తిరోగమన విధానాలు


Sun,November 10, 2019 01:15 AM

ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నించకుండా దేశ జనాభాలో ఒక్క శాతం కూడా లేని సంపన్నుల ప్రయోజనాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల కనీస అవసరాలకు ఉపయోగించాల్సిన నిధులను పన్నుల రాయితీ రూపంలో పెట్టుబడిదారులకు ఇచ్చినంతమాత్రాన పరిశ్రమలు స్థాపిస్తారనుకోవడం సరైంది కాదు.

అర్థశాస్త్రంలో అభిజిత్‌ బెనర్జీకి నోబె ల్‌ బహుమతి వచ్చినప్పుడు అమెరికా మురిసిపోయింది. కానీ భారతదేశంలో స్వయం ప్రకటిత దేశభక్తులు చాలా ఇబ్బందికి గురయ్యారు. మలా లాకు నోబెల్‌ బహుమతి వచ్చినప్పు డు పాకిస్థాన్‌లో మతవాదులు ఇదే తరహాఇబ్బందికి గురయ్యారు. క్రైస్తవ దేశాలు పాకిస్థాన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ఆమెకు నోబెల్‌ బహుమతి ఇచ్చారని ఆరోపించారు. భారతీయునికి అంతర్జాతీయ బహుమతి వచ్చినప్పుడు సంతోషించాల్సిన సమయంలో ఇబ్బందికి గురయ్యేంతటి అసౌకర్యం వీరికి ఎందుకు కలిగిందో ఆలోచించాల్సిన విషయం. దశాబ్దకాలంగా ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల గురించి ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ధనవంతులు మిక్కిలి ధనవంతులవుతున్నారు. పేదవారు నిరుపేదలు అవుతున్నారు. మధ్యతరగతి వర్గం క్షీణించిపోతున్నది. ఈ పరిణామం ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకం మాత్రమే గాక పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభానికి దారితీ స్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బిల్‌గేట్స్‌, వారన్‌ బఫె ట్‌ లాంటి వారు కూడా సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా అమలుజరిపి అనారోగ్యాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని నిర్మూలించాలని వాదిస్తున్నారు.

కాలంచెల్లిన పేదరికం నిర్మూలన కార్యక్రమాలను అభిజిత్‌ బెనర్జీ ప్రశ్నించాడు. ప్రపంచం లో 140 కోట్ల మంది పేదరికంలో ఉంటే, 27 కోట్ల మంది మన దేశంలో ఉన్నారు. గత దశాబ్దాల కాలంగా అనుసరించిన ఆర్థికవిధానాల వల్ల పేదరికం చెప్పుకోదగిన రీతిలో నిర్మూలిం చబడలేదని అభిప్రాయపడ్డాడు. పేదలకు సహాయం చేసి వారి నిర్ణయాలను వారే తీసుకునే పరిస్థితిని కల్పించడం ద్వారా పేదరికం త్వరగా నిర్మూలన అవుతుందని అభిప్రాయపడ్డాడు. పేదరిక మూలాలను విశ్లేషించి సరైన పద్ధతులను అవలంబిస్తే ప్రజ లు పేదరికం నుంచి బయటపడుతారని పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంతవరకు ఆచరణలో ఉన్న స్థూల ఆర్థిక సిద్ధాంతాలను కాదని తన పరిశోధనల ద్వారా పేదరిక నిర్మూలనకు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించి నోబెల్‌ కమిటీని ఆకర్షించాడు.

ఒక కేంద్రమంత్రి అభిజిత్‌ బెనర్జీని వామపక్ష వాది అని, మరో నాయకుడు ఇంకా దిగజారి విదేశీ మహిళను రెండవ పెండ్లి చేసుకోవడం ద్వారా నోబెల్‌ బహుమతి పొందాడని ఎగతాళి చేశాడు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత సోషలిజం ప్రపంచంలో తుడిచిపెట్టుకొని పోయిందని సంబురపడేవారు విచారించదగ్గ విషయమేమంటే ఇప్పుడు సోషలిజం చాలా జనరంజకమైనది. ఇటీవల అమెరికాలో జరిగిన సర్వేలో 55 శాతం మంది యువకులు సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నట్లుగా వెల్లడైంది. వామపక్షవాది అంటేనే కుట్ర కేసులు పెట్టి కటకటాల్లో పెట్టి అమెరికాలో సోషలిస్టులు చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పెట్టుబడిదారుల నుంచి ఎన్నికల నిధులను తీసుకొమ్మని ప్రజల నుంచి మాత్రమే ఎన్నికల నిధులను తీసుకుంటామని ప్రకటించి ఇత ర అభ్యర్థులను కూడా అదే దారిలో నడిచేట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గిస్తున్నారు. 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ వ్యతిరేకంగా పోటీ చేసి ప్రజల నుంచి 228 మిలియన్‌ డాలర్లు విరాళాలు సేకరిం చి, 13,206,428 ఓట్లను పొంది అమెరికా దేశ రాజకీయాల ను మలుపు తిప్పిన సోషలిస్టు నాయకుడు బర్ని సాండర్స్‌ ప్రారంభించిన సాంప్రదాయాన్ని చాలామంది అధ్యక్ష అభ్యర్థు లు అనుసరిస్తున్నారు. రాష్ట్రస్థాయి, స్థానిక అభ్యర్థులు కూడా ప్రజల నుంచి మాత్రమే నిధులను తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసి ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరుకుంటున్నారు.

ఇంతటి విప్లవాత్మకమైన పరివర్తనను అమెరికా ఎన్నికల్లో తీసుకువచ్చినది సోషలిస్టుభావాలు కల వ్యక్తులు మాత్రమే. వివిధ కారణాల వల్ల కమ్యూనిస్టు పార్టీలు బలహీనం కావచ్చు కానీ సోషలిస్టు విధానాలు వివిధ రూపాల్లో ప్రజల్లో వ్యాప్తిచెందాయి. సోషలిజాన్ని గుడ్డిగా వ్యతిరేకించే పార్టీలు సోషలి స్టు భావాల నుంచి ఉద్భవించిన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించకుండా పెట్టుబడిదారీ విధానాలను మాత్రమే అనుసరిస్తూ ఏ ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారం లో లేని పరిస్థితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రజాస్వామ్య విధానంలో పెట్టుబడిదారీవ్యవస్థ, సోషలిస్టు వ్యవస్థలోని మౌలిక లక్షణాలను మిళితం చేసుకోకుండా అస్తిత్వం కొనసాగించే అవకాశం లేదు. దార్శనికుడు జవహర్‌లాల్‌ నెహ్రూ భారతదేశంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని మిశ్రమ ఆర్థికవ్యవస్థను రూపొందించి ప్రపంచాని కి అద్భుతమైన ప్రయోగాన్ని అందించాడు. అందుకే భారతదే శం పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్థలో వచ్చిన అనేక సంక్షోభాలను అధిగమిస్తూ నిరంతరం పురోగమిస్తుంది.

మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న విధ్వంసక చర్యలు భారత ప్రజాస్వామ్యానికి, ఆర్థికవ్యవస్థకు, సామాజిక సమగ్రతకు ప్రతిబంధకమై దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారతదేశ చరిత్రలో పెట్టుబడిదారులకు దేశ వనరులను ఇంతగా తాకట్టు పెట్టిన ప్రభుత్వం చరిత్రలో లేదు. ప్రజలు, చెలామణి చేస్తున్న డబ్బును బడా పెట్టుబడిదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన డీమానిటైజేషన్‌ విధానం దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న గ్రామీణ భారత ఆర్థికవ్యవస్థ వెన్ను విరిగిపోయింది. ఆర్థిక అం తరాలను తగ్గించడానికి అట్టడుగువర్గాల ప్రయోజనాల కోసం పథకాలను రూపొందించాలని అభిజిత్‌ బెనర్జీ ప్రతిపాదిస్తున్నా డు. ప్రజా ప్రయోజనం కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పాకులాడే వ్యక్తులు నోబెల్‌ బహుమతి గ్రహీతను విమర్శిస్తున్నారు.

మార్క్సిస్టు సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిన చైనాలో 2000 సంవత్సరం తర్వాత ఆర్థిక అసమానత్వం ఎక్కువగా పెరిగింది. హాన్‌ జాత్యహంకార వర్గం చైనాలో కమ్యూనిస్టు పార్టీని అధీనంలోకి తెచ్చుకొని సైన్యం సహాయంతో రాజకీయ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఆర్థిక అసమానతలకు దోహ దం చేస్తున్నది. చైనాలోని నాలుగు వందల కుటుంబాల ఆస్తి భారతదేశ జీడీపీలో దాదాపు సగభాగం. చైనాలో పది కుటుంబాల ఆస్తి విలువ 246 బిలియన్‌ డాలర్లు కాగా ఆలీబాబా కం పెనీ వ్యవస్థాపకుని ఆస్తులు 38.2 బిలియన్లు. ఇంతటి ఆర్థిక అసమానతలను సృష్టించిన ప్రభుత్వం కూడా మార్క్స్‌ పేరు చెప్పుకొని అధికారంలో కొనసాగుతున్నది. నోబెల్‌ కమిటీ నిర్ణ యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ప్రధాన సమస్య ఆర్థిక అసమానత్వం. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నించకుండా దేశ జనాభాలో ఒక్క శాతం కూడా లేని సంపన్నుల ప్రయోజనాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల కనీస అవసరాలకు ఉపయోగించాల్సిన నిధులను పన్నుల రాయితీ రూపంలో పెట్టుబడిదారులకు ఇచ్చినంతమాత్రాన పరిశ్రమలు స్థాపిస్తారనుకోవడం సరైంది కాదు. దేశభక్తి కంటే లాభాలు మాత్రమే పెట్టుబడుల దిశను నిర్దేశిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులు లాభాలు వచ్చే ప్రాంతాల్లోకి తరలి వెళ్తాయి. ఆర్థికమాంద్యంలోకి నెట్టబడిన భారతదేశంలో ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థికమాంద్యాన్ని మరింత పెంచే విధంగా ఉన్నాయి. ఇండ్లు కొనే స్థోమత లేక డిమాండ్‌ పడిపోయినప్పుడు ప్రజల ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచడానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వం గృహాలను నిర్మించే పారిశ్రామికవేత్తల కు నిధులను సమీకరించడంలో నిమగ్నమైపోయింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నది. ఆర్థిక అసమానత్వం పెరిగిపోతున్నది. దేశ ప్రగతికి తోడ్పడాల్సిన 60 కోట్ల మంది యువకుల సేవలు నిష్ప్రయోజనం అవువుతున్నాయి.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్‌ డీసీ)
Nagender

387
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles