రాజనీతిజ్ఞుడు

Sat,September 7, 2019 01:46 AM

తెలంగాణ సమాజంతో ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకున్న గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు చెప్పవలసి రావడం ఇక్కడి ప్రజల హృదయాలను ఎంతో బాధిస్తున్నది. తెలంగాణ ప్రాంతం ఎంతో క్షోభను అనుభవిస్తున్న దశలో ఆయన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సమాజం ఎన్నో సంక్షోభాలను అధిగమించి పరిష్కారం దిశగా నడక సాగించడంలో ఆయన సహకారం మరువలేనిది. తెలంగాణ అవతరించిన తరువాత కూడా సంరక్షకుడి మాదిరిగా అండగా నిలువ డం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న తొమ్మిదిన్నరేండ్ల కాలం అత్యంత సంక్లిష్టమైనది. అయినా ఆయన అనుభవం, విజ్ఞత, చతురత కలబోసి గవర్నర్‌ పదవిని నిర్వహించిన తీరు అసాధారణమైనది.

తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలనేది ఉద్యమనాయకుడు కేసీఆర్‌ పంథా. రాష్ట్ర రాజ్యాంగాధినేతగా గవర్నర్‌ నరసింహన్‌ అభిలాష కూడా అదే. పార్లమెంటరీ పరిధిలోనే సమస్యలకు పరిష్కారాలు లభించినప్పుడు, హింసావిధ్వంసాలకు తావుండదనే ప్రజాస్వామిక స్ఫూర్తి ఇరువురిది. ఉద్యమకారులపై తూటాలు ప్రయోగించకూడదని ఆదేశించడంలోనే గవర్నర్‌ నరసింహన్‌ ప్రజాస్వామిక ద్పక్పథం వ్యక్తమవుతున్నది. అత్యంత సౌమ్యుడు గవర్నర్‌ నరసింహన్‌ అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత గౌరవాభిమానాలు. నరసింహన్‌ కూడా కేసీఆర్‌ పట్ల అదేరీతిలో ఆదరాభిమానాలను ప్రదర్శించారు. ఈ గవర్నర్‌-ముఖ్యమంత్రి అపూర్వ సహచర్యం దేశానికి ఆదర్శప్రాయం. గవర్న ర్‌, ముఖ్యమంత్రి కలివిడిగా ఉన్నప్పుడు పరిపాలన, అభివృద్ధి సజావుగా సాగుతాయనడానికి తెలంగాణ రాష్ట్రం దృష్టాంతంగా నిలుస్తుంది.

వృత్తి జీవితాన్ని, తదనంతర ఉన్నత బాధ్యతలను అనేక ఒత్తిడులతో గడిపిన నరసింహన్‌ ఇక విశ్రాంతి తీసుకోవాలని, దైవచింతనలో గడుపాలని కోరుకోవడం సహజం. కానీ ఆయన విస్తృత అనుభవాన్ని ఇంకా దేశసేవ కోసం వినియోగించుకోవాలని అనేకమంది అభిమానంతో కోరుకుంటున్నారు.అర్థవంతమైన జీవితానికి పర్యాయపదంగా నిలిచిన నరసింహన్‌ను మరిన్ని ఉన్నత పదవులు వరించాలని, తన శక్తియుక్తులు మరింతకాలం సమాజానికి ఉపయోగపడాలని, ఇందుకు ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష.


గవర్నర్‌ పదవి ఎంతో గౌరవనీయమైన రాజ్యాంగ విధి. అయినా ఎంతోమంది సీనియ ర్‌ రాజకీవేత్తలు కూడా ఈ పదవి చేపట్టగానే తమ పరిధిలో వ్యవహరించలేక వివాదాలకు కేంద్ర బిందువులైన ఉదంతాలు స్వతంత్ర భార త చరిత్రలో అనేకం ఉన్నాయి. కానీ నరసింహన్‌ మాత్రం అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా కత్తిమీద సాములాంటి బాధ్యతలను అతి జాగ్రత్తగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, రాష్ట్ర విభజన అనివార్యమైన దశలో ఆయన గవర్నర్‌గా రంగప్రవేశం చేశారు. కేంద్రం ఇక్కడి పరిస్థితులను గమనిస్తూ నేరుగా, నేర్పుగా వ్యవహరిస్తున్న దశ అది. ఈ దశలో గవర్నర్‌ తన ఆధిపత్యాన్ని ఒకింత ప్రదర్శించడానికి ఆస్కారం ఉం డేది. అయినా ఎక్కడా ఆ ప్రయత్నం చేయలేదు సరికదా, తెరవెనుక పోషించిన కీలక పాత్రను కూడా పెద్దరికం కోసం బయట పెట్టుకోకుండా హుందాగా నడుచుకున్నారు.

రాష్ట్రంలో వివిధ రాజకీయవర్గాలను సంప్రదిస్తూ ఢిల్లీలోని పెద్దల కు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పడంలో ఆయన ఎంతో నిజాయితీగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమాన్ని, క్షేత్రస్థాయి వాస్తవాలను కప్పిపుచ్చి కేంద్రాన్ని, కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించే కుత్సితులకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహారశైలి అవరోధంగా తోచి కొన్ని కువిమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా విభజన చట్టంలోని కొన్ని అంశాల మూలంగా రెండు రాష్ర్టాల గవర్నర్‌గా కొన్ని అధికారాలు చెలాయించే అవకాశం ఉండేది. ఇటువంటి పరిస్థితులను కోరుకునే దుష్టశక్తులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి పొంచి ఉన్నాయి. అయినా పరిస్థితులకు లొంగిపోకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు నరసింహన్‌.

నరసింహన్‌ తన సుదీర్ఘ వృత్తి జీవితంలో భిన్నమైన బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఒక్కటి ఆయనకు సవాలు వంటిదే. విదేశీ దౌత్య కార్యాలయంలో ఫస్ట్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా విధులు నిర్వహించినా నరసింహన్‌ ఆయా పదవులకే గౌరవం తెచ్చారు. ఆ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ పదవి వెతుక్కుంటూ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు దశలో రాష్ట్రపతి పాలన కొద్దికాలం పాటే అయినా నరసింహన్‌ దక్షతకు పరీక్షలు పెట్టింది. అనుభవజ్ఞుడు కనుకనే గవర్నర్‌ పదవిని అత్యంత అలవోకగా నిర్వహించారు. తెలంగాణలో ప్రజలతో కలిసి మమేకమైనా రాష్ట్రప్రభుత్వాన్ని అధిగమించిన భావన రాకుండా జాగ్రత్త పడ్డారు.

పార్లమెంటరీ వ్యవస్థలో గవర్నర్‌ పాత్ర ఎట్లా ఉండాలె, ముఖ్యమంత్రితో సంబంధాలను ఎట్లా నెరపాలె, కేంద్రానికి రాష్ర్టానికి వారధిగా వ్యవహరించవలసిన తీరేమిటి అనే విషయాలను రాజనీతివేత్తలు, రాజనీతి శాస్త్ర విద్యార్థులు తెలుసుకోదలుచుకుంటే గవర్నర్‌గా నరసింహన్‌ పదవీకాలాన్ని అధ్యయనాంశం గా చేపట్టవచ్చు. వృత్తి జీవితాన్ని, తదనంతర ఉన్నత బాధ్యతలను అనేక ఒత్తిడులతో గడిపిన నరసింహన్‌ ఇక విశ్రాంతి తీసుకోవాలని, దైవచింతనలో గడుపాలని కోరుకోవడం సహజం. కానీ ఆయన విస్తృత అనుభవాన్ని ఇంకా దేశసేవ కోసం వినియోగించుకోవాలని అనేకమంది అభిమానంతో కోరుకుంటున్నారు. అర్థవంతమైన జీవితానికి పర్యాయపదంగా నిలిచిన నరసింహన్‌ను మరిన్ని ఉన్నత పదవులు వరించాలని, తన శక్తియుక్తులు మరింతకాలం సమాజానికి ఉపయోగపడాలని, ఇందుకు ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష.

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles