చిన్ననాటి పాట


Mon,October 21, 2019 12:34 AM

ఆ బిడ్డ చిన్నప్పుడు
చేతులూపుతూ నడిచేది
ఆ చిన్నకాలువే నది కావాలనుకుంది
ఆ నదే పోటెత్తే ప్రవాహం
ఆ నీటిగుంతే సముద్రం కావాలనుకుంది!
ఆ బిడ్డ చిన్నప్పుడు
అసలు తనది పసితనమనే తెలియదు,
తనకు ప్రతిదీ మనోహరమే
అన్ని ప్రాణులూ ఒకటే..
ఆ బిడ్డకి చిన్నప్పుడు
దేని గురించీ
ఓ అభిప్రాయం లేదు,
మరే అలవాట్లూ లేవు,
తలమీద లేచిఉన్న జుట్టు
ఠీవిగా కాలు మీద కాలు వేసుకునేది
ఉన్నట్టుండి గబగబా పరుగెత్తేది
ఫోటో తీసినా
ఏ భావమూ పలకని ముఖం పెట్టేది..!
ఆ బిడ్డ చిన్నప్పుడు
అన్నీ సందేహ సమయాలే
‘నేను’ నేనుగా ఎందుకున్నాను
నీలానో మరెలానో ఎందుకు లేను
నేను ఇక్కడే ఎందుకున్నాను
మరెక్కడో ఎందుకు లేను
అసలీ కాలం ఎప్పుడు మొదలైంది,
ఆ ఆకాశానికి చివరంచెక్కడుంటది
ఈ సూర్యుని కింద బతుకంతా మాయేనా
చూడటం వినడం వాసన పడటం అన్నీ
ఈ ప్రపంచం భ్రమలేనా..!
జనాల్నీ దైనందిన ఘటనల్ని చూస్తే
మరో ప్రశ్న, మరో ప్రశ్న..
చెడనేది నిజంగా ఉంటదా,
ఉంటే గింటే ఆ ‘చెడు’ ఎవరు చేస్తరు..?
నేననే ఈ నేను ఎవరు,
రాకముందు ఈ నేను ఉనికిలో లేదు కదా
ఏదో ఒకరోజు
ఆనాటి నేను ఎవరు,
ఇకపై నేనెవరో..?
ఆ బిడ్డ చిన్నప్పుడు
అన్నమో, పప్పో, పాలకూరో
ఉడికిన కాలీఫ్లవరో
ఏదైనా బోసినోట నమల్లేక జారి
గొంతుకడ్డం పడేది
ఇప్పుడవన్నీ చక్కగా తినేస్తుంది
తినాలి కాబట్టి తినడం కాదు..
ఆ బిడ్డ చిన్నప్పుడు
అందరిలాగే తానూ
ఆ వింత శయ్యమీదే కన్ను తెరిచింది
ఇప్పుడు
అదృష్టవంతుల్లోనే కనపడే అందం
అప్పుడందరిలోనూ కనిపించేది..
అప్పుడు స్వర్గంమంటే
స్పష్టమైన తియ్యటి దృశ్యం
ఇప్పుడది అంచనా మాత్రమే
అదేదీ లేదన్న ఆలోచనే
ఒక మింగుడుపడని
వణుకుపుట్టించే అంశం..
ఆ బిడ్డ చిన్నప్పుడు
ఆటంటే అమితానందం
ఈనాటికీ అదే తహతహ
మార్పంతా ఈసారి గురిమాత్రం
ఆడేతీరు మీదో దాని ఫలితం మీదో..
ఆ బిడ్డకి చిన్నప్పుడు
రుచిగా ఏ జామపండో చాక్లెట్టో కావాలి..
దోసిలి నిండా కమ్మని ద్రాక్ష పండ్లుంటేనా..
ఇప్పటికీ అంతే
తాజా పల్లిపలుకుల్ని చూస్తేనే నోరూరేది
ఇప్పటికీ అంతే..
అలా ఆ కొండ కొసకు ఎక్కాలని ఆశ
ఆపై అంతకన్నా పెద్ద కొండ కోసం
వదలని కోరిక..
అలాగే ఓ పట్టణం చూశాక
ఇంకా పెద్ద పట్టణం చుట్టాలని ఉబలాటం
ఇప్పటికీ అంతే..
ఆ చెట్టు చిటారుకొమ్మ
రేగుపండ్లు అందుకోవాలని
ఇంకా తెగని తహతహ
కానీ ఎక్కాలంటేనే
ఇతరుల ముందు ఎక్కడలేని సిగ్గు..
ఆ సిగ్గరితనమూ అలానే ఉంది
పొద్దుపొద్దున తొలి మంచు ముత్యాలను
దోసిట పట్టాలని ఎదురుచూపు
ఇప్పటికీ అది రెప్పల కిందే భద్రంగా..
ఆ బిడ్డ చిన్నప్పుడు
చెట్టుకొమ్మల మీదికి బల్లెంలా విసిరిన కర్ర
కొమ్మలకి చిక్కుకుని
ఈనాటికీ అక్కడే వేలాడుతుంది...


మూలం: పీటర్‌ హాండ్కే
అనువాదం: వఝల శివకుమార్‌

130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles