బంగ్లా మైత్రి


Tue,October 8, 2019 01:05 AM

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉచ్ఛస్థాయిలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్ఫుటింపజేస్తున్నది. హసీనా 2008లో అధికారానికి వచ్చిన నాటినుంచి భారత్‌తో సాన్నిహిత్యం బలపడుతూనే ఉన్నది. గురువారం నుంచి ఆదివారం వరకు భారత్ పర్యటించిన హసీనా మొదట ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొని పెట్టుబడుల కు ఆహ్వానం పలికారు. భారత్ నుంచి మరింతగా పెట్టుబడులను రావాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ సదస్సు అనంతరం ద్వైపాక్షిక చర్చ మొదలైంది. ఇరుపక్షాల మధ్య ఏడు ఒప్పందాలు కుదరడ మే కాకుండా, మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోని ఈశాన్య రాష్ర్టాలకు ఎల్‌పీజీ సరఫరా చేయడం ఈ ప్రాజెక్టులలో ఒకటి. జలవనరులు, సంస్కృతి, విద్య, తీర గస్తీ మొదలైన అంశాలపై ఒప్పందాలు ద్వైపాక్షిక కుదిరాయి. ఏడాది కాలంలో పన్నెండు ప్రాజెక్టులను ప్రారంభించినట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య అణుశక్తి రంగంలో కూడా సహకారం నెలకొన్నది. ద్వైపాక్షిక సంబంధాలు అనూహ్య స్థాయిలో అతివేగంగా బలపడుతున్నాయనేది కాదనలేని వాస్తవం. వేర్పాటువాదులు బంగ్లాదేశ్‌ను స్థావరంగా చేసుకొని భారత్‌లో కార్యకలాపాలు సాగించే పరిస్థితి ఇప్పుడు లేదు. 2015లో సరిహద్దు ఒప్పందంపై సంతకాలు చేయడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మి ది బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్‌కు బంగ్లా పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. భారత్‌కు వచ్చే పర్యాటకులలో ఐదో వంతు బంగ్లాదేశీయులే.


భారత్ కూడా లౌకికత్వం, ప్రజాస్వామ్యం విలువలు ప్రాతిపదికగా బంగ్లాదేశ్‌లో సంబంధాలను దృఢతరం చేసుకోవాలె. రెండు దేశాల మధ్య విభేదాలను స్నేహ పూర్వకంగా పరిష్కరించుకోవాలె. చిన్నదేశమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చైనా ప్రభావం పెరుగుతుంది. కొన్నేండ్లుగా నేపాల్‌తో స్నేహ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఆ దేశం చైనా వైపు కొంత మొగ్గింది. శ్రీలంక, మాల్దీవ్స్ ఇప్పుడిప్పుడే మళ్ళా భారత్‌కు అనుకూలంగా మారాయి. పాకిస్థాన్ తో వైషమ్యం తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇతర ఇరుగుపొరుగు దేశాల విషయంలో భారత్ చాతుర్యంతో వ్యవహరించాలె.


