బ్రాండ్ తెలంగాణ భేష్


Sat,November 16, 2019 12:40 AM

రైతుల ఆదాయం పెంపు, గ్రామీణ మహిళా సంఘాల సాధికారత, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న ఈ మహిళా సమాఖ్య ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలద్వారా నాణ్యమైన వస్తువులు బ్రాండ్ తెలంగాణ పేరిట మార్కెట్ చేయడంలో సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వం వీటిపట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

NEW-PHOTO-OFRK
దేశవ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి సమస్యలు పక్కనపెడితే అతి ముఖ్యమైన సమస్య వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, మార్కెట్లో దళారు ల బెడదతో కనీసం పెట్టుబడి సైతం రాబట్టుకోలేని దుస్థితి రైతన్నది. పం ట పెట్టుబడి కోసం చేసిన రుణాలు ఒకవైపు, ఆదాయం లేక కుటుంబ ఆర్థి క సమస్యలు ఒకవైపు ఇలా రైతుల దుస్థితి నానాటికి దిగజారుతున్నది. ముఖ్యంగా డిమాండ్, సప్లయి అనే తెలియని సుడిగుండాలు మార్కెట్లో దళారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యవసాయ ఉత్పతుల ధరను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా రైతుల ఉత్పతులకు మార్కెట్లో లాభసాటి ధర లభించడం లేదు.

ప్రభుత్వాలు ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదు కొని వారి ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో పరిష్కారాలు చూపలేకపోతున్నాయి. మోదీ నాయకత్వలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం పెంచడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. గత ఐదేండ్లుగా రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలతో ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మరొక వినూత్న ప్రయత్నం ద్వారా అటు రైతుల ఆదాయమే కాకుండా, ఇటు మహిళా సం ఘాల ఆదాయం సైతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయో త్పత్తులను నేరుగా రైతుల నుంచి మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేపించి తిరిగి వాటిని అదే మహిళా సంఘాలతో ప్రాసెస్ అంటే శుద్ధి చేపిం చి కల్తీ లేని నాణ్యమైన ఆహారపదార్థాలుగా బ్రాండ్ తెలంగాణ పేరిట మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణం గా ఏర్పడిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా ఇటీవలి కాలంలో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో సీజన్లవారీగా ఫుడ్ ప్రొసెస్సింగ్ కేంద్రాలను మొదటగా జగిత్యాల జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రెవేశపెట్టి విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వం. గత మామిడి సీజన్లో మహిళాసంఘాల ద్వారా నేరుగా రైతుల నుంచే మామిడి పండ్లను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి హైదరాబాద్‌లోని వివిధ సూపర్ మార్కెట్లకు సరఫరా చేశారు. ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు ఇటు స్వయం సహాయక మహిళలకు సైతం పని తద్వారా ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన కల్తీలేని వస్తువులు లభించా యి. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను స్వయంగా ప్రభుత్వమే మహిళా సంఘాలతో ఏర్పాటుచేపించడం వినూత్న ఆలోచనగా చెప్పుకోవచ్చు. ప్రస్తు తం, సీతాఫలం, తెలంగాణ పిండి వంటల పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నది.

ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా, సీతాఫలాలు విరివిగా దొరికే నారాయణపేట జిల్లాలో రైతులు సేకరించే సీతాఫలాలను సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళాసంఘాల ద్వారా కొనుగోలు చేపించి ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా శాస్త్రీయంగా గ్రేడింగ్ చేసి గింజలు వేరుచేసి వాటి గుజ్జును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మేందుకు ఒప్పందం జరిగింది. దీనిద్వా రా గిరిజన రైతులకు మేలు చేకూరటమే కాకుండా స్థానిక మహిళా స్వయం సహాయక బృందాలు సైతం లబ్ధి పొందుతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు వంద మంది మహిళలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం లో పనిచేస్తూ ఒక్కో మహిళ రోజుకు సుమారు రూ.300 చొప్పున సంపాదిస్తున్నది.

ఇలాంటి వినూత్న ఆలోచలనల ద్వారా మాత్రమే రైతుల ఆదా యం పెరుగుతుందని నిరూపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు, నిజామాబాద్ జిల్లాలో బీడీ పరిశ్రమల్లో పనిచేస్తూ అరకొర ఆదాయంతో సతమవుతున్న మహిళలకు ప్రత్యామ్నాయంగా వారిచే ఫుడ్ ప్రాసెసింగ్ కేం ద్రాలు ఏర్పాటుచేయించి వాటిద్వారా పిండివంటలైన సకినాలు, అప్పా లు, సర్వపిండి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలను తయారుచే యించి వాటిని ఇతర ప్రాంతాలకు, సూపర్ మార్కెట్లకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని కమ్మర్‌పల్లి మండల మహిళా సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎఫ్‌ఏఐ లైసెన్స్ ఇప్పించేందుకు సైతం సెర్ఫ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ లైసెన్స్ వస్తే, వారి ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది.

వీటితోపాటు శీతల పానీయాలు, బత్తాయిరసం, పండ్ల గుజ్జు వంటి ప్రాసెస్‌డ్ ఫుడ్‌ను బ్రాండ్ తెలంగాణ పేరిట విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగినది. రైతుల నుంచి మహిళాసంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పతులను కొనుగోలు చేయడం, వాటిని శుద్ధిచేయడం బ్రాండ్ తెలంగాణ పేరిట విక్రయం వంటి ఏర్పా ట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలిస్తుంది. అలాగే రైతుల నుంచి టమాటా, మిర్చీ వంటి ఉత్పత్తులను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి బ్రాం డ్ తెలంగాణగా మార్కెటింగ్ చేయాలని భావించడం రైతులకు శుభసూచ కం. తద్వారా డిమాండ్, సప్లయి, దళారుల బెడద లేకుండా రైతు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన ఉత్పత్తులను ఈ కేంద్రాలకు లాభసాటిగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వినియోగదారునికి కూడా సరసమైన ధరకే కల్తీలేని నాణ్యమైన వస్తువులు లభించే అవకాశం ఉం టుంది. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే, దళారులు లేకపోవడంతో వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు లభిస్తాయి.

రైతుల ఆదాయం పెంపు, గ్రామీణ మహిళా సంఘాల సాధికారత, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ మహిళా సమాఖ్య ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలద్వారా నాణ్యమైన వస్తువులు బ్రాండ్ తెలంగాణ పేరిట మార్కెట్ చేయ డంలో సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వం వీటిపట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా, తెలంగాణలో ఎక్కువమంది మహిళా సంఘాలకు చెందిన మహిళలు అసంఘటిత రంగానికి చెందినవారు. వారికి నాణ్యతా ప్రమాణాలు, సాం కేతికత వాడకం వంటివాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. మహిళా సమాఖ్య ద్వారా పిండివంటలు, ఇతర ప్రాసెస్ ఫుడ్‌కు భారత ఆహార నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సంస్థ లైసెన్స్ వచ్చేలా చేయాలి. మొదటగా జాతీయస్థాయి మార్కెట్ అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతనే, విదేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టాలి. మార్కెట్ అవకాలు పెరిగేలా దేశీయ రిటైల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి.

బ్రాండ్ తెలంగాణకు ప్రత్యేకమైన లోగోను తయారుచేసి దేశంలో వివిధ ప్రదేశాలలో ట్రేడ్ ఫెయిర్ నిర్వహించాలి. మనదేశంలో సుమారు 50 శాతం వరకు వ్యవసాయ, ప్రాసె స్‌డ్ ఉత్పతుల ఎగుమతులు కేవలం వ్యవసాయ ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి అథారిటీ ద్వారా జరుగుతాయి. ఈ సం స్థకు ఇప్పటికే ఎగుమతుల మార్కెట్, విదేశీ దిగుమతిదారులకు సంబంధించిన సంస్థలు, ఎగుమతికి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై అవగాహన ఉన్నది కాబట్టి బ్రాండ్ తెలంగాణ పేరిట తయారుచేసి మన వ్యవసాయ ప్రాసెస్‌డ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ సంస్థ ద్వారా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తద్వారా మార్కెట్ సులభతరమవ్వడమే కాకుండా ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. బ్రాండ్ తెలంగాణ సత్ఫాలితాలు సాధిస్తే రైతుల ఆదాయం పెంపులో తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా మార్మోగే అవకాశం ఉంటుంది.
(వ్యాసకర్త: యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలో-కామర్స్ విభాగం, ఓయూ)

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles