నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

Thu,December 5, 2019 06:27 PM

హైదరాబాద్‌: నగరంలోని రోడ్లను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ రోడ్లు- ట్రాఫిక్‌పై మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను శాస్త్రీయంగా క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థకు ఆదరణ ఎక్కువగా ఉందని మంత్రి అన్నారు. మనదేశంలో.. ముఖ్యంగా ముంబైలో 72 శాతం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తుంటే, హైదరాబాద్‌లో మాత్రం 34 శాతం మాత్రమే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. నగరంలో ఐదేళ్లలో వాహనాల సంఖ్య 73 లక్షల నుంచి కోటి 20 లక్షలకు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.


పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వైపు ప్రజలను మళ్లించేందుకు రవాణా వ్యవస్థను మెరుగు పరుస్తున్నామని మంత్రి అన్నారు. మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ మార్గాలు, స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, లైనింగ్‌, సైకిల్‌వేలు, గ్రీనరీలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. పార్కింగ్‌ స్థలాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తామన్నారు. పార్కింగ్‌ స్థలాలు లేక వాహనదారులు వాహనాలను రోడ్డుపైనే పార్క్‌ చేస్తున్నారన్నారు. దీనికి పరిష్కారంగా ఖాళీ ప్లాట్లను పార్కింగ్‌ ప్రదేశాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు యజమానుల అంగీకారం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ స్థలాల్లో పార్కింగ్‌ గురించి సంబంధిత స్థలాల యజమానులకు ఆదాయం సమకూరుస్తామన్నారు. ట్రాఫిక్‌ వ్యవస్థను సమన్వయ పర్చేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. నగరంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 100కు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి తెలిపారు. వైన్‌ షాపులు, వాటి పరిసరాల్లో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పార్కులు, ఖాళీ స్థలాలు అసాంఘీక శక్తులకు అడ్డాలుగా మారొద్దనీ, అందుకు గల చర్యలు అధికారులు తీసుకోవాలని మంత్రి తెలిపారు. నగరంలో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయనీ, అన్ని రోడ్లపై లైటింగ్‌ను పెంచుటకు అదనంగా మరిన్ని ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఆర్‌ అండ్‌ బీ అధికారులు, ట్రాఫిక్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles