పుట్టిన రోజున కొత్త బట్టలు వేసుకోవడం ఎంత సాధారణమో.. కేక్ కట్ చేయడమూ అంతే సహజం అయిపోయింది చాలా మందికి. అంతకుముందు వెనీలా అనో, బటర్‌స్కాచ్ అనో కొన్ని రకాల కేకులు గుండ్రంగా తయారు చేసి పెట్టేవాళ్లు కానీ, ఇప్పుడవీ కస్టమైజ్ అయిపోయాయి. ఎవరి అభిరుచులకు తగ్గట్టు వాళ్లు తయారు చేయించుకుంటున్నారు.
అలాంటి వాటిలో ఒక విభిన్నమైన రకమే ‘రూబిక్స్ క్యూబ్ కేక్’. పజిల్స్‌ను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఎంపిక. ఇక, రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసే వాళ్లకైతే ఇలాంటి కేక్ సూపర్ సర్ప్రైజ్ అన్నట్టే. అటు వాళ్ల అభిరుచిని ప్రతిబింబిస్తూ, ఇటు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఈ కేకులు భిన్నత్వాన్ని కోరుకునే వాళ్లకు చక్కగా సరిపోతాయి. కాకపోతే క్యూబ్ చేయడంలో ఎంత తోపైనా.. దీన్ని సాల్వ్ చేయడం మాత్రం సాధ్యం కాదనుకోండి! లోకో భిన్న రుచిః.. కేకో భిన్న రుచిః