సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం విస్తృతంగా కురిసింది. గ్రేటర్ జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంతంలో 3.6 సెంటీమీటర్లు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 1.2 సెం.మీ.లు, రాయదుర్గం వార్డు ఆఫీస్‌తో పాటు యూసుఫ్‌గూడ, ఫిల్మ్ నగర్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.6డిగ్రీలు, గాలిలో తేమ 52శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.