అజాతశత్రువు గుత్తా..: మంత్రి కేటీఆర్

Wed,September 11, 2019 12:32 PM

Minister KTR Speech in Legislative  Council

హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'గుత్తా సుఖేందర్‌రెడ్డికి అన్ని వ్యవస్థల్లో ఉన్న సుధీర్ఘ అనుభవం రాష్ర్టానికి ఉపయోగపడుతుంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాతో పాటు ఇక్కడున్న కొంతమంది సభ్యులు ఇంకా పుట్టనేలేదు. మా వయసు కన్నా ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌రెడ్డి. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి గుత్తా' అని వివరించారు.

'వార్డు మెంబర్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా, ఎంపీగా వివిధ హోదాల్లో గుత్తా పనిచేశారు. సహకార వ్యవస్థ, డెయిరీ రంగంలో విశేష సేవలందించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా. సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా ఆకాంక్షించిన ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చిన రోజునే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం యాదృశ్చికం. ఏ పార్టీలో ఉన్నా అజాతశత్రువుగా అందరితో సఖ్యతతో ఉన్నారు. పార్టీలకతీతంగా కలిసిమెలసి నడిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. సభ హుందాగా జరిగేలా ఛైర్మన్ హోదాలో గుత్తా సహకరిస్తారని ఆశిస్తున్నా. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరు రైతు బిడ్డలు ఉండటం రాష్ట్ర రైతులు సంతోషించాల్సిన విషయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన చర్చకు పెద్దపీఠ వేస్తారని ఆశిస్తున్నాని' కేటీఆర్ పేర్కొన్నారు.

2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles