మనిషికే వైకల్యం, మనసుకు కాదు


Tue,December 3, 2019 12:25 AM

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండా 2030 అన్ని వర్గాలను సామాజికాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అందరి అవకాశాలను, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ, అందరి సంక్షేమానికి విశ్వవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కృషిచేయవలసిన అవసరాన్ని నిర్దేశిస్తుంది. సమ్మిళిత సమాజ నిర్మాణానికి, సామాజిక న్యాయ సాధనకు దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అత్యంత కీలకం.


ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్‌ 3ను అంతర్జాతీయ దివ్యాం గుల దినోత్సవంగా జరుపుకుంటుంది. దివ్యాంగుల సమస్యల పట్ల అవగాహన కల్పించేందుకు, రాజకీయ సంకల్పా న్ని ప్రోది చేసేందుకు, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వనరులను కూడగట్టేందుకు ఈ సందర్భంగా పలుకార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగా ఈ ఏడాది ‘సమాజ నిర్మాణంలో దివ్యాంగుల భాగస్వామ్యం ప్రోత్సహించడం వారి నాయకత్వానికి ఊతమివ్వడం’ అనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను రచించింది.

అంకెలు చెప్పే నిజాలు: 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 2.68 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. మొత్తం జనాభాలో ఇది 2.1 శాతానికి సమానం. 2011 జనాభా లెక్కల నాటికి చట్ట ప్రకారం గుర్తించబడిన వైకల్యాలు 7 మాత్రమే. 2016లో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలు చట్టపరమైన గుర్తింపు పొందాయి. ఈ లెక్కన వైకల్యంతో బాధపడేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది.
అధికారిక గణాంకాల ప్రకారం 70 దివ్యాంగుల జనాభా గ్రామీ ణ ప్రాంతాల్లో నివసిస్తుంది. కేవలం 8.5 మంది దివ్యాంగులు మాత్రమే గ్రాడ్యుయేట్‌ విద్యను పూర్తిచేయగలుగుతున్నారు. మొత్తం దివ్యాంగులలో 3వ వంతు మాత్రమే ఏదో ఒకరకమైన ఉపాధిని పొందగలుగుతున్నారు. 40శాతానికి పైగా దివ్యాంగులు జీవితకాలం వివాహం లేకుండానే ఉండిపోవాల్సి వస్తుంది. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలివేస్తున్న చిన్నారుల్లో అత్యధికులు దివ్యాంగులే. ఈ గణాంకాలన్ని దివ్యాం గుల దీనస్థితిని కళ్లకు కడుతుంటే మరోవైపు దివ్యాంగులను ఆర్థికవ్యవస్థ లో భాగస్వాములు చేయలేకపోవడం వల్ల మనదేశం ఏటా 5 నుంచి 7 శాతం జీడీపీని కోల్పోతున్నట్లు ఓ అంచనా.

వివక్షే అసలు సమస్య: ఖగోళ భౌతికశాస్త్ర సైద్ధాంతికుడు దివంగత స్టీఫె న్‌ హాకింగ్‌ కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండి కూడా నిరుపమానమైన పరిజ్ఞానాన్ని సమాజానికి అందించాడు. హాకింగ్‌ చెప్పినట్లుగా సామాజిక వివక్షే దివ్యాంగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. శారీరక వైకల్యం కారణంగా దుర్బలంగా మారిన దివ్యాంగులను సామాజిక వివక్ష, ఆర్థిక అవరోధాలు, అవకాశాల కొరత మరింత కుందీస్తున్నాయి.

ఎన్నో విజయగాథలు: గత అక్టోబర్‌లో ప్రాంజల్‌ పాటిల్‌ అనే యువ ఐఏఎస్‌ అధికారిణి తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తు న్న దృశ్యం మన మనోఫలకాలపై ఇప్పటికీ తాజాగానే ఉన్నది. ఆరేండ్ల వయసులోనే కంటిచూపు పూర్తిగా కోల్పోయినా సడలని సంకల్పం, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, చెదరని స్ఫూర్తి ప్రాంజల్‌ను అన్ని అవరోధాలు దాటి సివిల్స్‌కి ఎంపికయ్యేలా చేశాయి. వైకల్యం శరీరానికి మెదడుకే కానీ మనసుకు కాదని మానవ స్ఫూర్తి, ఆశావహ దృక్పథం, చట్టం కల్పించిన ప్రత్యేక హక్కుల పట్ల అవగాహన, లక్ష్యశుద్ధి, పోరాడే తత్త్వం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదుగవచ్చని చాలా మంది విజేతలంతా నిరూపించారు.

సామాజిక న్యాయం: భారత రాజ్యాంగం ప్రవేశిక పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, సమానావకాశాలను, వ్యక్తి గౌరవానికి హామీ ఇస్తుంది. కులం, మతం, ఇతర అంశాల ఆధారంగా వివక్ష ను నిషేధిస్తున్న భారత రాజ్యాంగం వైకల్యం ఆధారంగా చూపిస్తున్న వివక్షను నిషేధించకపోవడం, దీనిని ప్రాథమికహక్కుల్లో భాగంగా చేయకపోవడం విచారకరం. కాకపోతే ఆదేశిక సూత్రాల్లోని 41వ అధికరణ దివ్యాం గులకు పనిహక్కును, విద్యను, మరింత చేయూతరందించాల్సిన విద్యుక్త ధర్మాన్ని ప్రభుత్వాలకెప్పుడూ గుర్తుచేస్తుంటుంది.

ఐరాస దివ్యాంగుల హక్కుల కన్వెన్షన్‌ 2006కు అనుగుణంగా దివ్యాం గుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ని అమల్లోకి తీసుకువచ్చింది. వైకల్యాన్ని ఒక గతిశీల, కాలానుగుణంగా పరిణామం చెందే భావనగా ఈ చట్టం గుర్తిస్తుంది. తద్వారా వైకల్యభావనను, వైకల్యాల సంఖ్యను, పరిధిని ఈ చట్టం విస్తృతపరిచింది. గతంలో ఏడుగా ఉండే వైకల్యాల సంఖ్య ఈ చట్టంలో 21కి పెరిగింది. మరుగుజ్జుతనం, అంధత్వం వంటి భౌతిక వైకల్యాలతో పాటు, కండరాల క్షీణత, సెరిబ్రల్‌ పాల్సీ వంటి నాడీ సంబంధిత రుగ్మతలను, థలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్‌ అనీమియా వంటి జన్యుపరమైన, రక్తసంబంధ సమస్యలను, యాసిడ్‌ దాడి, పార్కిన్‌సన్‌ వ్యాధి వంటి వాటిని కూడా వైకల్యాలుగా గుర్తిస్తుంది. అంతేకాకుం డా ఉన్నతవిద్యలో 5శాతానికి తగ్గకుండా, ప్రభుత్వోద్యోగాల్లో 4 శాతానికి తగ్గకుండా, పేదరిక నిర్మూలన కార్యక్రమాల కేటాయింపులో కనీసం 5 శాతం ప్రాతినిధ్యం దివ్యాంగులకు దక్కేలా చట్టం నిర్దేశిస్తుంది. 6 నుంచి 18 ఏండ్ల మధ్య చిన్నారులకు ఉచిత విద్యను అందజేయవలసిన బాధ్యతని ప్రభుత్వాలపై ఉంచింది. దివ్యాంగుల పట్ల వివక్షను నిషేధిస్తూ చట్ట ఉల్లంఘనకు పాల్పడినవారికి తగిన శిక్షలను, చట్టం అమలుకు కావలసిన వ్యవస్థల గురించి చట్టం వివరిస్తుంది.

2018లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా డి.ఆర్‌.ఐ.ఎఫ్‌ (డిజబులిటి రైట్స్‌ ఇండియా ఫౌండేష న్‌) మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించిన ఒక అధ్యయనం చట్టం అమల్లోని లోపాలను కళ్లకు కట్టింది. చట్టం అమల్లోకి వచ్చిన రెం డేండ్ల తర్వాత కూడా ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా పూర్తికాలేదు. సగానికి పైగా రాష్ర్టాల్లో రాష్ట్రస్థాయి సలహా కమిటీలు, 80 పైగా జిల్లాల్లో జిల్లాస్థాయి సలహా కమిటీ లు ఏర్పాటుకాలేదు. మూడవ వంతు రాష్ర్టాల్లో కమిషనర్‌ల నియామకం చేపట్టనేలేదు. సగం రాష్ర్టాల్లో మాత్రమే కొత్త చట్టానికి అనుగుణంగా గుర్తింపు కార్డుల జారీ మొదలైంది.
Ballatha
గతకొన్ని ఆర్థిక సంవత్సరాల బడ్జెట్‌ ప్రతులను విశ్లేషిస్తే దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు వహిస్తున్న ఉదాసీనత తేటతెల్లమవుతుంది. సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడిచే వికలాంగుల సశక్తీకరణ విభాగానికి కేటాయింపులు కొన్నేండ్లుగా ఒకేచోట స్థిరంగా ఉన్నా యి. పెరుగుతున్న దివ్యాంగ జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం అవసరమైన కేటాయింపులు జరుపకపోగా ఆ కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో విడుదలకు నోచుకోవడం లేదు.

సామాన్య ప్రజలే కాకుండా ప్రభుత్వాధికారులు కూడా దివ్యాంగుల పట్ల వివక్షాపూరిత వైఖరిని కనబరుస్తున్నారు. ట్రైసైకిళ్ళు, కృత్రిమ అవయవాల కేటాయింపు, సమయానుగుణంగా పింఛన్ల పంపిణీ, పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో సరైన ప్రాతినిధ్యం వంటి కనీస అవసరాల కోసం కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రమాదాల కారణంగా, వృద్ధాప్యం కారణంగా వైకల్యానికి గురైన బాధితుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండా 2030 అన్ని వర్గాలను సామాజికాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అందరి అవకాశాలను, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ, అందరి సంక్షేమానికి విశ్వవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కృషిచేయవలసిన అవసరాన్ని నిర్దేశిస్తుంది. సమ్మిళిత సమాజ నిర్మాణానికి, సామాజిక న్యాయ సాధనకు దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అత్యంత కీలకం. ‘లీవ్‌ నో వన్‌ బిహైండ్‌' అన్న ఐరాస ఆశయం ఒక శుష్క నినాదంగా మిగిలిపోకూడదని మనందరం ఆశిద్దాం.

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles