Keer Starmer | బ్రిటన్ పార్లమెంట్‌కు గురువారం జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఎన్నికల ఫలితాల్లో 400 సీట్లకు పైగా గెలుచుకున్నది. దీంతో లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్.. తదుపరి బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. కీర్ స్టార్మర్ నియామకానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడగానే కీర్ స్టార్మర్.. బకింగ్ హం ప్యాలెస్‌లో రాజు కింగ్ చార్లెస్-3ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కీర్ స్టార్మర్ను రాజు కింగ్ చార్లెస్-3 ఆహ్వానించారు. కింగ్ చార్లెస్‌తో కీర్ స్టార్మర్ సమావేశమైన దృశ్యాన్ని రాజకుటుంబం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ హ్యాండిల్లో ట్వీట్ చేసింది.
రాజు కింగ్ చార్లెస్-3తో భేటీ తర్వాత జాతినుద్దేశించి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని, ఆ తర్వాతే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజాసేవ చేసుకునే అవకాశం రావడం ఒక గౌరవం అని పేర్కొన్నారు. కీర్ స్టార్మర్ సారధ్యంలోని లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకోగా, మాజీ ప్రధాని రిషి సునాక్ సారధ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రిషి సునాక్.. ప్రధానమంత్రి అధికార నివాసం వద్ద జాతినుద్దేశించి చివరిసారి ప్రసంగించారు. అటుపై రాజు కింగ్ చార్లెస్-3ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.