అద్భుత ఘటనకు అక్షరరూపం

Mon,September 2, 2019 01:06 AM

p-ashok-kumar
కాలం.. చరిత్రలోని కొన్నిపేజీలను శిలాక్షరాలతో రాసుకుంటుంది. కొన్ని ఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటుంది. అవసరాలకనుగుణంగా ఉద్యమాల ను నిర్మించుకుంటుంది. నాయకులను తానే తయారు చేసుకుంటుంది. గతంలోని గాయాల సలపరింత వర్తమానాన్ని దిశానిర్దేశం చేస్తే, భవిష్యత్తు దానిమీద పునాదులను వేసుకుంటుంది. అవి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. అలా.. కాలం రాసుకున్న రాతలే తెలంగాణ ఉద్యమ చరిత్ర. వేసుకున్న మైలురాయే మిలియన్ మార్చ్. తెలంగాణ ఉద్యమంలో ఇదొక కీలక మలుపు. యావత్ తెలంగాణను ఉత్తేజం చేసిన భాస్వరం. నవంబర్ 29న కేసీఆర్ నిరాహారదీక్షతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగింది. మలిదశ ఉద్యమం లో తొలి అమరుడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్ట య్యల ఆత్మబలిదానంతో తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమన్నది. బిల్లు పెడితే మద్దతిస్తామని అన్నిపార్టీల ప్రకటన, డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ప్రకటన, 23 నాడు చిదంబరం మరో ప్రకటన, కొనసాగిన సీమాంధ్ర నకిలీ ఉద్యమం, డిసెంబర్ 24 నాడు తెలంగాణలోని అన్ని ప్రజా సంఘాలు పార్టీలతో జేఏసీ ఏర్పాటు, ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. అప్పటి నుంచి ఉద్యమం పల్లెపల్లెకు పాకింది. ఊరూ రా జేఏసీలు ఏర్పడినాయి. తర్వాత కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఏడాది కాలయాపన చేసిన కమిటీ తెలంగా ణ ఇయ్యాలని కాని వద్దనికాని చెప్పకుండా ఎలా అణిచి వేయవచ్చో చెప్పి చేతులు దులుపుకున్నది. అదిగో అప్పుడే తెలంగాణ మరోసారి అగ్ని గుండమైంది. నిర్మ ల్ మహాసభలో కేసీఆర్ పిలుపుతో ఊరూరా దీక్షా శిబిరాలు ఏర్పడినాయి. 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 5 వరకు సహాయ నిరాకరణ జరిగింది. మార్చి 10న మిలియన్ మార్చ్ నిర్ణయం జరిగింది.

అసలు కథ అక్కడే మొదలైంది. మిలియన్ మార్చ్ మీద కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నది. పిల్లలకు పరీక్షలున్నాయని, విధ్వంసం చోటుచేసుకుంటుందని, అసెంబ్లీ సమావేశాలున్నాయని ఏవో కారణాలు చెప్పి అనుమతి నిరాకరించింది. కనీసం నిరసన తెలుపుదామన్నా అనుమతి ఇవ్వలేదు. ట్యాంక్‌బండ్ మీదికి ఎవరూ రావద్దని మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదని వస్తే క్రిమినల్ కేసులు తప్పవని ప్రభుత్వం భయపెట్టింది. దారులన్నింటిని దిగ్బం ధం చేసింది. వేలాదిమంది పోలీసులను కాపలా పెట్టింది. ట్యాంక్‌బండ్ చుట్టూ యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. పలు రైళ్లను, గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక్కడే తెలంగాణ గుండె మండింది. వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణకడ్డెవ్వడు అని గొంతెత్తి కదం తొక్కింది. సొంత గడ్డమీద నిరసన తెలుపుకునే హక్కులేదా అని ప్రశ్నించింది. మిలియన్ మార్చ్ చేసి తీరుతామని తెగేసి చెప్పింది. అప్పటికి రాజకీయపార్టీలన్నీ తక్కెట్లో కప్పల్లా ఉన్నాయి. కొన్ని గోడమీది పిల్లులు జనం మధ్యలో ఒకమాట, అధిష్ఠానం ముందు మరోమాట మాట్లాడుతున్నాయి. సాధారణ జనం మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ట్యాంక్‌బండ్ ఎక్కుడే అని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వం రెండురోజులముందునుంచే పల్లెల్లో నాయకులను ఉద్యమకారులుగా జేఏసీ లీడర్లను అనుమానమున్న ప్రతి ఒక్కరిని లక్షలాదిగా ఎక్కడివారిని అక్కడనే అరెస్టు చేసింది. మార్చి 9 రాత్రి నుంచే తెలంగాణ పల్లెల నుంచి పట్నం వచ్చే ప్రతి బస్సును రైలును కారును చెక్ చేసింది. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసింది. చాలాచోట్ల వాహనాలను బస్సులను దారి మళ్లించిది.

అడుగడుగునా ఆంక్షలతో నిర్బంధించింది. రహదారులవెంట బారికేడ్లను నాటింది. ఇనుప కంచెలు వేసిం ది. దేశం బార్డర్‌లో లేనంతగా కట్టుదిట్టం చేసింది. ఇన్నిచేశాం కదా ఇంకేం వస్తరులే అనుకున్నది. అవకా శం కోసం ఎదురుచూస్తున్న సీమాంధ్ర మీడియా సం దు దొరికిందని మిలియన్ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం మొదలెట్టింది. మధ్యాహ్నం పన్నెండు వరకు ఎక్కడా ఏ అలికిడి లేదు. పన్నెండు దాటగానే మొదలైంది జన ప్రవాహం. బారికేడ్లను దూకి ఇనుప కంచెలను దాటి పోలీసు వలయాలను ఛేదించుకొని గుంపులు గుంపులుగా జనం ట్యాంక్‌బండ్ వైపు దూసుకొచ్చారు. పోలీసులు తేరుకునేలోపే అది జన సముద్రమైంది. అక్కడున్నవారం తా నిర్బంధాన్ని ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిని ఇనుపకంచె గీరుకొని రక్తమోడుతున్నవారే. వారికి కారిన రక్తం కొట్టిన దెబ్బలు మండుతున్న ఎండ, చినిగిన బట్టలు ఇవేవి కనిపించలేదు. లక్ష్యాన్ని ముద్దాడినం అంతే. అదొక్కటే కనిపించింది. గెలిచామన్న సంతృప్తి. మిలియన్ మార్చ్ ట్యాంక్‌బండ్ మీద ఐదారు గం టలే జరుగొచ్చు. కాని అది యావత్ దేశానికి ఇచ్చిన సంకేతం అంతా ఇంతా కాదు. పాలకుల విర్రవీగుడు తనానికి చెక్ పెట్టింది. ప్రజా ఉద్యమాలదే అంతిమ విజయమని నిరూపించింది. అన్నింటికిమించి తెలంగా ణ ప్రజలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తర్వాత జరిగిన ఉద్యమరూపాలకు అనేక నిరసనలకు కొత్త ఊపు ను చూపును ఇచ్చింది. మిలియన్‌మార్చ్ విఫలమై ఉంటే ఉద్యమం మీద మరింత ఉక్కుపాదం మోపేవారు. అది అసలే ఆత్మహత్యల కాలం. గుండె చెదిరి ఎందరో యువకులు ఆత్మబలిదానం చేసుకునేవారు. అవకాశం కోసం కాసుక్కూసున్న సీమాంధ్ర నాయకు లు తెలంగాణవాదమే లేదని అబద్ధపు ప్రచారం చేసేవారు. ఇలా అందరి నోళ్లు మూయించిన మిలియన్ మార్చ్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

ముఖ్యంగా అప్పుడు పల్లెలు ఎలా ఉండేవి? ఉద్య మ నిర్మాణం ఎలా జరిగింది? పల్లెల్లో అన్నిపార్టీల నాయకులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు? ఉద్య మకాలంలో సాధారణ జనం మానసికస్థితి ఎలా ఉం డేది? వారి ఆలోచనలు ఎలా సాగేవి? నాయకులు ఇక్కడ ఒక పిలుపునిస్తే అక్కడ ఎలా స్పందించేవారు? పోలీసుల నిర్బంధం ఎలా సాగింది? సాధారణ పౌరు లు తమ నిరసనను ఎలా తెలిపారు? ఒక్క పిలుపుతో రైలు పట్టాలపైకి, రోడ్లపైకి జనం ఎలా తరలివచ్చేవా రు.. వీటితో పాటు కుల, మత, వర్గ భేదం లేకుండా సబ్బండ జనం ఎలా ఏకమయ్యారన్న విషయాలను చర్చించిన నవల లాంగ్ మార్చ్. పల్లెటూరి రైతు మిలియన్ మార్చ్ పిలుపుతో ట్యాంక్‌బండ్ చేరుకోవాలనే అతని బలమైన కోరికను తీసుకొని మిలియన్ మార్చ్‌కు ముందు తర్వాత ఉద్యమ నిర్మాణం పరిణామాలను చర్చించిందీ నవల. ఒక అత్యద్భుతమైన ఘటనను అక్షరీకరించాలని చేసి న ప్రయత్నమే ఈ లాంగ్ మార్చ్.

‘లాంగ్ మార్చ్’ పరిచయ సభ

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ నేపథ్యంగా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ రచించిన లాంగ్‌మార్చ్ నవల పరిచయ సభ హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 2019 సెప్టెంబర్ 8న ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ పరిచయ సభలో అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, కె.శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, టంకశాల అశోక్, మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొంటారు. రచయిత స్పందన ఉంటుంది.

- పెద్దింటి అశోక్ కుమార్
94416 72428

101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles