కల్లోల హాంకాంగ్


Wed,August 14, 2019 12:39 AM

హాంకాంగ్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రజాందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆందోళనకారులు ఆక్రమించటంతో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. నల్లటి వస్ర్తాలు ధరించి, కండ్లకు గంతలు కట్టుకొని వేలాదిమంది తిష్ట వేయటంతో విమానాశ్రయమంతా నల్లరంగు పులుమున్నట్లుగా మారిపోయింది. కొన్నిరోజుల కిందట పోలీసులు దాడిచేసి కొట్టడంతో ఓ మహిళ కన్ను కోల్పోయింది. ఈ దాడికి నిరసనగా ఆందోళనకారులంతా ఒక కన్నుకు నల్లటి రిబ్బన్‌తో చుట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు. కొన్నిరోజులుగా ఆందోళనలు మరింత ఉధృతమై సాధారణ కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు లాయర్లు కూడా ఆందోళనకారులతో చేతులు కలుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో హాంకాంగ్‌లో పాలనావ్యవస్థతో పాటు వర్తక వాణిజ్యాలు కూడా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌లో నేరాలకు పాల్పడ్డ వారిని చైనాకు అప్పగించే బిల్లుపై హాంకాంగ్ పాలనాధికారాలు నిర్వహించే చీఫ్ సీఈవో కేరీ లామ్ సంతకం చేయటంతో ఆందోళనలు ఆరంభమయ్యాయి. చైనా పాలకులు కక్షపూరితంగా వ్యవహరించటానికే ఈ బిల్లు అని హాంకాంగ్ వాసులు అనుమానిస్తున్నారు. ఒక దేశం రెండు వ్యవస్థలు అనే స్ఫూర్తికి భిన్నంగా చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే హాంకాంగ్ ప్రజలది సుదీర్ఘకాలంగా పరాధీనతే. ఈ ఆధునిక శతాబ్దంలో కూడా హాంకాంగ్ సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నోచుకోలేదు.


ఆసియా వాణిజ్య కూడలిగా, ఆర్థిక కేంద్రంగా భాసిల్లుతున్న హాంకాంగ్‌లో నానాటికీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుండటంతో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. మొదట నేరస్తులను చైనాకు అప్పగించే బిల్లును వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేసిన ఆందోళనకారులు రోజులు గడుస్తున్నా కొద్దీ కొత్త డిమాండ్లను ముందుకు తెస్తుండటం గమనించదగింది. నేరస్తులను అప్పగించే బిల్లును వెనక్కితీసుకుంటున్నామని సీఈవో కేరీ లామ్ ప్రకటించినప్పటికీ ఆందోళనలు ఆగటం లేదు.


తరతరాలు రాజవంశాల పాలనలో మగ్గిన హాంకాంగ్ పారిశ్రామిక విప్లవానంతరం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది. క్వింగ్ రాజవంశీయుడైన రాజు, బ్రిటిష్ వారి మధ్య కుదిరిన నాన్‌కింగ్ ఒప్పందం ఫలితంగా హాంకాంగ్ 1842 నుంచి దశలవారీగా బ్రిటిష్ వారి చేతుల్లోకి చేరడం మొదలైంది. 1898లో చైనా హాం కాంగ్‌ను బ్రిటన్‌కు 99 ఏండ్లు లీజుకు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన అనంతరం 1984లో బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు 1997 జూలై 1 తర్వాత హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్తుంది. పాలనాధికారం చైనా చేతుల్లోకి వెళ్లిన నాటి నుం చి హాంకాంగ్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 1950 దశకంలో జరిగిన కొరి యా యుద్ధం, చైనాలో జరిగిన గొప్ప ముందం జ, సాంస్కృతిక విప్లవకాలంలో ఆయా దేశాలనుంచి హాంకాంగ్‌లోకి పెద్దఎత్తున వలస కొనసాగింది. దీంతో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింది. సాంఘిక అశాంతి నెలకొన్నది. హాం కాంగ్ కోర్టుల్లో కూడా చైనా ఆధిపత్యం కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆం దోళనలు చెలరేగాయి. దేశ జనాభాలో సగానికి పైగా 60 లక్షల మంది రోడ్లపైకి వచ్చి చైనా ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా కదంతొక్కారు. సరిగ్గా ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు ఆందోళనబాట పట్టడం గమనార్హం. ఆసియా వాణిజ్య కూడలిగా, ఆర్థిక కేంద్రంగా భాసిల్లుతున్న హాంకాంగ్‌లో నానాటికీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుండటంతో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.

మొదట నేరస్తులను చైనాకు అప్పగించే బిల్లును వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేసిన ఆందోళనకారులు రోజులు గడుస్తున్నా కొద్దీ కొత్త డిమాండ్లను ముందుకు తెస్తుండటం గమనించదగింది. నేరస్తులను అప్పగించే బిల్లును వెనక్కితీసుకుంటున్నామని సీఈవో కేరీ లామ్ ప్రకటించినప్పటికీ ఆందోళనలు ఆగటం లేదు. ప్రభుత్వ పాలనా కార్యాలయాలను, చట్టసభలను గతంలోనే ఆక్రమించి శాంతియుతంగా నిరసనలు తెలిపిన ప్రజలు ఇప్పుడు ఏకంగా విమానాశ్రయాలను చుట్టిముట్టి పోలీసులపై దాడులకు దిగుతున్నారు. తిరుగుబాటు-విముక్తి-స్వేచ్ఛ నినాదాలతో సంపూర్ణస్వేచ్ఛా స్వాంతంత్య్రాల కోసం పట్టుపడుతున్నారు. ఇదే అదనుగా చైనా పాలకులు కూడా కఠిన వైఖరి అవలంబించే తీరు కనిపిస్తున్నది. ఆందోళనకారుల్లో టెర్రరిస్టులున్నారని చైనా మీడియా ప్రచారానికి దిగుతున్నది. గతంలో స్వేచ్ఛ పేరిట చైనాలోని తీనాన్మెన్ స్కైర్ లో విద్యార్థులను ఊచకోత కోసిన చైనా పాలకుల దమననీతిని ప్రపంచం మరిచిపోలేదు. ఇప్పు డు కూడా హాంకాంగ్ ఉద్యమకారులను టెర్రరిస్టులుగా ముద్రవేసి ఎలాంటి అణిచివేత విధానాలకు తెగబడుతారోననే భయాలు సర్వత్రా ఉన్నాయి. ఇప్పటికే వందలాదిమంది ఆందోళనకారులను అరెస్టు చేసి నిర్బంధించింది. మరికొంత మందిని ఎక్కడ నిర్బంధించారో కూడా చెప్ప టం లేదు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారుల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అంతర్జాతీయంగా అనేక దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నవి. ఇప్పటికైనా హాంకాంగ్ ప్రజల న్యాయమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాల హక్కును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి, వారికి అండగా నిలువాలి. ముఖ్యంగా చైనా తన ఆధిపత్య విధానాలను విడనాడి హాంకాంగ్ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి.

199
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles