విధుల్లో చేరిన పదమూడు మంది ఉద్యోగులు


Wed,November 6, 2019 02:57 AM

మహబూబ్‌నగర్‌ క్రైం /వనపర్తి విద్యావిభాగం /గద్వాల టౌన్‌: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు ఎనిమిది మంది ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నట్లు ఉన్నతాధికారులకు సమ్మతి పత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏఎస్పీ చాంబర్‌లో ఆర్టీసీ కార్మికులు చేరుకొని విధుల్లోకి హాజరయ్యేందుకు ముందుకు వచ్చారు. విధుల్లో చేరేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరడంతో జిల్లా పోలీసు అధికారులు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. విధులకు హాజరు కావాలనుకున్న ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా వచ్చి విధులకు హాజరైతే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వనపర్తి డిపో సహాయ మేనేజర్‌ దేవేందర్‌గౌడ్‌, మోసిన్‌భాను అసిస్టెంట్‌ మేనేజర్‌ మహబూబ్‌నగర్‌ డిపో, కల్వకుర్తి డిపోకు చెందిన ఎండీ మతీన్‌ కండక్టర్‌ ఏఎస్పీ సమక్షంలో విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ టూటౌన్‌లో ముగ్గురు, డీఎస్పీ సమక్షంలో ఒకరు అదేవిధంగా నారాయణపేట డిపోకు చెందిన ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌నాయక్‌, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్‌ నాగరాజు, డ్రైవర్లు సత్యనారాయణ, జాకీర్‌ హుస్సేన్‌, వనపర్తి డీఎం దేవదానం సమక్షంలో విధుల్లో చేరారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల డిపోలో ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌(సీఐ)గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళి సమ్మతి పత్రం అందజేశారు. కల్వకుర్తి డిపోలో విధులకు హాజరవుతానని పేర్కొంటూ డ్రైవర్‌ వింజమూర్‌ శేఖర్‌ ఆర్టీసీ అధికారులకు సమ్మతి పత్రం అందజేశారు. అయితే, గతంలో శేఖర్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. 32 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడంతో ఈ నెల 5వ తేదీ వరకు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడంతో ఆర్టీసీ ఉద్యోగులు స్వతహాగా విధుల్లో చేరడానికి వస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌ కార్మికులు విధుల్లో చేరాలనే పిలుపు మేరకు చేరిన వారికి రక్షణ కల్పించేందుకు డిపో ఎదుట, ఎస్పీ కార్యాలయం, బస్టాండ్‌, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఉదయం నుంచే పోలీస్‌ బందోబస్తు, పికెటింగ్‌ నిర్వహించారు. ఉదయం నుంచి కార్మికులు విధుల్లో చేరుతారని భావించినప్పటికీ సాయంత్రమే వచ్చి విధుల్లో చేరారు. మిగతా కార్మికులు కూడా విధుల్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...