అన్నం


Mon,November 4, 2019 12:47 AM

అన్నం నిజంగా అందమైందే!
ఆకలిగొన్నప్పుడు మరీ..,
ముత్యాలను మెత్తబరిచి
పళ్లెంలో పరిచినట్లు
సృష్టిలోని సువాసనలన్నీ
ఒక్కచోట చేరి
కడుపును ఒక ఆనందదీవిగా మార్చినట్లు
అన్నం తిన్నంక గిన్నె అడుగున
పికాసో చిత్రాలు పేరుకొని
బతుకులోని గూఢార్థాలను
వ్యక్తం చేస్తున్నట్లు..!
చంటిబిడ్డ అన్నప్రాశనం
చేసినప్పటి నుంచి
అనుబంధం ఏర్పడింది దీనితో
అప్పటి నుంచి ఆకలి తీరటమే
ఒక అనివార్య కార్యం..
అయితే అన్నం దొరకటం
అంత సులభం కాదు
రెక్కల కష్టం పిలిస్తే
భూమిలోంచి పొడిచిన
నక్షత్ర శకలాలే మెతుకులు..
అయితే
ఇదంతా తిండి దొరికే వారికే..
ఐదువేళ్లు నోట్లోకెళ్లే వారికే..
కాని అన్నం పుట్టినప్పటి నుంచే
అన్నిరకాల దోపిడీకి గురయ్యే
అన్న బాధితులూ వున్నారు..!
నాకైతే మేఘాలన్నీ
క్షుదాగ్నిలోంచి వెలువడే
ధూమ జ్వాలికల్లా కనిపిస్తాయి..
ఉద్యమాలూ
విప్లవాలూ
అన్నీ అన్నం కోసమే..
అందరికీ అన్నం దొరకాలని
నిరశన వ్రతాలు చేసిన మహాత్ముడు
అన్నం మహత్యం తెలిసినవాడే!
మనం ఆలోచించం గాని
అన్నం పెట్టిన వాడి ముఖంలో
తృప్తిని గమనించండి
సూర్యుడి లేతకాంతి
దానిముందు వెలవెలబోతుంది..!
ఆకలితో వున్నవారికి
కవిత్వం వినిపిస్తే
చీకటిలో చీకటిని కలిపినట్లే
ఇవాళ
మాయింటికి భోజనానికి రండి
తర్వాత కవిత్వం వినిపిస్తాను..!
- డాక్టర్ ఎన్.గోపి

90
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles