మా బాబు వయసు నాలుగు సంవత్సరాలు. పుట్టినప్పుడు సరైన బరువే ఉన్నాడు. సమయానికి టీకాలు వేయించాం. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్నాడు. వారం క్రితం సాధారణ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డాడు. మూడు, నాలుగు రోజుల తర్వాత కాళ్ల నొప్పులు మొదలయ్యాయి. నడవడానికి ఇష్టపడటం లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాం. కొన్ని వైద్య పరీక్షలు చేశారు. రికవరీ అవుతుందని చెప్పారు. కానీ ఏమాత్రం తగ్గలేదు. మేం బలవంతం చేసి నిలబెట్టినా నడవలేకపోతున్నాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నవాడికి ఎందుకు ఇలా జరిగింది? మా బాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి.
ఓ పాఠకురాలు
నడుస్తూ, పరుగెడుతూ ఉన్న బిడ్డ నడవలేకపోవడం ఏ తల్లిదండ్రులకైనా ఆందోళన కలిగిస్తుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం… మొదట జలుబు, దగ్గుతో బాధపడ్డాడు. అలాగే కండరాల నొప్పి, దానివల్ల నడవలేక ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. మీ అబ్బాయికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మయోసైటిస్ సమస్య రావొచ్చు. వైరస్లు ఏ విధంగా జలుబు, గొంతునొప్పి, ఒంటినొప్పులు కలుగజేస్తాయో, అలాగే కండరాలపై ప్రభావం చూపిస్తాయి. వైరస్ల వల్ల కండరాల వాపు, నొప్పి కలుగుతుంది. అందువల్ల నడవలేకపోతారు. మీ అబ్బాయి సమస్య ఇదే అయి ఉంటే పూర్తిగా నయమవుతుంది. దీనికి సీపీకే అనే ఎంజైమ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
మీ అబ్బాయి సమస్యల వరకే చెప్పారు. కానీ, మీ కుటుంబంలో ఎవరికైనా కండరాల నొప్పులు, కండరాల సమస్యలు ఉన్నదీ, లేనిదీ చెప్పలేదు. మీ కుటుంబంలో ఎవరికైనా కండరాల సమస్య ఉందేమో ఒకసారి ఆలోచించండి. అలా ఉంటే మీ అబ్బాయిది మయోసైటిస్ కాకపోవచ్చు. కుటుంబంలో ఎవరికీ కండరాల సమస్య లేకపోయినా, పిల్లవాడికి ఏ ఇతర అనారోగ్య సమస్యలూ లేకుండా ఒక్క కండరాల నొప్పి మాత్రమే ఉంటే అది మయోసైటిస్ అయి ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఒకసారి పీడియాట్రీషియన్ని సంప్రదించండి. వాళ్లు చెప్పిన పరీక్షలు చేయించండి. దానికి అనుగుణంగా మందులు వాడుతూనే ఫిజియోథెరపీ చేయించండి. మీ అబ్బాయికి ఉన్న లక్షణాలకు ఎటువంటి ప్రమాద కారణాలు లేవని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలవండి. వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల నరాలు కూడా ప్రభావితం అవుతాయి. ఆ సమస్యకు కారణం ఏమిటనేది పరీక్షల ద్వారానే నిర్ధారణ అవుతుంది. అప్పుడు కచ్చితమైన మందులు వాడి సమస్య నుంచి బయటపడవచ్చు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్