఒక్కటేమిటి అన్నిరకాల హంగులకు తోడు ఎనామిల్ మెరుపులతో రాజసం ఉట్టిపడే ఈ నగలు పట్టుకుంటే వదలబుద్ధి కాదు, పెట్టుకుంటే తీయబుద్ధి కాదు! పెద్దపెద్ద డిజైన్లతో చోకర్లు, కంఠాభరణాలు, గాజులు, వడ్డాణాలు, ఉంగరాలు.. సంప్రదాయ దుస్తులకు మరింత నిండుదనాన్ని జోడిస్తాయి. ఈ ఆభరణాలకు పూల సొగసుల్ని అద్ది మరింత అందంగా మలుస్తున్నారు డిజైనర్లు. అచ్చంగా పూలను పేర్చినట్లు కనిపించే ఈ ఆభరణాలు ట్రెడిషనల్‌గా ఉంటూనే మోడ్రన్ లుక్‌లో కనువిందు చేస్తున్నాయి.
రంగురంగుల పూలు, ఆకులు, తీగల మేళవింపే ఈ నగల ప్రత్యేకత. బంగారం, ఎనామిల్ మెరుపులతో అలరించే ఈ ఆభరణాలు ఎలాంటి దుస్తులపై అలంకరించుకున్నా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ నగలు చక్కని ఎంపిక. ఈ సంప్రదాయ ఆభరణాలు ప్రస్తుతం బ్రైడల్ జువెలరీగా బాగా ప్రాచుర్యం పొందాయి. గాగ్రాలు, లెహంగాల మీదికి చక్కగా నప్పుతాయి.
అచ్చంగా పూలనే అలంకరించుకున్నట్లు సహజ మెరుపుతో తళుకులీనుతాయి. పూలకుచ్చు మెడలో వేసుకున్నట్లు, తల్లో అందంగా అలంకరించుకున్నట్లు భ్రమింపజేస్తాయి. మీనాకారీ అందాలతో గడియారాలు, గాజులు, ఉంగరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెలరీలోనూ దొరుకుతున్న ఈ మీనాకారీ పూల నగలు మీరూ ఒకసారి ట్రై చేయండి.