భారత్‌లో చికిత్సకోసం వచ్చే రోగులలో సగం మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారే. రెండు దేశాల మధ్య రైలు, బస్సు మార్గాలు ఇరు దేశాలకు లబ్ధికరంగా మారాయి. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నంత మాత్రాన భారత్, బంగ్లాదేశ్ మధ్య విభేదాలు లేవని కాదు. కాకపోతే రాజకీయ నాయకత్వాల మధ్య ఉన్న సౌహార్ద్రత ఈ చికాకులను అధిగమిస్తున్నది. రెండు దేశాల మధ్య యాభై నాలుగు నదులున్నాయి. జల వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తీస్తా నదీజలాల ఒప్పందం 2011 లోనే కుదిరినప్పటికీ పశ్చిమ బంగ్లాదేశ్ అభ్యంతరం వల్ల ముందడుగు పడటం లేదు. గంగా- పద్మా నదుల జల పంపకం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. రోహింగ్యాల విషయంలోనూ చర్చలు సాగుతున్నాయి. రెండు దేశాల సంబంధాలను దెబ్బకొట్టగలిగే తీవ్రమైన అంశం అస్సాంలో తయారుచేసిన జాతీయ పౌర పట్టిక. ఇది తమ ఆంతరంగిక అంశమని విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ ప్రకటించారు. ఈ వ్యాఖ్య బంగ్లాదేశ్‌కు కొంత ఊరట కలిగించింది. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళినప్పుడు ఈ అంశాన్ని హసీ నా ప్రధాని మోదీతో ప్రస్తావించారు. అయితే హోంమంత్రి అమిత్ షా ప్రకటనలు బంగ్లాదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లక్షలాదిమంది పేర్లు జాతీయ పౌర పట్టికలో లేకపోవడం, వారిని దేశం నుంచి పంపిస్తామనే రీతిలో అమిత్ షా మాట్లాడటం పట్ల బంగ్లాదేశ్‌లో చర్చ సాగుతున్నది. బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్షాల ఒత్తిడిని హసీనా తట్టుకోవడానికి భారత్ నుంచి స్పష్టమైన హామీని కోర డం సహజం. భారత బంగ్లాదేశ్ అనుబంధం చారిత్రకంగా ముడిపడి ఉన్నది. బంగ్లాదేశ్ అవతరణకు భారత్ తోడ్పాటు అక్కడి ప్రజలు మరిచిపోలేనిది.

అయితే ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా ఉండే భారత్‌ను ఇరకాటంలో పెట్టడం అమెరికా అజెండాగా ఉండేది. బం గ్లాదేశ్‌లో మతవాదుల ప్రమేయం, సైనిక పాలనల మూలంగా భారత్‌తో వైషమ్యం ఏర్పడ్డది. అయినా మిగతా దేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మూలంగా ఇబ్బంది లేదు కానీ భారత్ చుట్టుపక్కల చైనా ప్రభావం గణనీయంగా పెరిగిపోతున్నది. మతవాదుల ప్రాబల్యం కూడా బంగ్లాదేశ్‌లో పెరిగిపోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్, బంగ్లా స్నేహం చెక్కుచెదరడం లేదు. లౌకికవాద, ప్రజాస్వామ్య భావనలు గల నాయకురాలైన హసీనాకు భారత్‌కు అనుకూల నాయకురాలిగా పేరున్నది . హసీనా బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబ్ ఉర్ రహ్మన్ కుమార్తె. అందువల్ల భారత్‌తో మైత్రి పటిష్టంగా ఉన్నది. భారత్ కూడా లౌకికత్వం, ప్రజాస్వామ్యం విలువలు ప్రాతిపదికగా బంగ్లాదేశ్‌లో సంబంధాలను దృఢతరం చేసుకోవాలె. రెండు దేశాల మధ్య విభేదాలను స్నేహ పూర్వకంగా పరిష్కరించుకోవాలె. చిన్నదేశమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చైనా ప్రభావం పెరుగుతుంది. కొన్నేండ్లుగా నేపాల్‌తో స్నేహ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఆ దేశం చైనావైపు కొంత మొగ్గింది. శ్రీలంక, మాల్దీవ్స్ ఇప్పుడిప్పుడే మళ్ళా భారత్‌కు అనుకూలంగా మారాయి. పాకిస్థాన్ తో వైషమ్యం తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇతర ఇరుగుపొరుగు దేశాల విషయంలో భారత్ చాతుర్యంతో వ్యవహరించాలె. ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలే భారత్‌ను బలోపేతం చేస్తుంది. హసీనా పర్యటన సందర్భంగా మోదీ వ్యాఖ్యానించినట్టు భారత్- బంగ్లా మైత్రి ప్రపంచానికి ఆదర్శం కావాలె.

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles