పోలీసు అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి: రాచకొండ సీపీ

Mon,October 21, 2019 09:22 AM

గోల్నాక: పోలీసు అమరవీరులను స్పూర్తిగా తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పిలుపునిచ్చారు. సక్రమంగా తమ విధి నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో రాచకొండ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో అంబర్‌పేట రాచకొండ కార్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ..రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో రాచకొండ పోలీసులతోపాటు శిక్షణలో ఉన్న సుమారు 500మంది పోలీసులు రక్తదానం చేశారు. అనంతరం ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అంజిపల్లి నాగమల్లు అమర పోలీసుల సేవలను స్మరిస్తూ స్వయంగా రచించి, గానం చేసిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మహేశ్‌భగవత్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దు రక్షణలో సైన్యం ఎంత ప్రధానపాత్ర పోషిస్తుందో అంతకంటే ఎక్కువగా అంతర్గత శత్రువులైన తీవ్రవాదం నుంచి ప్రజలను కాపాడటంలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారన్నారు. అసాంఘిక శక్తులతో పోరాడుతూ అశువుల బాసిన పోలీసులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులోభాగంగా సమాజ సేవా కార్యక్రమాలతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంతో సేకరించిన రక్తాన్ని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అవసరమైన వారికి అందిస్తారని ఆయన తెలిపారు. అరుదైన బ్లడ్ గ్రూపులకు చెందిన రక్తాన్ని సైతం ఆపదలో ఉన్న వారికి అందిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు యాదగిరి, దివ్వచరణ్‌రావు, శిల్పవల్లి, శంకర్‌నాయక్, సలీమా, హరినాథ్, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు భద్రారెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles