స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాన్ని ప్రపంచానికి అందించిన ఫ్రాన్స్‌లో తద్భిన్నమైన విలువలు కలిగిన మితవాద పార్టీలు ఆధిక్యంలోకి వస్తుండటం చారిత్రిక వైచిత్రిగానే కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన యురోపియన్ యూనియన్ ఎన్నికల్లో మితవాద పార్టీలు బలపడటాన్ని చూసి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ పార్లమెంట్‌కు మూడేండ్లు ముందుగా మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. అయితే ఆయన ఎత్తుగడ వికటించి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.
మ్యాక్రాన్ నేతృత్వంలోని మధ్యేవాద కూటమి వెనుకబడిపోగా, మెరైన్ లెపెన్ నేతృత్వంలోని తీవ్ర జాతీయవాద పక్షమైన నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) అనూహ్యంగా ముందుకు దూసుకువచ్చింది. జూన్ 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆర్ఎన్కు 33 శాతం, వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 28 శాతం, మ్యాక్రాన్ కూటమికి 20 శాతం ఓట్లు వచ్చాయి. తీవ్ర జాతీయవాదులు, వామపక్షవాదులు పోటాపోటీగా నిలువగా, మధ్యేవాదులు చాలా వెనుకబడిపోయారని ఫలితాలు సూచిస్తున్నాయి.
తొలి విడత పోలింగ్ అనేది ఒక రకంగా క్రీడల్లో క్వాలిఫయింగ్ రౌండ్ లాంటిది. 577 స్థానాలు గల ఫ్రెంచ్ పార్లమెంటులో 289 మ్యాజిక్ ఫిగర్. అంటే ఆ గీత దాటిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది. అయితే ఏ ఒక్క పార్టీకి గానీ, కూటమికి గానీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నిబంధనల ప్రకారం 7వ తేదీన రెండో విడత పోలింగ్ జరుగుతుంది.
తీవ్ర జాతీయవాద ఆర్ఎన్ ఆధిక్యంలోకి రావడంపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. జాత్యహంకార, వర్ణ వివక్ష భావాలతో ఆ సంస్థ పురుడు పోసుకోవడమే అందుకు కారణం. కాలక్రమంలో తీవ్ర భావాలను కొంత తగ్గించుకున్నప్పటికీ పూర్తిగా మారిపోయిందని చెప్పగలిగే పరిస్థితి లేదు. శరణార్థుల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలను ఆ పార్టీ ఇప్పటికీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది.
అల్జీరియాతో పాటుగా ఫ్రాన్స్ వలస పాలన కింద నలిగిన అనేక తృతీయ ప్రపంచ దేశాలవారు రకరకాల కారణాల వల్ల శరణార్థులుగా వచ్చి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మైనారిటీ మతాలకు చెందినవారే. వీరికి వ్యతిరేకంగా మెజారిటీ వర్గాల్లో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే విధానాల్లో ఆర్ఎన్ తీరు పెద్దగా మారలేదు. అందుకే దేశంలోని మైనారిటీ వర్గాల్లో తాజా ఎన్నికల ఫలితాలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే ఇల్లలకగానే పండుగ కానట్టు అతిపెద్ద గ్రూపుగా ఆర్ఎన్ అవతరించినప్పటికీ ఆ పార్టీ దూకుడుకు రెండో విడతలో కళ్లెం వేసేందుకు వామపక్ష, మధ్యేవాద శక్తుల మధ్య పునరేకీకరణ జరుగుతుండటం గమనార్హం.
నిజానికి తీవ్ర జాతీయవాద సమస్య ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాదు. దాదాపు యూరప్ దేశాలన్నింటా ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోయింది. అమెరికాలోనూ ట్రంప్ వంటి నాయకులు చేస్తున్నది ఇదే. ముఖ్యంగా వలస పాలన సాగించిన దేశాల్లో సమస్య ఎక్కువగా ఉంది. వలసాధిపత్య గత చరిత్ర వల్ల ఏర్పడిన అపరాధ భావన కారణంగా తృతీయ ప్రపంచ దేశాల నుంచి అడ్డూఅదుపూ లేకుండా శరణార్థులను అనుమతించడం జరిగింది.
ఇది స్థానికుల్లో వ్యతిరేకతకు దారితీసింది. మాజీ వలస దేశాల నుంచి వచ్చే జనాల పట్ల వ్యతిరేకత రెచ్చగొట్టే రాజకీయాలూ అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై శరణార్థుల ప్రభావం పడుతున్నదని, వారు స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణమవుతున్నారని ఊదరగొట్టే తీవ్ర జాతీయవాదులు ఓటర్లపై ప్రభావం చూపగలుగుతున్నారు. అయితే తీవ్ర జాతీయవాదానికి కొత్తగా బలం పుంజుకుంటున్న వామపక్షవాదం గట్టి పోటీ ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ఎన్నికల్లో అంతిమ విజేతలుగా ఎవరు నిలుస్తారనేది ఉత్కంఠభరితంగా మారింది.