విశ్వ చైతన్యం


Tue,November 1, 2016 01:48 AM

గాలికి రూపం లేదు. కానీ దాని ఉనికి మన ప్రాణంలో ఉంది. మన భావాలకనుగుణంగా భగవంతుని రూపాన్ని ఊహించగలం. కానీ భగవత్తత్తాన్ని రూపకల్పన చేయడం అసాధ్యం. అది అనుభవకతేద్యమైన అపూర్వ తత్తం. అచేతనమైన సృష్టికి ప్రాణం పోసిన చైతన్యం. చైతన్యమనే శక్తి ప్రపంచాన్ని జాగృతపరచి కాంతివంతం చేస్తుంది. నిర్జీవమైన అంతఃశక్తిని ఉత్తేజపరుస్తుంది. ఆ తేజో కాంతి విశ్వమంతా వ్యాపించి జీవన పరమార్థాన్ని ఆపాదిస్తుంది. అదితి విరాజిల్లుతుంది.


భగవంతుని పరాశక్తి, చైతన్యానికి ప్రతీక, లోకాలను పరిపాలించే భావప్రభంజని అదితియని వేదం లో చెప్పబడింది. అదితి భగవంతుని అఖండ, అనంత, పరమోత్కృష్ట చేతనా ప్రతిరూపం. ఆ చైతన్యం అంతటా వర్తమానమై, అంతటా స్థిరమై, సర్వజన ఆత్మస్వరూపమై వెలుగొందుతుంది కనుకనే ప్రపంచ మనుగడ సాధ్యమవుతుంది.

అదితి ద్యౌరదితిరంతరిక్ష మదితిర్మాతా సపితా సపుత్రః
విశ్వ దేవా అదితిః పంచ జనా అదితిర్జాతమదితిర్జనిత్వమ్‌॥

అనంతమైన విశ్వంలో అదితియే ద్యులోకం, స్వర్గలోకం, ప్రాణలోకం. అదితియే అంతరిక్షం. అదితియే తల్లీ, తండ్రి, కొడుకూ, కూతురు. అదితియే భగవంతుడు, దేవదేవతలు. అదితియే అనేక కోట్ల జీవరాశి. పుట్టేది ఆమే. పుట్టించేది ఆమె.

పరమాత్మగా, ప్రకృతిగా, ఆది మాతగా, ఆది పితగా, ఆమె తొలి సంతానంగా, అద్వితీయ పరాచేతనగా అభివర్ణించబడిన అదితి లోకాలను ప్రకాశింపజేస్తుంది. కోటానుకోట్ల జీవరాశుల జీవన చైతన్యం ఆమె. లోకంలో ఇంతకు మునుపు పుట్టినవి, ఉత్పన్నమైనవి, ఆవిర్భవించినవి ఆమె. వర్తమానంలో కనిపించేవి సమస్తం ఆమె. రాబోవు కాలంలో జనించేవి, ఉత్పన్నమయ్యేవి, ఆవిర్భవించేవి ఆమె. అదితికి భిన్నమైనది ఈ ప్రపంచంలోనే లేదు. ఇదే ఋషి దృష్టి, దివ్య దృష్టి. ఇంతకుమించిన భావనకు రూపం కనిపించదు. భావ మయజగతికి చైతన్యంతో ప్రాణం పోసిన అద్భుత తత్తం అదితి.

చైతన్య జనితం అయిన ప్రపంచంలో భావజగతిని పాలించే మానవ జీవితం అనంత కోటి జీవరాశుల్లో ప్రత్యేకం. ఆలోచనారాహిత్యంతో కొనసాగే మానవత్తం పరిమళించదు. ప్రపంచ మనుగడలో రాణించదు. భావమే భాగమై పరమాత్మ తత్తాన్ని అర్థం చేసుకునేంత ఉన్నతి రావాలి. కంటికి కనిపించని భగవత్తత్తం భావజగతిలో చైతన్యమై ప్రకాశిస్తుంది. దాన్ని తెలుసుకోగలుగడమే జీవన పరమార్థం.
అదితి స్వరూప తత్తాన్ని వేదం అభివర్ణించడంలో అంతరార్థం ఏమిటంటే, అంతటా అనంతమై అద్వితీయమై భాసిస్తూనే ఏకమై నిలిచే ఆలోచనా దృక్పథం పరమాత్మగా తెలియజెప్పాలనే. మన ఆలోచనా ప్రపంచం, భావజగతి జీవన సార్థకతను చేరుకునే గమ్యాన్ని చూపించాలనే. చైతన్యశక్తి ప్రసాదిం చే ఆత్మ విశ్వాసంతోనే జీవజాతి ఉన్నతి సుసాధ్యం.
- ఇట్టేడు అర్కనందనాదేవి

3904
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles