చెరువులు నింపడానికే మినీ రిజర్వాయర్‌


Wed,September 11, 2019 01:08 AM

మూసాపేట: పెద్దవాగుకు ఇరువైపులా ఉన్న గ్రామాల చెరువులు నింపడానికే వాగుమధ్యలో చెక్‌డ్యాంను మినీ రిజర్వాయర్‌గా నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మూసాపేట నిజాలపూర్‌ గ్రామాల మధ్యలో నిర్మించిన చెక్‌డ్యాం వద్ద మినీ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం కొనసాగుతున్న సర్వే పనులను మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. స్థానిక జెడ్పీటీసీతో పాటు ఆయా గ్రామాల నాయకులు, రైతులతో పాటు కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వాగువెంట నడిచి వెళ్లి చెక్‌డ్యాంను పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సర్వే పనులను పరిశీలించారు. సర్వే చేస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని, చెక్‌డ్యాంకు ఇరువైపులా కాల్వల మరమ్మతుతోపాటు అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టే విధంగా పూర్తి స్థాయిలో సర్వే చేయాలని చెప్పారు. అదేవిధంగా రైతుల పొలాలు నష్టపోకుండా చూస్తూ చెక్‌డ్యాం ఎత్తును పెంచే విధంగా సర్వే చేయాలని చెప్పారు. అక్కడి నుంచే కేఎల్‌ఐ డీసీ సత్యనారాయణతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడుతూ సర్వేపై ఆరా తీశారు. వాగు ఎంత ఎత్తు ఉంది. మూసాపేట చౌట చెరువులోకి నీళ్లు వెళ్లాంటే డిండును ఎంత ఎత్తు పెంచాలని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గొలుసుకట్టు కాల్వల ద్వారా చెరువులు నింపడానికే ఈ చెక్‌డ్యాంను మినీ రిజర్వాయర్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. తక్కువ నిధులతోనే చెక్‌డ్యాం ఎత్తును పెంచడం వల్ల మూసాపేట చెరువును కేఎల్‌ఐ నుంచి వస్తున్న వరద నీటితోనే నింపే అవకాశం ఉందని, మినీ రిజర్వాయర్‌గా మార్చడం వల్ల ఆ చెరువు నిండంతోపాటు, ఆ చెరువు కింద ఉన్న గ్రామాల చెరువులు, ఇటు నిజాలపూర్‌ మీదుగా లోకసముంద్రం నింపుతూ కందూరు మీదుగా మొత్తం 28 చెరువులను నింపే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సర్వే పనులు పూర్తి అయితే చెక్‌డ్యాం నిర్మాణం పూర్తి చేసేందుకు తనవంతు కృషిచేస్తామని చెప్పారు. కర్వెన ప్రాజెక్టు పూర్తయితే ఎప్పటికీ ఈ చెక్‌డ్యాం నిండుకుండలా కళకళాడుతుందని, చెరువులకు కూడా నిరంతరం నీరు అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. కావున రైతులు కూడా సహకరించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీటీసీ సభ్యుడు సీజీ గోవర్థన్‌, ఉపసర్పంచ్‌ భీమన్న, రైతు సమన్వయ సమితీ జిల్లా డైరెక్టర్‌ లక్ష్మీనర్సింహయాదవ్‌, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...