అంగళ్లకు ఆదరణ


Tue,July 23, 2019 12:32 AM

కొల్చారం: పట్టణప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్‌లో ఏర్పాటు చేసే షాపింగ్‌మాళ్లలో ప్రతి వస్తువు ఒకేచోట లభిస్తుంది. రోజంతా బిజీ...బిజీగా గడిపేవారు సాయంత్రానికి ఇంటికి వెళ్లేసరికి నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు, చెప్పులు, కూరగాయలు, మాంసం వగైరా వాటి కోసం షాపింగ్‌మాళ్లకు పరుగులు తీస్తుంటారు. కానీ గ్రామీణప్రాంతాల్లో వారం వారం నిర్వహించే అంగళ్లు షాపింగ్‌మాళ్లను తలపిస్తున్నాయి. అన్ని వస్తువులు ఒకేచోట దొరుకుతాయి. అంగళ్ల నిర్వహణతో గ్రామ పంచాయతీలకు సైతం ఆదాయం సమకూరుతుంది. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు ఆదాయమే తప్ప సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి.
ఆధునిక యుగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో సైతం పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి... పట్టణాల్లో ప్రైవేటు వ్యాపారులు సూపర్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రజలు నేడు పనుల దృష్ట్యా బిజీబిజీగా గడుపుతున్నారు. మార్కెట్‌కు పోయే తీరకలేని వారిని చూస్తున్నాం. ఇవన్నీ మార్కెట్‌లో లభిస్తున్నా... అంగళ్లలో లభించే తాజాకూరగాయలు కోల్డ్ స్టోరేజీల్లో దొరకవు... అంతేకాదు సూపర్ మార్కెట్‌లో దొరికే నిత్యావసర సరుకులు అధిక ధరలతో పేదజనానికి అందుబాటులో లేకుండా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ప్రతి వారం జరిగే అంగళ్లు ఆదరణ తగ్గకుండా సాగుతున్నాయి.. మారుమూల గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులైన ఉల్లిగడ్డ, పసుపు, అల్లంఎల్లిగడ్డ, మిరపకాయలు, బట్టలు, కూరగాయలు, పాడిపశువులు, మేకలు, గొర్రెలు కొనుగోలు చేయాలంటే అంగడికి పోవాల్సిందే. వారం వారం జరిగే సంతల్లో ప్రజల సందడి రోజురోజుకు ఎక్కువవుతూనే ఉంది. మెదక్ డివిజన్‌లోని మెదక్, టేక్మాల్, పోతంశెట్‌పల్లి, నర్సాపూర్, జోగిపేటలో జరిగే వారాంతపు సంతలు విశిష్ట ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి. కొల్చారం మండలంలోని పోతంశెట్‌పల్లి, రంగంపేట, దుంపలకుంట చౌరస్తా, కొల్చారంలలో ప్రతి వారం అంగడి జరుగుతుంది. మండలంలోనే పోతంశెట్‌పల్లి చౌరస్తాలో ప్రతి బుదవారం జరిగే అంగట్లో పశువుల క్రయవిక్రయాలు, చేపలు, నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు, బట్టలు దొరుకుతాయి. మెదక్-హైదరాబాద్, మెదక్- సంగారెడ్డి ప్రధాన కూడలిపై ఈ అంగడి ఎన్నో సంవత్సరాలుగా సాగుతుండగా మెదక్, పాపన్నపేట, కౌడిపల్లి, జోగిపేట, కొల్చారం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పశువుల వ్యాపారులు ఇక్కడికి తరలివస్తుంటారు. రంగంపేటలో ప్రతి శుక్రవారం జరిగే అంగట్లో మండలంలోని సగ భాగం గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తరలివస్తారు. ఈ ప్రాంతంలోని ప్రజలు వారం రోజులకొకసారి అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటారు. అంతేకాకుండా రంగంపేటలోని అంగట్లో బట్టల వ్యాపారం జోరుగా సాగుతుంది. మండల కేంద్రమైన కొల్చారంలో ప్రతి సోమవారం జరిగే సంతలో తాజా కూరగాయలకు ప్రాధాన్యత. ఇక ఇటీవలనే ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ప్రారంభమైన దుంపలకుంట చౌరస్తాలో మంగళవారం జరిగే అంగట్లో మేకలు, గొర్రెలతో పాటు తాజా కూరగాయలు దొరుకుతుండడంతో కొల్చారం, కౌడిపల్లి మండలాలకు పలు గ్రామాల ప్రజలు తాజా కూరగాయిలు కొనుగోలు చేస్తుంటారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...